నేపాల్ ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు చెల్లింపులు చేయకపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఇస్పాన్) తెలిపింది.
నేపాల్‌లోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపేసినట్లు ఇస్పాన్ పేర్కొంది. ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఐదు గంటలపాటు సర్వీసులను తగ్గించినట్లు, అందులో కొన్ని బ్యాండ్ విడ్త్‌ను పూర్తిగా తగ్గించినట్లు తేలింది. ఇంటర్నెట్ అంతరాయం కొనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలో లేదని ఇస్పాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువాష్ ఖడ్కా తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలకు అధికప్రాధాన్యం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
స్థానిక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు సుమారు మూడు బిలియన్ నేపాలీ రూపాయలు (రూ.187 కోట్లు) బకాయిపడ్డారు. అయితే బయటిదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు పాత బకాయిలు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల ఇంటర్నెట్ సర్వీసులు నిలిపేసినట్లు తెలిసింది. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ లెక్కల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment