ఇసుక రీచ్‌ల్లో కాంట్రాక్టర్ హల్‌చల్ | Reach of sand contractor Hulchul | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌ల్లో కాంట్రాక్టర్ హల్‌చల్

Published Sat, Nov 22 2014 2:17 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

Reach of sand contractor Hulchul

* పెత్తనమంతా ఆయనదే..!
* పేరుకే డ్వాక్రా మహిళల నిర్వహణ
* నిబంధనలకు విరుద్ధంగా అయినవిల్లి మండల రీచ్‌లు
* నోరు మెదపని అధికారులు
* ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన గ్రామీణులు

అమలాపురం టౌన్/అయినవిల్లి : ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అప్పగించిన ఇసుకరీచ్‌ల్లో వాస్తవానికి రాజకీయ అండ ఉన్న పెత్తందారులు, పెట్టుబడిదారుల హవా నడుస్తోంది. వారి కనుసన్నల్లోనే వాటి నిర్వహణ నడుస్తోంది. ఫలితంగా మహిళలు ఏమీ చేయలేని అసహాయులుగా మిగిలిపోతున్నారు. దీనికి అయినవిల్లి మండలంలోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం రీచ్‌లే సజీవ సాక్ష్యాలు. ఈ రీచ్‌లను కాకినాడకు చెందిన లారీల సప్లయి కాంట్రాక్టర్, ఇసుక వ్యాపారి హస్తగతం చేసుకుని హల్‌చల్ చేస్తున్నారు. రీచ్ నిర్వహణ బాధ్యతలను అధికారికంగా తీసుకున్న డ్వాక్రా మహిళలు రీచ్ వద్ద నామ్‌కే వాస్తుగా మిగిలిపోయారు.

సదురు కాంట్రాక్టర్‌కు అయినవిల్లి మండలానికి చెందిన ఓ మండల స్థాయి ప్రజాపతినిధి, కొందరు టీడీపీ నాయకులు అండగా నిలిచారు. అలాగే మండలానికి చెందిన కొందరు అధికారులు, డీఆర్‌డీఏ అధికారి ఒకరు కూడా  ఆ కాంట్రాక్టర్ అడుగులకు మడుగులొత్తుతున్నారు. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాలో కాంట్రాక్టర్ చెలరేగిపోతున్నారు. ఇసుక ట్రాక్టర్లకు డీడీలు ఇచ్చే విషయంలోనూ అవకతవకలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికే కాదు, డ్వాక్రా మహిళల ఉపాధికీ గండికొడుతున్నారు. దీంతో అయినవిల్లిలంకకు చెందిన కొందరు ప్రజలు డ్వాక్రా మహిళలను డమ్మీ చేసి వారి ముసుగులో ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.

డీడీ రూపంలో చేస్తున్న మోసాలను ఉటంకిస్తూ ఆ గ్రామస్తులు కొందరు గురువారం రాత్రి అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు కూడా. ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్టరు కుమ్మక్కై ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇదే మండలంలోని కొండుకుదురు ఇసుక రీచ్‌లో గురువారం రాత్రి సమయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వటంతోపాటు అక్రమంగా తరలిస్తున్న పరిణామాలపై కూడా ఆ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొండుకుదురు రీచ్‌లోనూ ఆ కాంట్రాక్టర్ పెత్తనం సాగుతోందని విమర్శించారు.
 
అవకతవకలు ఇలా...
ఇసుక రీచ్‌ల్లో ఇసుక పొందాలంటే తొలుత యూనిట్ రూ. రెండు వేలు వంతున డీడీ తీసి ఇవ్వాలి. అలాగే మైనింగ్ శాఖకు సంబంధించి బిల్లు కూడా ఉండాలి. అయినవిల్లిలంక, వీరవల్లిపల్లి, కొండుకొదురు రీచ్‌ల్లో సదరు కాంట్రాక్టర్ రాజకీయ అండతో మైనింగ్ బిల్లుపై తేదీలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ఆ ఇసుకుకు సంబంధించిన డీడీలు ఉండటం లేదు. దీంతో అయినవిల్లిలంక గ్రామస్తులు ర్యాంపు నుంచి ఇసుకతో వెళుతున్న వాహనాన్ని గురువారం అడ్డుకుని డీడీ ఏదని ప్రశ్నించారు. సిబ్బందిని నిలదీశారు.

అలాగే మైనింగ్ బిల్లుపై తేదీ లేకపోవడాన్ని కూడా గమనించారు. ఈ ఆధారాలతోనే ఆ గ్రామస్తులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే గ్రామస్తులు ఇసుక వాహనాలను అడ్డుకుని అవతవకలను గుర్తించారో, ఆ విషయం క్షణాల మీద ఆ కాంట్రాక్టర్‌కు తెలిసిపోయింది. దీంతో కేవలం ఆరగంట సమయంలో ఆ వాహనాల్లోని ఇసుకకు డీడీలను అధికారులకు చూపించారు. అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్ ఇసుక అక్రమాలకు శుక్రవారం కూడా కొనసాగించారు.

అధికారులు ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం శుక్రవారం సాయంత్రం గుప్పుమనటంతో అప్పటికే అయినవిల్లిలంక రీచ్‌లో లోడ్ అయిన లారీల్లోంచి ఇసుకను ఆదరాబాదరాగా దించేశారు. ఈ లారీలన్నీ మైనింగ్ బిల్లులు సక్రమంగా లేకపోవటంవల్లే అక్రమార్కులు లారీల్లోంచి ఆకస్మికంగా అన్‌లోడ్ చేసేసి అధికారులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు.  గత కొన్ని రోజులుగా ఈ అవతవకలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో అడ్డుకునే నాథుడే కరవయ్యాడు. అక్కడ డీఆర్‌డీఏ అధికారుల నిఘా కాదు కదా! కనీస పర్యవేక్షణ కూడా లేదు.

గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు కాబట్టి ఆ అక్రమాలు వెలుగు చూశాయి. గత కొన్ని రోజులుగా  ఇలా ఎన్ని యూనిట్ల ఇసుక డీడీలు లేకుండా పక్కదారి పట్టాయో అంచనా వేయవచ్చు. ఒక డీడీ చూపించి అదే డీడీ పేరుతో పలు వాహనాలను ఇసుకతో పక్కదారి పట్టిస్తున్నారని అయినవిల్లిలంక గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఆర్డీవో గణేష్‌కుమార్ అయినవిల్లి మండలంలోని ఇసుక రీచ్‌లపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు నేపథ్యంలో తానే స్వయంగా తనిఖీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement