కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు స్క్రీనింగ్ టెస్టు
కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు స్క్రీనింగ్ టెస్టు
Published Mon, Nov 7 2016 9:29 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– అత్యాధునిక టెక్నాలజీతో దేహదారుఢ్య ఎత్తు, ఛాతీ కొలతలు సేకరణ
– ఆర్‌ఎఫ్‌ఐడీ బార్‌కోడింగ్ ద్వారా పరుగు సమయం లెక్కింపు
– బయోమెట్రిక్ విధానంతో అభ్యర్థుల ఫొటో, వేలిముద్రల సేకరణ
– ఒరిజినల్ సర్టిఫికెట్ లేని 172 మంది అభ్యర్థులు వెనక్కు
– మొదటిరోజు 590 మంది హాజరు... 362 మంది ఎంపిక
కర్నూలు : పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో రాష్ట్రంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ కొలతలను గతంలో టేపు ఆధారంగా పోలీసు సిబ్బంది కొలిచేవారు. ఇందులో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈసారి కంప్యూటర్ సాయంతో ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. ఎత్తు కొలిచే పరికరం ముందు నిలబడగానే కంప్యూటర్‌లో ఆటోమేటిక్‌గా ఎత్తు, బరువు నమోదవుతుంది. అభ్యర్థి చెస్ట్‌కు మిషన్‌తో అనుసంధానమైన టేపును అమర్చగానే ఆటోమేటిక్‌గా ఛాతీ కొలతలను కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేస్తుంది.
ఆరు జిల్లాల అభ్యర్థులకు ఏపీఎస్పీ మైదానంలోనే...
పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్ల భర్తీకి (డ్రైవర్, మెకానిక్) ప్రభుత్వం అనుమతించడంతో స్థానిక ఏపీఎస్పీ మైదానంలో సోమవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి అర్బన్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఆరు జిల్లాలకు సంబంధించిన 23,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుళ్ల భర్తీ కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికృష్ణను ప్రభుత్వం చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించింది. ఆయన పర్యవేక్షణలో మొదటిరోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వచ్చే నెల 3వ తేదీ వరకు రోజుకు వెయ్యి మంది అభ్యర్థులను రప్పించి సర్టిఫికెట్ల పరిశీలన ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు.
మొదటిరోజు 362 మంది ఎంపిక...
మొదటి రోజు వెయ్యి మందిని దేహదారుఢ్య పరీక్షలకు ఆహ్వానించగా 590 మంది హాజరయ్యారు. ఏపీఎస్పీ పటాలం ప్రధాన గేటు వద్దనే అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను పరిశీలించి వారికి లోపలికి అనుమతించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు, ఛాతీ కొలతలను శారీరక సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ స్వయంగా దగ్గరుండి ఈ పరీక్షలను పర్యవేక్షించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా(ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్) పరీక్షలు నిర్వహించారు. అందులో బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగుపందెం నిర్వహించారు.
పరుగుపందెం ఇలా...
దేహదారుఢ్య పరీక్ష ల్లో ఎంపికైన అభ్యర్థులను బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ డివైజెస్(ఆర్‌ఎఫ్‌ఐడీ) ద్వారా ట్రాక్ వెంట అభ్యర్థులు పరిగెత్తేటప్పుడు ఎంత సమయంలో ఎన్ని రౌండ్లు పూర్తి చేశారన్నది బార్ కోడింగ్ ద్వారా అభ్యర్థుల సమయాన్ని లెక్కిస్తున్నారు. బార్‌కోడ్ కలిగిన నంబర్ ప్లేట్‌ను అభ్యర్థి ఛాతీకి తగిలిస్తారు. అందులో అమర్చిన సెన్సార్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. అభ్యర్థి పది నిముషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగు పూర్తి చేయాలి. పది నిముషాలకు మించి ఒక సెకండ్ దాటినా ఫెయిల్ అయినట్లే. సకాలంలో పరిగెత్తి విజయం సాధించిన అభ్యర్థుల జాబితా కంప్యూటర్ ద్వారా వెంటనే బయటకు వస్తుంది. మొదటిరోజు 362 మంది స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించారు. ప్రతిరోజు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఏర్పాట్లలో అసౌకర్యం, విద్యుత్ సరఫరాల అంతరాయం నేపథ్యంలో మొదటిరోజు ఉదయం 7:30 గంటలకు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాని 172 మంది అభ్యర్థులను క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీల(గజిటెడ్ సంతకంతో)తో అభ్యర్థులు హాజరుకావాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement