సాక్షి, అమరావతి : ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలన్నీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగాయని హైకోర్టుకు సీఐడీ నివేదించింది. ప్రాజెక్టు రూపకల్పన మొదలు అమలు వరకు ప్రతి దశలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.333 కోట్లకు పెంచారని చెప్పారు.
ఈ విషయాన్ని పలువురు వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇరుపక్షాలు పోటాపోటీగా వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తవడంతో తీర్పును రిజర్వ్ చేస్తూ జస్టిస్ సురేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకు ముందు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. టెండర్ నిబంధనలు, ఒప్పందంలో నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా కాంట్రాక్టు సంస్థ నాసిరకం సామగ్రిని ఉపయోగించిందని, దీనివల్ల ఖజానాకు రూ.115 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ఈ మొత్తాన్ని టెరాసాఫ్ట్ అధినేత, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్ తొలుత తన కుటుంబ సభ్యుల ఖాతాలకు, అక్కడి నుంచి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించారన్నారు. ఈ విషయంలో మరిన్ని వివరాలను రాబట్టేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అసలు వేమూరి హరిప్రసాద్ చంద్రబాబు సిఫారసుతోనే గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యుడు అయ్యారన్నారు. టెరాసాఫ్ట్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి కారణం లేకుండా టెండర్ గడువును పొడిగించారని తెలిపారు. చంద్రబాబు కార్యాలయం మౌఖిక ఆదేశాలతో టెండర్ గడువు చివరి తేదీకి ముందు రోజు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారని కోర్టుకు నివేదించారు. సంబంధిత శాఖకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఓ ఉన్నతాధికారి టెరాసాఫ్ట్‌కు ప్రాజెక్టు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారని, దీంతో ఆయన్ని బదిలీ చేసి, నామమాత్రపు పోస్టు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించలేదని, ఆ తరువాత సీఐడీ పలువురు వాంగ్మూలాలను నమోదు చేసి, లోతైన దర్యాప్తు చేసిందన్నారు.
దీంతో చంద్రబాబు పాత్రపై పలు ఆధారాలు లభించాయని, ఆయన్ని నిందితునిగా చేర్చామని అన్నారు. చంద్రబాబు కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తే కాక, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థత ఉన్న వ్యక్తి కూడానని కోర్టుకు వివరించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబుపై కేసు నమోదు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు.
చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఒక్క ఆధారం చూపలేదు
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ ఈ కేసు నమోదు చేసి రెండేళ్లయిందని, ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదని, చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెంపు పూర్తిగా సంబంధిత శాఖ అంతర్గత విషయమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లబ్ధి పొందినట్లు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపడంలేదన్నారు.
ఈ రెండేళ్లు చంద్రబాబు బయటే ఉన్నారని, ఒక్క సాక్షిని కూడా ప్రభావితం చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వ ప్రోద్బలంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతి కేసులో చంద్రబాబును జైలులోనే ఉంచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment