పారంభానికి సిద్ధమైన క్లూస్‌టీం కార్యాలయం
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: అర్బన్ జిల్లా క్లూస్‌టీం కార్యాలయం ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. మూడున్నరేళ్లుగా ప్రత్యేక విభాగం ఏర్పడకపోవటంతో సమస్యలు ఎదుర్కొంటున్న సిబ్బందికి వెసులుబాటు కలిగింది. అర్బన్ జిల్లాకు ప్రత్యేకంగా క్లూస్‌టీం, వేలిముద్రల విభాగాన్ని కలిపి బుధవారం నూతన కార్యాలయాన్ని అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ప్రారంభించనున్నారు. అర్బన్, రూరల్ జిల్లాలుగా 2010 జూన్‌లో విభజన జరిగినప్పటినుంచి అర్బన్ జిల్లాకు ప్రత్యేక కార్యాలయం లేదు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న వేలిముద్రల విభాగంలోనే రెండు జిల్లాల పరిధిలో చోరీలు, హత్యలు తదితర నేరాలు జరిగిన సమయంలో ఉన్న సిబ్బందినే విధులకు కేటాయిస్తూ వచ్చారు.
ఒకే రోజున రెండు కంటే ఎక్కువ సంఘటనలు జరిగిన సందర్బాల్లో సిబ్బంది తీవ్ర ఒత్తిళ్ళకు గరౌతుండేవారు. సమస్యలు పున రావృతం కావటంతో గతేడాది అర్బన్ జిల్లాకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వీరు కూడా వేలిముద్రల కార్యాలయంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అందరూ ఒకే గదిలో ఉండాల్సి రావటంతో సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. ఇది గుర్తించిన ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాలయం ఆవశ్యకత ఉన్నట్లు గుర్తించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీస్ కార్టర్స్‌లో ప్రత్యేకంగా క్లూస్, ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ఇద్దరు ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.