ఈ-ప్రగతితో అవినీతికి చెక్ శాసనసభలో సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2018 నాటికి అన్ని ఇళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు పురోగమనంలో ఉందన్నారు. పౌరులందరికీ నాణ్యమైన, తక్కువ సమాచార సామర్థ్యాన్ని అందిస్తామన్నారు. ఫైబర్‌గ్రిడ్, ఈ-ప్రగతి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శని వారం శాసనసభలో ప్రకటన చేశారు. ఇందులోని ముఖ్యాంశాలు..
♦ రాష్ట్రంలో 61 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ భూగర్భంలో వేయాల్సి ఉంటుంది. దీనికి రూ.4,700 కోట్లు ఖర్చవుతుంది. మూడేళ్లు పడుతుంది. ఈ కారణం గా తొలిదశ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ స్తంభాలపైనే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ వేస్తున్నాం. దీనికి రూ.333 కోట్లతో, తొమ్మిది నెలల్లోనే పూర్తవుతుంది.
♦ కేబుల్ టీవీ, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, టెలి కాం సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, మరింత ఆదాయం పెరిగేలా చూస్తాం. డిజిటల్ ఏపీ ద్వారా బాటలు వేస్తున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు దీని వల్ల ప్రయోజనం ఉంటుంది. తొలిదశలో సర్వీస్ ఆపరేషన్ సెంటర్, నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్, ఏరియల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తారు.
♦ ఈఏడాది ఏప్రిల్ నాటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 2016 నాటికి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభమవుతాయి. జూన్ నాటికి 22,400 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు లక్ష్యం.
♦ విశాఖలో రూ.40 కోట్లతో నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్‌ను నెలకొల్పుతాం.
♦ నెలకు రూ.149 ప్యాకేజీతో కూడిన సేవలపై ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ ప్యాకేజీ కింద 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్, కనీసం 100 ఛానళ్లు, టెలిఫోన్ కనెక్షన్ వినియోగదారులకు ఇస్తాం.
♦ ఈ-ప్రగతి ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేస్తాం. తొలి దశలో 10 శాఖలను, సచివాలయం, రెండోదశలో మరో పది శాఖలను, మూడో దశలో 13 శాఖలను కలుపుతాం.