Global Economy Loss 5.5 Billion Dollars In 2021 Due To Internet Censorship - Sakshi
Sakshi News home page

సెన్సార్‌ దెబ్బ.. ఏకంగా రూ.40 వేల కోట్ల నష్టం!! ఆగిపోతే ఆగమేమో?

Published Mon, Jan 10 2022 7:52 AM | Last Updated on Mon, Jan 10 2022 9:03 AM

Global Economy Loss Billion Dollars In 2021 Due To Internet Censorship - Sakshi

ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా ఆగిపోతే ప్రపంచం ఏమైపోతుందో కదా! మరి వాటి సేవలకు విఘాతం కలిగిస్తే..

సెన్సార్‌ చిక్కులు సాధారణంగా ఈ మాటను తరచూ సినీ పరిశ్రమలో వింటుంటాం. అయితే వెబ్‌ కంటెంట్‌ విషయంలో ఆ చిక్కులు తక్కువే!. అందుకే ఫిల్మ్‌ మేకర్స్‌ డిజిటల్‌ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌ కంటెంట్‌కూ కోతలు తప్పడం లేదు. దీనివల్ల గ్లోబల్‌ ఎకానమీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. 


ఇంటర్నెట్‌ సెన్సార్‌షిప్‌ వల్ల పోయినేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డిజిటల్‌ సెక్యూరిటీ & రైట్స్‌ గ్రూప్‌ ‘టాప్‌10వీపీఎన్‌’ నివేదిక ప్రకారం.. ఈ నష్టం మొత్తంగా 5.5 బిలియన్‌ డాలర్లకు(సుమారు 40 వేల కోట్ల రూపాయలకు పైనే) ఉందని తెలుస్తోంది. 2021లో  ఇంటర్నెట్‌-సోషల్‌ మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్‌ అంతరాయం(షట్‌డౌన్‌), సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వాల ఆధిపత్యం-కఠిన చట్టాల అమలు, వెబ్‌ కంటెంట్‌పై ఉక్కుపాదం.. తదితర కారణాల వల్ల ఈ మేర నష్టం వాటిల్లినట్లు నివేదిక పేర్కొంది.  

ఎక్కువ నష్టపోయింది మయన్మార్‌ దేశం. సుమారు 2.8 బిలియన్‌ డాలర్ల(మన కరెన్సీలో 18 వేల కోట్ల రూపాయలపైనే) నష్టపోయింది. మిలిటరీ చర్యల వల్లే ఈ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇక నైజీరియా ఈ లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉంది. జూన్‌లో ట్విటర్‌ను బ్లాక్‌ చేయడం తదితర పరిణామాల వల్ల నైజీరియా 1.5 బిలియన్‌ డాలర్ల నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. 

భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ వల్ల ఈ నష్టం ప్రధానంగా వాటిల్లింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌పై నిషేధం-ఆంక్షలు, ఓటీటీ కంటెంట్‌పై ఉక్కుపాదం(పూర్తిస్థాయి సెన్సార్‌షిప్‌ రాలేదింకా), కరోనాపై ఫేక్‌- అశ్లీల కంటెంట్‌, ఇతర కథనాల నియంత్రణ  తదితర కారణాలు ఉన్నాయి. (లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది).

2021 ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ ఆంక్షలతో 486 మిలియన్‌ ప్రజలు ఇబ్బందిపడగా.. 2020లో 268 మిలియన్‌ ప్రజలు ఇబ్బందిపడ్డారు. అంటే 81 శాతం పెరిగిందన్నమాట. కేవలం ప్రభుత్వాల ఆంక్షలు-నిషేధాజ్ఞల కారణంగా వాటిల్లిన నష్టం 36 శాతానికి(2020తో పోలిస్తే) పెరిగింది.  

ఎలాగంటే.. 
ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌, కఠిన ఆంక్షల వల్ల ఈమేర నష్టం వాటిల్లితే.. ఒకవేళ మొత్తంగా ఇంటర్నెట్‌ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కదా!. అసలు నష్టం ఎందుకు వాటిల్లుతుందంటే..  ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌,  ఇతరత్ర సేవలు,  అడ్వర్‌టైజింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌ సేవలకు విఘాతం, ప్రత్యేకించి సోషల్‌ మీడియా ఆగిపోవడం వల్ల ఆదాయానికి భారీ గండిపడుతుంది.

2022లో మొదలైంది.. 
ఇక ఈ ఏడాదిలోనూ ఇంటర్నెట్‌ స్వేచ్ఛకు అడ్డుకట్ట పడడం ఇప్పటికే మొదలైంది. కజకస్తాన్‌(మధ్య ఆసియా దేశం), సూడాన్‌లలో నెలకొన్న సంక్షోభాల దృష్ట్యా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ కొనసాగుతోంది. వీటి నష్టం వివరాలు ఇప్పట్లో చెప్పడం కష్టం.

చదవండి: భారత్‌లో ఇక ఏరకంగానూ పోర్న్‌ వీడియోల వీక్షణ కుదరదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement