తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత
ఏటీ అగ్రహారం, న్యూస్‌లైన్
అరే గోవిందు...పోయిన ఆదివారం మనం ఇక్కడికి వచ్చినపుడు గ్రావెల్ క్వారీలేదే! ఇప్పుడేంటి ఇంత పెద్ద లోయ కనిపిస్తోంది! చూడు రాము అక్రమ క్వారీయింగ్ చేసేవారికి ఒక్క రాత్రి చాలు అది ప్రభుత్వ భూమైనా, ఫారెస్ట్ భూమైనా రాత్రికి రాత్రి నాలుగైదు పొక్లెయిన్‌లు పెట్టి లోతుగా తవ్వేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించేయడానికి... ఇది ఈ ఇద్దరి సంభాషణే కాదు.. పేరేచర్ల, పలకలూరు, అమీనాబాద్, కొండవీడు, బోయపాలెం తదితర ప్రాంతాల్లో నిత్యం ఏదో ఓ చోట ఇలాంటి సంభాషణలే వినిపిస్తున్నాయి.
జిల్లాలో మైనింగ్, ఫారెస్ట్ అధికారుల సమన్వయ లోపం గ్రావెల్ మాఫియాకు వరంగా మారింది. రాత్రికి రాత్రి ట్రాక్టర్లు, లారీలు పెట్టి ప్రభుత్వ భూమి, అటవీ భూమి అనే తేడాలేకుండా తవ్వేస్తున్నారు. చిన్న గాటుతో ప్రారంభించి నీటి ఊటలు వచ్చేవరకూ వందల అడుగుల మేర తవ్వేస్తున్నారు. రాత్రికి రాత్రే లక్షలు గడిస్తూ ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
నిత్యం నిఘా కొనసాగించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవటమే ఈ పరిస్థితికి కారణం. పలకలూరు, పేరేచర్ల ప్రాంతాల్లో మైనింగ్ అధికారులకు, ఫారెస్టు అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి అనుచరులు ఆయన పేరు చెప్పి మైనింగ్ అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నడుపుతున్నారని తెలిసింది.
గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకలూరు, పెద్ద పలకలూరు గ్రామాల్లో ఓ మాజీ సర్పంచ్ తనయుడు అక్రమంగా ప్రభుత్వ భూముల్లో క్వారీలు నిర్వహించి కోట్లు గడించారని, అంతేకాకుండా ప్రభుత్వ భూములను సైతం ప్లాట్లుగా విభజించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి. పేరేచర్ల ప్రాంతాల్లో కూడా అతను ప్రజా ప్రతినిధుల సాయంతో ఫారెస్టు భూముల్లో సైతం అక్రమ క్వారీ నిర్వహిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేమని అడిగిన వారికి కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ మాజీ మంత్రి పేరుతో బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులను ఎదిరించలేక అధికారులు వారిచ్చే తాయిలాలకు తలొగ్గి మిన్నకుండిపోయారు.
యెడ్లపాడు మండలం బోయపాలెం, వంకాయలపాడు గ్రామాల్లో అనధికారికంగా గ్రావెల్ క్వారీలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొండవీడు కోట సరిహద్దు ప్రాంతంలో గ్రామ పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ అటవీశాఖ భూముల్లో సైతం యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి.
అలాగే కొత్తపాలెం మాజీ సర్పంచ్ మరికొందరు కలిసి గ్రామంలోని కొండల్లోనే కాకుండా అమీనాబాద్ గ్రామ సరిహద్దులో అనుమతులు లేకుండానే క్వారీ కొనసాగించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అమీనాబాద్‌లో మాజీ మంత్రి పేరు చెప్పుకుని ఓ యువకుడు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని క్వారీ కొనసాగించటంతోపాటు అందుకు పంచాయతీ తీర్మానం కావాలని గ్రామ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు.
ఐతే మరో వర్గానికి చెందిన గ్రామస్తులు అందుకు నిరాకరించటంతోపాటు క్వారీ కొనసాగిస్తే సహించేదిలేదని హెచ్చరించటంతో రాత్రుళ్లు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇన్ని జరుగుతున్నా అటు ఫారెస్టు అధికారులు, మైనింగ్ అధికారులు తొంగి చూడకపోవటం నెలవారీ మామూళ్లే కారణమని ఆయాప్రాంతాల వాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు దృష్టి సారించి మాఫియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.