సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు నేటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది వీటిని ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో చేపట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శనివారం నోటిఫికేషన్ జారీచేశారు. నిజానికి ఈ విద్యా సంవత్సరంలో ఫస్టియర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆన్‌లైన్ విధానాన్ని నిలిపివేసింది. దీంతో విద్యా సంవత్సరం మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ ఏడాది వరకు ఆఫ్‌లైన్‌లో ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తిచేయాలని నిర్ణయించింది.
సర్టిఫికెట్లను కాలేజీలు ఉంచుకోరాదు
అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల మార్కుల మెమోల ఆధారంగా విద్యార్థులకు ప్రొవిజినల్ ప్రవేశాలు కల్పించాలి. ఎస్సెస్సీ సర్టిఫికెట్లు, స్కూల్ టీసీలు వచ్చాక ఆ ప్రవేశాలను ధ్రువీకరించాలి. ఎస్సెస్సీ, కుల ధృవీకరణ సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం వాటిని విద్యార్థులకు ఇచ్చేయాలి. ఏ విద్యాసంస్థ కూడా వాటిని తన వద్ద ఉంచుకోరాదు. విద్యార్థులకు తిరిగి ఇవ్వకుండా సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు
సీట్లను రిజర్వేషన్ కోటా మేరకు ఆయా వర్గాల విద్యార్థులతో భర్తీ చేయాల్సిందేనని బోర్డు కార్యదర్శి స్పష్టంచేశారు. ఇలా చేయని సంస్థల గుర్తింపు రద్దు సహ ఇతర చర్యలు తప్పవన్నారు. అంతేకాక..
► బాలికేతర కాలేజీల్లోని అన్ని కేటగిరీ సీట్లలో కూడా బాలికలకు 33.33 శాతం కేటాయించాలి.
► ఏ ఒక్క విద్యార్థికి కూడా కులం, మతం, ప్రాంతం తదితర కారణాలతో అడ్మిషన్లు నిరాకరించరాదు.
► అడ్మిషన్లు పూర్తిగా పదో తరగతి.. తత్సమాన అర్హతల మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుసరిస్తూ మాత్రమే చేపట్టాలి.
► ముఖ్యంగా.. ఏ విద్యా సంస్థ కూడా ప్రవేశ పరీక్షలు, టాలెంట్ టెస్టులు వంటివి నిర్వహించరాదు.
► ప్రతీ కాలేజీలో బాలికల రక్షణ, భద్రతకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలి.
► విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా బోర్డు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.
షెడ్యూల్ ఇలా..
► దరఖాస్తుల అమ్మకం: సెప్టెంబర్ 19 నుంచి
► దరఖాస్తుల స్వీకరణ తుది గడువు: సెప్టెంబర్ 28
► అడ్మిషన్ల ముగింపు: సెప్టెంబర్ 28
► తరగతుల ప్రారంభం: సెప్టెంబర్ 29
అనుమతికి మించి ప్రవేశాలు కుదరదు
► హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి కాలేజీలోనూ మంజూరు చేసిన సెక్షన్లలో సెక్షన్‌కు గరిష్టంగా 88 మందిని మాత్రమే చేర్చుకోవాలి.
► కేవలం బైపీసీ, ఎంపీసీలే కాకుండా.. బోర్డు రూపొందించిన కాంబినేషన్లలోని (బైపీసీ, ఎంపీసీలతో పాటు సీఈసీ, హెచ్‌ఈసీ తదితర) సెక్షన్లన్నింటిలో కూడా ప్రవేశాలు చేపట్టాలి.
► ఏ కాలేజీలో కూడా అనుమతిలేకుండా అదనపు సెక్షన్లలో ప్రవేశాలను చేపట్టడానికి వీల్లేదు.
► అలా చేసే కాలేజీలపై పెనాల్టీలతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హెచ్చరించారు.
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సెకండియర్‌లో నో అడ్మిషన్
తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇక్కడ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలకు అనుమతిలేదని రామకృష్ణ నోటిఫికేషన్‌లో తెలిపారు. ఆయా రాష్ట్రాల ఇంటర్ సిలబస్, ఏపీ ఇంటర్ సిలబస్‌లో వ్యత్యాసాలున్నందున ఇతరులు ఏపీలోని జూనియర్ కాలేజీల్లో నేరుగా సెకండియర్‌లో ప్రవేశించడానికి అర్హులుకాదని స్పష్టంచేశారు. ఫస్టియర్‌లో మాత్రమే వారిని చేర్చుకోవాలన్నారు. అలాగే, అడ్మిషన్ల సమయంలో ప్రతి కాలేజీ ప్రవేశద్వారం ముందు 2021?–22 విద్యా సంవత్సరానికి కాలేజీకి ఉన్న అనుమతుల పత్రాలను కనిపించేలా ప్రదర్శించాలన్నారు. ఎన్ని సెక్షన్లు, ఎన్ని సీట్లకు అనుమతులున్నాయి?.. భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను సెక్షన్ల వారీగా పేర్కొనాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment