సాక్షి, హైదరాబాద్: ఒక నేరం జరిగితే ఆ నేరం చేసింది ఎవరన్నది గుర్తించేందుకు కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతోంది. కొన్ని కేసుల్లో నేరస్థుల వేలిముద్రుల కీలకమైతే, అవి దొరకని పక్షంలో అనుమానితులను ప్రశ్నించడం చేస్తూ వస్తున్నారు. ఇక కొన్ని హత్య కేసుల్లో డీఎన్‌ఏ టెస్టింగ్, మరికొన్ని నేరాల్లో సాంకేతిక ఆధారంగా కాల్‌డేటా, మొబైల్ అనాలిసిస్ టూల్స్ వంటివి వాడుతూ చేధిస్తున్నారు.
అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం, అలసత్వం వహించినా నిందితుడి గుర్తింపు కష్టసాధ్యమవుతోంది. టెక్నాలజీ సాయంతో కరుడుకట్టిన నేరస్తులను సైతం గుర్తించగలమని విదేశీ పోలీసులు రుజువు చేస్తున్నారు. ‘బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్’విధానాన్ని ఉపయోగించి కీలక కేసుల్లో నిందితులను గుర్తిస్తున్నారు. తాజాగా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పోలీస్ విభాగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ అంటే..
యూఎస్ ఫెడరల్ ఏజెన్సీలు బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఘటనా స్థలిలో ఎలాంటి ఆధారాలు సేకరించకున్నా సంబంధిత ఘటనతో అనుమానితుడికి సంబంధం ఉందా లేదా అని మెదడు తరంగాల ద్వారా గుర్తించేందుకు బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ విధానం విశేషంగా కృషి చేస్తోంది.
యూఎస్ ఏజెన్సీలు 99 శాతం కేసుల్లో ఈ వ్యవస్థ స్పష్టమైన, కచ్చితత్వమైన ఆధారాలు సేకరించగలిగిందని, దీని వల్ల అన్ని కేసుల్లో శిక్షలు పెరగడం జరుగుతోందని ఇటీవల తెలంగాణ పోలీస్ అధికారులకిచ్చిన డెమోలో స్పష్టం చేశారు. అయితే ఈ విధానానికి, పాలిగ్రాఫ్‌కు పోలిక ఉంటుందని అనుమానం వ్యక్తం చేయగా.. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంటుందని సంబంధిత అధికారులు ప్రజేంటేషన్‌లో పేర్కొన్నారు.
బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ అనుమానితుడి భావోద్వేగ పరిస్థితులపై ఆధారపడకుండా బ్రెయిన్ ఇచ్చే సమాచారం పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఏదైనా నేరం జరిగితే ఆ నేరం జరిగిన తీరు, మృతుడు, లేదా బాధితుడి వివరాలు చెబితే చాటు అనుమానితుడి మెదడులో కలిగే తరంగాల ఆధారంగా సంఘటన తీరు వెలుగులోకి వస్తుంది. ఒకవేళ సంబంధిత ఘటనకు తానే బాధ్యుడైతే ఎలా చేశాడో సైతం మెదడులోని తరంగాలు ఈ వ్యవస్థ ద్వారా బయటపడతాయి. సాక్షిగా మొత్తం ఘటన చూసినా కూడా ఆ తరంగాలు ఘటనను వివరించేలా బ్రెయిన్ ప్రింటింగ్ ఆధారాలను వెల్లడిస్తుంది.
ఉగ్రవాద కేసుల్లో కీలకంగా..
బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ విధానం ఉపయోగించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉగ్రవాదంపై దర్యాప్తు విభాగాలు పైచేయి సాధిస్తున్నాయి. పేలుళ్లు, వాటి కుట్రకు పాల్పడ్డ వారిని గుర్తించడంతో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అనుమానితుడి వద్ద విధ్వంసాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది, వారు ఎలా దాడులకు కుట్ర పన్నారనే సమాచారం ఈ టెక్నాలజీ ద్వారా దర్యాప్తు సంస్థలు గుర్తించగలుగుతున్నాయి.
అనుమానితుడి మెదడులో ఉగ్రసంస్థకు సంబంధించిన శిక్షణ, విధ్వంసాలకు చెందిన ప్లాన్ ఉంటుంది. బయటకు వ్యక్తపరిచేందుకు వ్యతిరేకించినా బ్రెయిన్ ప్రింటింగ్ ద్వారా ఆ స్కెచ్ మొత్తం తెలిసిపోతుందని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ తరహా సమాచారం సాధారణ వ్యక్తుల మెదడులో ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి అనుమానితుడు అయితేనే బయటపడుతుందని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా బయటపడ్డ వ్యక్తికి పేలుళ్ల కుట్రలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానో సంబంధం ఉందనేది ఇట్టే తెలిసిపోతుందని, స్లీపర్ సెల్‌గా పనిచేస్తున్నట్లు తేలితే దర్యాప్తు అధికారికి మరింత సమాచారం తెలుసుకోవడం సులువవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
అందుబాటులోకి తెచ్చేందుకు యత్నాలు..
హైజాకింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇమిగ్రేషన్, బోర్డర్ సెక్యూరిటీ రహస్యాలు, కిడ్నాపులు, సైబర్ క్రైం, గూఢచర్యం, డ్రగ్స్ రవాణా, నకిలీ కరెన్సీ రవాణా, పేలుడు కుట్రలు తదితరాలను తేల్చడంలో ఈ వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
అయితే ప్రస్తుతం దేశంలోని పలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ ప్రయత్నిస్తోంది. ఒప్పందాలపై తుది దశ చర్చలు జరిగినట్లు రాష్ట్ర నిఘా వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఒప్పందాలు కుదిరితే ఈ వ్యవస్థను రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఐపీఎస్ ఒకరు వెల్లడించారు.
ఎరుపు రంగు వస్తే నిందితుడే..
బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా నిందితులను గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అనుమానితుడికి తల మొత్తం కవరయ్యేలా ఉన్న హెడ్‌సెట్ పెట్టి నిష్ణాతులు మాత్రమే టెస్టింగ్ చేస్తారు. ఈ ప్రక్రియలో మూడు రకాల తరంగాలు ఉంటాయి. మెదడు స్పందించే తీరులో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగు తరంగాలుగా విభజించారు.
అనుమానితుడి మెదడు తరంగాలు ఎరుపు రంగులో వస్తే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలిసినట్లుగా భావిస్తారు. అదే ఆకుపచ్చ తరంగాలు వస్తే ఘటనకు అనుమానితుడికి ఎలాంటి సంబంధం లేన్నట్లు లెక్క. ఇక నీలి రంగు తరంగాలు వస్తే ఘటనకు సంబంధించి పాక్షికమైన సమాచారం అనుమానితుడి వద్ద ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని డెమోలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment