సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై సీనియర్ ఐపీఎస్‌లలో అసంతృప్తి కనిపిస్తోంది. టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో ‘మ్యాన్యువల్ వర్క్’పై నిర్లక్ష్యం కనిపిస్తోందని.. ప్రొఫెషనలిజం తగ్గిపోతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారుల్లో ఆధారాల సేకరణ, న్యాయపరంగా కేసులను ముందుకు తీసుకెళ్లడం వంటి సామర్థ్యాలు కనిపించడం లేదన్న భావన వినవస్తోంది. ఇదే సమయంలో వారం రోజులుగా వాట్సాప్, ఇతర సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ సందేశం.. ఇప్పుడు పోలీసు శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొంతకాలంగా పోలీసు శాఖలో టెక్నాలజీ వినియోగం పెరగడం, ఇప్పుడదే టెక్నాలజీ కారణంగా కొత్త ఇబ్బందులు తలెత్తుతుం డటం సీనియర్ ఐపీఎస్‌లలో చర్చకు దారితీసింది. అసలు పోలీసింగ్ ఏంటి, ప్రస్తుతం చేస్తున్నదేమిటి అంటూ పోలీసువర్గాల్లో అంతర్గతంగా వాడివేడి చర్చ సాగుతోంది.
అసలు ‘పోలీసింగ్’ చేస్తున్నామా?
‘‘పోలీసు శాఖకు ఆధునీకరణ అవసరమే. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ సిద్ధాంతంతో ముందుకెళ్లాలి. కానీ ఇప్పుడంతా టెక్నాలజీపైనే ఆధారపడి.. పోలీసు శాఖ సాంప్రదాయ లుక్‌ను కోల్పోయింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దూరమవడం వల్ల ఇబ్బందిపడే పరిస్థితి వస్తోంది..’’ అని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఓ సీనియర్ ఐజీ పోస్టు పెట్టారు. ఓ కమిషనర్ పెట్టిన క్యాంపుల సమాచారాన్ని ఉటంకిస్తూ.. ‘‘మనం పోలీసింగ్ చేస్తున్నామా? లేక ఇంకేమన్నా స్వచ్చంద సంస్థల కార్యక్రమాలు చేస్తున్నామా?..’’ అని ప్రశ్నించారు. ప్రతీక్షణం టెక్నాలజీ మీదే ఆధారపడి పనిచేయడం భవిష్యత్ పోలీసింగ్‌కు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను ఢిల్లీలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్ సమర్థించారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే.. పోలీసు వృత్తి భవిష్యత్‌లో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు అధికారుల పోస్టులను చూసి.. ఆ గ్రూపులోని మొత్తం 96 మంది ఐపీఎస్ అధికారులు నిర్ఘాంతపోయారు. దీనిపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ మొదలైంది.
అసలెందుకీ అసంతృప్తి?
టెక్నాలజీ ఎంత పెరిగినా పోలీసు వ్యూహాలు ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటాయని ఢిల్లీలో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేర్కొన్నారు. టెక్నాలజీ అనేది ఒక ఆధారం మాత్రమేనని.. కానీ దానిపైనే పూర్తిగా ఆధారపడి ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏడెనిమిదేళ్ల క్రితం వరకు గ్రామాల్లో, నగరాల్లో పోలీసు శాఖకు బలమైన ఆధారంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేసేదని... గ్రామాల్లో మైత్రి సంఘాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో శాంతి కమిటీలు పోలీసు శాఖకు వెన్నుదన్నుగా నిలిచాయని పేర్కొన్నారు. కానీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థలు కనుమరుగై పోతున్నాయన్నారు. గతంలో ఏదైనా ఘటన జరిగితే గ్రామాల్లోని మైత్రి కమిటీ సభ్యులు పోలీసులు వచ్చే వరకు మానిటరింగ్ చేసేవారని.. ఇప్పుడు సరైన మానిటరింగ్, నిఘా ఉండటం లేదని స్పష్టం చేశారు.
సిబ్బందిపై పట్టు పోతోంది..
‘‘1990 నుంచి 2010 వరకు కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్‌ల బదిలీ వరకు అంతా పోలీసు శాఖ చేతుల్లోనే ఉండేది. ఓ కానిస్టేబుల్ బదిలీ కోసం గతంలో ఎమ్మెల్యే వచ్చి ఎస్పీనో, డీఐజీనో కలసి విన్నవించుకునేవారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సిఫార్సు చేస్తేగానీ పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇది కూడా పోలీసుశాఖలో అసంతృప్తికి కారణం..’’ అని మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎస్పీ స్థాయి అధికారులు తమ పరిధిలోని కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయలేని దుస్థితి ఏర్పడిందని.. ఇది పోలీసు ప్రొఫెషనలిజానికి ఇబ్బందిగా ఉందని స్పష్టం చేశారు. తప్పు చేసిన అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తీసుకోలేని విధంగా రాజకీయ ఒత్తిళ్లున్నాయని పలువురు సీనియర్ ఐపీఎస్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సరైన శిక్షణ కూడా లేదు..
కమిషనరేట్ల నుంచి గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్ల వరకు బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని ఐపీఎస్‌లు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఎస్సైలలో చాలా మందికి కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు ఎలా చేయాలో కూడా తెలియడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఠాణాల్లోని రైటర్లపై ఆధారపడి ఎఫ్‌ఐఆర్‌లు, కేసు డైరీలు, రిమాండ్ రిపోర్టులు, చార్జిషీట్లు ఫైల్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎస్పీలు కూడా మొర పెట్టుకుంటున్నారు. ఒక ఠాణా పరిధిలో క్రైమ్ హాట్‌స్పాట్ ఏంటి, ఏ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, దానికి కారణమేంటి, ఎలా తగ్గించాలి, నేరస్తులను ఎలా నియంత్రించాలి.. వంటి అంశాలపై లెగ్‌వర్క్ ఎక్కడా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆధారాల సేకరణ, న్యాయపరంగా కేసును ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా పట్టు ఉండటం లేదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment