తెలుగు ఫ్యాక్షన్ సినిమాలో కార్లు గాల్లో ఎగరడం చూసుంటాం కదా. హీరో ఒక విజిల్ వేసినా లేదా తొడ కొట్టినా అప్పటి సినిమాల్లో ‘టాటా సుమో’లు గాల్లో ఎగిరిన సన్నివేశాలు కోకొల్లలు. ఆ సీన్లతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే అప్పట్లో టాటా అంటే వెంటనే గుర్తొచ్చేది టాటా సుమో.. అంతలా ప్రజాదరణ పొందిందీ కారు. అప్పట్లో కారంటే విలాసం. ఇప్పుడు అవసరం. అనతికాలంలోనే మూడేళ్లలో లక్షకుపైగా ఈ కార్లు అమ్ముడయ్యాయి. అసలు ఆ కారుకు సుమో అని ఎందుకు పేరు పెట్టారో తెలుసుకుందాం.
‘సుమో’ అంటే ఇదేదో జపనీస్ రెజ్లర్ల పేరులా ఉందని చాలామంది భావిస్తారు. కానీ దీని పేరు వెనక పెద్ద కథే ఉంది. టాటా సుమో తయారీ యూనిట్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సాధారణంగా ప్రతి రోజు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మోల్‌గావ్‌కర్ మాత్రం రోజూ ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత తిరిగి ఆఫీస్‌కు వచ్చేవారు. ఆ తర్వాత రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్‌తో సమావేశమయ్యేవారు.
నిత్యం అలా ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్తున్న మోల్‌గావ్‌కర్‌ను ఒకరోజు టీమ్‌లోని ఎగ్జిక్యూటివ్ సిబ్బంది ఫాలో అయ్యారు. మోల్‌గావ్‌కర్ తమ ఆఫీస్ సమీపంలోని ట్రక్కు డ్రైవర్ల వద్దకు వెళ్లడం గమనించారు. వారితో కలిసి ఆయన భోజనం చేయడం చూశారు. టాటా వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకునేవారు. తిరిగి ఆఫీస్‌కు వచ్చాక ఈ సమస్యలను ఆర్ అండ్ డీ టీమ్‌తో కలిసి చర్చించి అందుకు పరిష్కారాన్ని కనిపెట్టేవారు. ఆ సమస్యలు టాటా సుమో తయారీలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడేవారు.
ఇదీ చదవండి: టోల్‌ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
మోల్‌గావ్‌కర్ నిత్యం రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందానికి అవసరమైన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్ అభివృద్దికి ఆయన ఎంతో కృషి చేశారు. దాంతో టాటా యాజమాన్యం ఆయన పేరు మీద ఐకానిక్ కారును లాంచ్ చేయాలని నిర్ణయించింది. మోల్‌గావ్‌వర్ అసలు పేరు..సు-మంత్ మో-ల్‌గావ్‌కర్. తన పేరు మొదటి అక్షరాలతో ‘టాటా సుమో’ను లాంచ్ చేశారు. టాటా సంస్థలో కష్టపడిన వారికి ఎలాంటి స్థానం కల్పించారో ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment