AT agraharam
-
నేడు అర్బన్ జిల్లా క్లూస్ టీం కార్యాలయం ప్రారంభం
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: అర్బన్ జిల్లా క్లూస్‌టీం కార్యాలయం ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. మూడున్నరేళ్లుగా ప్రత్యేక విభాగం ఏర్పడకపోవటంతో సమస్యలు ఎదుర్కొంటున్న సిబ్బందికి వెసులుబాటు కలిగింది. అర్బన్ జిల్లాకు ప్రత్యేకంగా క్లూస్‌టీం, వేలిముద్రల విభాగాన్ని కలిపి బుధవారం నూతన కార్యాలయాన్ని అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ప్రారంభించనున్నారు. అర్బన్, రూరల్ జిల్లాలుగా 2010 జూన్‌లో విభజన జరిగినప్పటినుంచి అర్బన్ జిల్లాకు ప్రత్యేక కార్యాలయం లేదు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న వేలిముద్రల విభాగంలోనే రెండు జిల్లాల పరిధిలో చోరీలు, హత్యలు తదితర నేరాలు జరిగిన సమయంలో ఉన్న సిబ్బందినే విధులకు కేటాయిస్తూ వచ్చారు. ఒకే రోజున రెండు కంటే ఎక్కువ సంఘటనలు జరిగిన సందర్బాల్లో సిబ్బంది తీవ్ర ఒత్తిళ్ళకు గరౌతుండేవారు. సమస్యలు పున రావృతం కావటంతో గతేడాది అర్బన్ జిల్లాకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వీరు కూడా వేలిముద్రల కార్యాలయంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అందరూ ఒకే గదిలో ఉండాల్సి రావటంతో సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. ఇది గుర్తించిన ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాలయం ఆవశ్యకత ఉన్నట్లు గుర్తించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీస్ కార్టర్స్‌లో ప్రత్యేకంగా క్లూస్, ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ఇద్దరు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత
ఏటీ అగ్రహారం, న్యూస్‌లైన్ అరే గోవిందు...పోయిన ఆదివారం మనం ఇక్కడికి వచ్చినపుడు గ్రావెల్ క్వారీలేదే! ఇప్పుడేంటి ఇంత పెద్ద లోయ కనిపిస్తోంది! చూడు రాము అక్రమ క్వారీయింగ్ చేసేవారికి ఒక్క రాత్రి చాలు అది ప్రభుత్వ భూమైనా, ఫారెస్ట్ భూమైనా రాత్రికి రాత్రి నాలుగైదు పొక్లెయిన్లు పెట్టి లోతుగా తవ్వేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించేయడానికి... ఇది ఈ ఇద్దరి సంభాషణే కాదు.. పేరేచర్ల, పలకలూరు, అమీనాబాద్, కొండవీడు, బోయపాలెం తదితర ప్రాంతాల్లో నిత్యం ఏదో ఓ చోట ఇలాంటి సంభాషణలే వినిపిస్తున్నాయి. జిల్లాలో మైనింగ్, ఫారెస్ట్ అధికారుల సమన్వయ లోపం గ్రావెల్ మాఫియాకు వరంగా మారింది. రాత్రికి రాత్రి ట్రాక్టర్లు, లారీలు పెట్టి ప్రభుత్వ భూమి, అటవీ భూమి అనే తేడాలేకుండా తవ్వేస్తున్నారు. చిన్న గాటుతో ప్రారంభించి నీటి ఊటలు వచ్చేవరకూ వందల అడుగుల మేర తవ్వేస్తున్నారు. రాత్రికి రాత్రే లక్షలు గడిస్తూ ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నిత్యం నిఘా కొనసాగించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవటమే ఈ పరిస్థితికి కారణం. పలకలూరు, పేరేచర్ల ప్రాంతాల్లో మైనింగ్ అధికారులకు, ఫారెస్టు అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి అనుచరులు ఆయన పేరు చెప్పి మైనింగ్ అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నడుపుతున్నారని తెలిసింది. గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకలూరు, పెద్ద పలకలూరు గ్రామాల్లో ఓ మాజీ సర్పంచ్ తనయుడు అక్రమంగా ప్రభుత్వ భూముల్లో క్వారీలు నిర్వహించి కోట్లు గడించారని, అంతేకాకుండా ప్రభుత్వ భూములను సైతం ప్లాట్లుగా విభజించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి. పేరేచర్ల ప్రాంతాల్లో కూడా అతను ప్రజా ప్రతినిధుల సాయంతో ఫారెస్టు భూముల్లో సైతం అక్రమ క్వారీ నిర్వహిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేమని అడిగిన వారికి కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ మాజీ మంత్రి పేరుతో బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులను ఎదిరించలేక అధికారులు వారిచ్చే తాయిలాలకు తలొగ్గి మిన్నకుండిపోయారు. యెడ్లపాడు మండలం బోయపాలెం, వంకాయలపాడు గ్రామాల్లో అనధికారికంగా గ్రావెల్ క్వారీలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొండవీడు కోట సరిహద్దు ప్రాంతంలో గ్రామ పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ అటవీశాఖ భూముల్లో సైతం యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి. అలాగే కొత్తపాలెం మాజీ సర్పంచ్ మరికొందరు కలిసి గ్రామంలోని కొండల్లోనే కాకుండా అమీనాబాద్ గ్రామ సరిహద్దులో అనుమతులు లేకుండానే క్వారీ కొనసాగించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అమీనాబాద్‌లో మాజీ మంత్రి పేరు చెప్పుకుని ఓ యువకుడు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని క్వారీ కొనసాగించటంతోపాటు అందుకు పంచాయతీ తీర్మానం కావాలని గ్రామ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐతే మరో వర్గానికి చెందిన గ్రామస్తులు అందుకు నిరాకరించటంతోపాటు క్వారీ కొనసాగిస్తే సహించేదిలేదని హెచ్చరించటంతో రాత్రుళ్లు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇన్ని జరుగుతున్నా అటు ఫారెస్టు అధికారులు, మైనింగ్ అధికారులు తొంగి చూడకపోవటం నెలవారీ మామూళ్లే కారణమని ఆయాప్రాంతాల వాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు దృష్టి సారించి మాఫియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇంతకీ దొంగలెవరు?
ఏటీ అగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు అండగా నిలవాల్సిన కొందరు అవినీతి అధికారుల కారణంగా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. నేరస్తులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేయాల్సిన అధికారులే దొంగలను బెదిరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నేరస్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలివేస్తుండడం గమనార్హం! ఇటీవల ఓ డీఎస్పీ, ఎస్ఐలపై వరుసగా రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్‌లకు ఫిర్యాదులందాయి. వీటిని తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దర్జాగా వెళ్లిన దొంగలు..! మార్చి 29న బ్రాడీపేటలోని ఓ హోటల్లో కొత్తపేటకు చెందిన సిరంజి మమత, హైదరాబాద్‌కు చెందిన నటారి సందీప్, సయ్యద్ అమీర్అహ్మద్, పశ్చిమ గోదావరి జిల్లా పోచవరానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావులు దొంగ బంగారం విక్రయించేందుకు బసచేశారని సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు డీఎస్పీ, ఎస్ఐ, సిబ్బంది ఆ హోటల్లో తనిఖీలు నిర్వహించి నలుగుర్నీ అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగ బంగారం విక్రయించేందుకు వచ్చినట్లు నిర్థారించుకున్న అధికారులు వారితో బేరానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్షన్నరకు బేరం కుదుర్చుకుని వారిని వదిలి వేసినట్లు పోలీస్‌శాఖలోనే విమర్శలు గుప్పుమన్నాయి. సగానికి సగం.. హైదరాబాద్ కంట్రీ క్లబ్లో సభ్యత్వం పేరుతో లక్షల్లో డబ్బు చెల్లించి మోసపోయామంటూ ఫిబ్రవరిలో వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సీసీఎస్‌కు బదిలీచేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ వెళ్లిన ఎస్ఐ క్లబ్ డెరైక్టర్లతో బేరం కుదుర్చుకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒక్కరినే నిందితుడిగా చూపించడం గమనార్హం! ఫిర్యాదుచేసిన తొమ్మిది మందికి డబ్బు తిరిగిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. డీఎస్పీ సూచనల మేరకు ఎనిమిది మంది బాధితుల వద్దకు వెళ్లి వారు చెల్లించిన సొమ్ములో సగం చెల్లించి.. వారికి పూర్తిగా చెల్లించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది సహకారంతో ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. మరో మహిళకు కూడా పూర్తిగా డబ్బు ముట్టినట్లు కోర్టులో తప్పుడు సమాధానం చెప్పారు. ఈ విధంగా పలు కేసుల్లో కూడా వారిద్దరూ తమదైన శైలిలో వ్యవహరించి లక్షల్లో డబ్బును నేరస్తులు, బాధితుల నుంచి వసూలు చేశారని ఐజీ, ఎస్పీలకు అందిన ఫిర్యాదుల్లో ఉన్నాయి. గుంటూరు గోల్డ్మార్కెట్లో ఎస్ఐ అనుచరుడైన ఓ హెడ్‌కానిస్టేబుల్ దొంగలను గుర్తించడం, వారిని ఎస్ఐ వద్దకు తీసుకువచ్చి బెదిరింపులకు దిగి బంగారం కాజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వదిలేసిన నేరస్తులు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భీమవరం, హైదరాబాద్‌ల్లో దొరికిన సందర్భాల్లో పోలీసు విచారణలో దొంగలించిన సొత్తు గుంటూరులోని క్రైమ్ ఎస్ఐకి అందజేశామని చెప్పినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదంతా డీఎస్పీ కనుసన్నల్లో కొనసాగుతోందనే విమర్శలు బలంగా వినవస్తున్నాయి. -
వేధింపుల కేసులో నిందితుల అరెస్టు
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ : నెలరోజులుగా టీజ్ చేస్తూ.. లైంగిక దాడికి దిగడంతో మానసికంగా కుంగిపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన కేసులో నిందితులను అరండల్‌పేట పోలీసులు సోమవారం అరెస్టుచేశారు. ఈ కేసులో నిందితులైన గంటూరు వల్లూరివారితోటకు చెందిన మానుకొండ సాయి, షేక్ మస్తాన్వలిలపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంతోపాటు చిల్డ్రన్స్ యాక్టు సస్పెక్టెడ్ షీటు తెరిచారు. బాధితురాలి తండ్రిపై దాడికి పాల్పడినందుకు సాయి తల్లిదండ్రులు శంకర్, ఆదిలక్ష్మిలను కూడా అరెస్టు చేశారు. ఈ మేరకు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో అర్బన్ జిల్లా ఏఎస్పీ గోపినాథ్ జెట్టి వివరాలు వెల్లడించారు. బాధితురాలి కుటుంబం గుంటూరు నగరంలోని వల్లూరివారితోటలో నివాసం ఉంటోంది. నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన మానుకొండ శంకర్, ఆదిలక్ష్మిల కుమారుడు సాయి కొద్ది నెలలుగా విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుందామంటూ వెంటపడుతుండడంతో తీవ్ర వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో (సెప్టెంబర్ 27) సాయి.. తన స్నేహితుడు మస్తాన్‌వలిని ఇంటి ముందు కాపలా పెట్టి తాను ఇంట్లోకి చొరబడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లి చేసుకుందా రా అంటూ బలవంతంగా లాక్కొని వెళ్లేందుకు యత్నించాడు. ఇంతలో బాధితురాలి సోదరి ఇంట్లోకి వస్తుండడాన్ని గమనించి సాయి, మస్తాన్‌వలి పరారయ్యారు. మరుసటి రోజు మళ్లీ ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆ ఇద్దరు యువకులు వచ్చి విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించగా.. పెద్దగా కేకలు వేసింది. దీంతో వారు పరారయ్యారు. వారి వికృతచేష్టలను తల్లిదండ్రులకు చెప్పుకుంది. వెంటనే బాధితురాలి తండ్రి.. సాయి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పాడు. కుమారుడ్ని వెనకేసుకొస్తూ.. మా వాడు అలాంటి పనులకు పాల్పడడంటూ దుర్భాషలాడడమేకాకుండా అతనిపై దాడికి దిగి గాయపర్చారు. తీవ్రమనస్థాపానికి గురైన బాధితురాలు ఆదివారం బాత్రూమ్లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధ తాళలేక కేకలు వేయడంతో ఆమె తల్లి తలుపు గడియ విరగ్గొట్టి వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులైన మానుకొండ సాయి, షేక్ మస్తాన్‌వలి, సాయి తండ్రి శంకర్, తల్లి ఆదిలక్ష్మిలను అరెస్టుచేశారు. నిందితుడు సాయి గతంలో ఇదే తరహాలో ముగ్గురు యువతులను మోసం చేశాడని, జులాయిగా తిరుగుతూ మహిళల వెంట పడడం అలవాటుగా చేసుకున్నాడని ఏఎస్పీ తెలిపారు. నలుగుర్ని కోర్టులో హాజరుపరుస్తున్నామని, అవసరమైతే సాయి, మస్తాన్‌వలిలను పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీలు టి.రవీంద్రబాబు, టి.వి.సుబ్బారెడ్డి, ఎన్.జోసఫ్ రాజ్‌కుమార్, ఎం.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. బాధితురాలి పరిస్థితి విషమం.. విద్యానగర్: లైంగిక దాడికి యత్నించడంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూ రు జీజీహెచ్‌లో ప్రత్యేక వైద్యబృందాల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. బాధితురాలి శరీరం 60 శాతంపైగా కాలిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. 24 గంటలు గడిస్తేకాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాధితురాలు ద్రవపదార్థాలు కూడా తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపారు.