ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
కడప అగ్రికల్చర్: రైతులకు ఎంతో ఉపయోగపడే పరిశోధనస్థానం, కళాశాలను శెట్టిగుంట వద్ద ఏర్పాటు చేస్తుంటే అందుకు సహకరించాల్సింది పోయి మోకాలడ్డడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైల్వేకోడూరుకు చెందిన కొందరు టీడీపీ నేతలకు చురకలు అంటించినట్లు సమాచారం. ‘ప్రభుత్వభూమిపై కన్ను’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో రైల్వేకోడూరులోని మరోవర్గం నేతలు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం సదరు నేతలతో నేరుగా మాట్లాడినట్లు తెలిసింది. ‘పరిశోధన స్థానం వల్ల రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. వాటిని మనం బేరీజు వేసి ప్రభుత్వం వల్లనే ఉద్యాన రైతులు ఈ ప్రయోజనం పొందుతున్నారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా.. పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
అటువంటప్పుడు ఎందుకు దీన్ని అడ్డుకోవడం’ అని నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఏమి పాలుపోని సదరు నేతలు బిక్కమొహం వేసినట్లు రైల్వేకోడూరు టీడీపీలోని ఒక వర్గం వారు చర్చించుకుంటున్నారు. టీడీపీ నేత తీరును ఆ వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే భూములు, స్థలాలను తీసుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదని సీఎం వారించినట్లు తెలిసింది. 2324 సర్వే నంబరులో లెటర్ 1,2,3,4,5లో ఉన్న 40ఎకరాల భూమిని ఉద్యాన పరిశోధన స్థానానికి, కళాశాలకు కేటాయిస్తారో లేదో తెలుసుకుని, దానికి కేటాయించకపోతే పండ్ల రసాల ఫ్యాకరీ పెడుతున్నట్లు పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకుని భూమిని ఇవ్వాలని కోరితే ఇప్పిస్తామని సీఎం అన్నట్లు తెలిసింది. పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని సీఎం హెచ్చరించినట్లు పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment