ఒంగోలు క్రైం: దొంగలను పట్టుకోవటంలో టెక్నాలజీని వినియోగించాలని జిల్లా ఎస్పీ బూసరపు సత్య ఏసుబాబు పోలీసు అధికారులకు సూచించారు. కేసుల పరిశోధనను వేగవంతం చేయాలని చెప్పారు. ఒంగోలు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న, ప్రస్తుతం పరిశోధనలో ఉన్న కేసుల విషయంలో అలసత్వం వహించరాదని హెచ్చరించారు. జిల్లాలో లాక్‌డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్)గురించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రతి చోటా తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వారం పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించి మీ పరిధిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలని, అందరికీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గురించి పూర్తి స్థాయిలో
అవగాహన కల్పించాలని ఆదేశించారు. సెంట్రల్ కంప్‌లైంట్ సెల్‌లో(ఎస్పీ గ్రీవెన్స్) ఉన్న అర్జీలు పెండింగ్ లేకుండా చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, జాతీయ, రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చిన పిటిషన్లు, మెజిస్టీరియల్ విచారణలో ఉన్నవి, జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న అర్జీల గురించి అధికారుల నుంచి వివరాలు రాబట్టారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా సమీక్ష సమావేశానికి సమయం కేటాయించిన ఎస్పీ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే పలువురు పోలీసు అధికారులకు మెమోలు, చార్జ్ మెమోలు ఇచ్చినట్లు తెలిసింది.
జిల్లాకు 896 అధునాతన సీసీ కెమెరాలు
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 896 అధునాతన సీసీ కెమెరాలు మంజూరు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నేర సమీక్షా సమావేశంలో సీసీ కెమెరాల గురించి పోలీస్ అధికారులకు వివరించారు. ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ ప్రాజెక్ట్ తరుపున ఫిక్స్‌డ్ కెమెరాలు 660, పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు 236 మొత్తం 896 సీసీ కెమేరాలు జిల్లాకు కేటాయించినట్టు చెప్పారు. వీటిని జిల్లాలో కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, చీరాల, చీమకుర్తి, అద్దంకి, కందుకూరు ప్రాంతాల్లో బిగించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మాట్రిక్స్ సెక్యూరిటీ సర్వు్యలెన్స్ ఎండీ కేఎస్‌ఎన్.రాజు సీసీ కెమెరాల పనితీరును వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కెమెరాలు ఆటో మేటిక్ నంబర్ సిస్టం, రెడ్‌లైట్ వయోలేషన్, పేషియల్ రికగైజేషన్‌తో చాలా శక్తివంతంగా పనిచేస్తాయన్నారు. సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్)ఏబీటీఎస్.ఉదయరాణి, ఏఆర్ ఏఎస్పీ టి.శివారెడ్డి, మార్కాపురం ఓఎస్డీ లావణ్య లక్ష్మి, ఎస్‌బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు, డీసీఆర్‌బీ డీఎస్పీ బి.మరియదాస్, డీఎస్పీలు బి.లక్ష్మీ నారాయణ, కేశన వెంకటేశ్వరరావు, టి.శ్రీధర్, సబ్ డివిజనల్ డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment