ఇంతకీ దొంగలెవరు? | who is robber? | Sakshi
Sakshi News home page

ఇంతకీ దొంగలెవరు?

Published Mon, Dec 23 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

who is robber?

ఏటీ అగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు అండగా నిలవాల్సిన కొందరు అవినీతి అధికారుల కారణంగా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. నేరస్తులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేయాల్సిన అధికారులే దొంగలను బెదిరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నేరస్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలివేస్తుండడం గమనార్హం! ఇటీవల ఓ డీఎస్పీ, ఎస్‌ఐలపై వరుసగా రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్‌లకు ఫిర్యాదులందాయి. వీటిని తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
 దర్జాగా వెళ్లిన దొంగలు..!
 మార్చి 29న బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో కొత్తపేటకు చెందిన సిరంజి మమత, హైదరాబాద్‌కు చెందిన నటారి సందీప్, సయ్యద్ అమీర్‌అహ్మద్, పశ్చిమ గోదావరి జిల్లా పోచవరానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావులు దొంగ బంగారం విక్రయించేందుకు బసచేశారని సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు డీఎస్పీ, ఎస్‌ఐ, సిబ్బంది ఆ హోటల్‌లో తనిఖీలు నిర్వహించి నలుగుర్నీ అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగ బంగారం విక్రయించేందుకు వచ్చినట్లు నిర్థారించుకున్న అధికారులు వారితో బేరానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్షన్నరకు బేరం కుదుర్చుకుని వారిని వదిలి వేసినట్లు పోలీస్‌శాఖలోనే విమర్శలు గుప్పుమన్నాయి.
 సగానికి సగం..
 హైదరాబాద్ కంట్రీ క్లబ్‌లో సభ్యత్వం పేరుతో లక్షల్లో డబ్బు చెల్లించి మోసపోయామంటూ ఫిబ్రవరిలో వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సీసీఎస్‌కు బదిలీచేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ వెళ్లిన ఎస్‌ఐ క్లబ్ డెరైక్టర్లతో బేరం కుదుర్చుకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒక్కరినే నిందితుడిగా చూపించడం గమనార్హం! ఫిర్యాదుచేసిన తొమ్మిది మందికి డబ్బు తిరిగిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. డీఎస్పీ సూచనల మేరకు ఎనిమిది మంది బాధితుల వద్దకు వెళ్లి వారు చెల్లించిన సొమ్ములో సగం చెల్లించి.. వారికి పూర్తిగా చెల్లించినట్లు హైదరాబాద్‌కు  చెందిన ఓ న్యాయవాది సహకారంతో ఒప్పంద పత్రాలు తీసుకున్నారు.

మరో మహిళకు కూడా పూర్తిగా డబ్బు ముట్టినట్లు కోర్టులో తప్పుడు సమాధానం చెప్పారు. ఈ విధంగా పలు కేసుల్లో కూడా వారిద్దరూ తమదైన శైలిలో వ్యవహరించి లక్షల్లో డబ్బును నేరస్తులు, బాధితుల నుంచి వసూలు చేశారని ఐజీ, ఎస్పీలకు అందిన ఫిర్యాదుల్లో ఉన్నాయి. గుంటూరు గోల్డ్‌మార్కెట్‌లో ఎస్‌ఐ అనుచరుడైన ఓ హెడ్‌కానిస్టేబుల్ దొంగలను గుర్తించడం, వారిని ఎస్‌ఐ వద్దకు తీసుకువచ్చి బెదిరింపులకు దిగి బంగారం కాజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వదిలేసిన నేరస్తులు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భీమవరం, హైదరాబాద్‌ల్లో దొరికిన సందర్భాల్లో పోలీసు విచారణలో దొంగలించిన సొత్తు గుంటూరులోని క్రైమ్ ఎస్‌ఐకి అందజేశామని చెప్పినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదంతా డీఎస్పీ కనుసన్నల్లో కొనసాగుతోందనే విమర్శలు బలంగా వినవస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement