జీఎస్టీని సరళీకరించాలని ఐబీఏ సూచన
ఆల్కహాల్‌లేని పానీయాలపై జీఎస్టీని సరళీకరించాలని ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ సూచించింది. డ్రింక్స్‌లో ఉండే చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు విధించాలని తెలిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా ప్రోత్సహిస్తే ఆల్కహాల్‌లేని పానీయాల మార్కెట్ దేశీయంగా 2030 వరకు రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
కార్బొనేటెడ్ పానీయాలపై పన్ను విధానాల మీద ఐసీఆర్‌ఐఈఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.పి.మీనా మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఈ విభాగ పరిమాణం రూ.60,000 కోట్లుగా ఉంది. భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆల్కహాలేతర పానీయాలు(సీసాల్లోని నీరు, సాఫ్ట్ డ్రింక్స్) కీలకం. భవిష్యత్తులో భారత్ ఈ విభాగంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అవతరించనుంది. ప్రస్తుతం 20 లీటర్లు లేదా అంతకుమించి నీళ్ల సీసాలకు 12 శాతం జీఎస్టీ, 20 లీటర్ల లోపైతే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అలా కాకుండా ఒకే రేటు వర్తించేలా చూడాలి. నీళ్ల సీసాలన్నింటికీ 5 శాతం జీఎస్‌టీ విధించాలి’ అని సూచించారు.
ఇదీ చదవండి: పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం..!
దేశీయంగా, అంతర్జాతీయంగా నీళ్ల సీసాల సరఫరాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మీనా తెలిపారు. ఈ విభాగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ ప్రతిపాదన తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆల్కహాలేతర పానీయాల్లో చక్కెర స్థాయులు ఎక్కువ ఉంటే అధిక జీఎస్టీ, తక్కువ ఉంటే తక్కువ జీఎస్టీ విధించాలన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సమయంలో ఆల్కహాలేతర పానీయాలను హానికారక ఉత్పత్తుల కేటగిరీలో చేర్చారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు పునరాలోచించాలన్నారు. సాఫ్ట్‌డ్రింక్స్‌పై చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు నిర్ణయించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment