వేధింపుల కేసులో నిందితుల అరెస్టు
Published Tue, Oct 1 2013 6:04 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ : నెలరోజులుగా టీజ్ చేస్తూ.. లైంగిక దాడికి దిగడంతో మానసికంగా కుంగిపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన కేసులో నిందితులను అరండల్‌పేట పోలీసులు సోమవారం అరెస్టుచేశారు. ఈ కేసులో నిందితులైన గంటూరు వల్లూరివారితోటకు చెందిన మానుకొండ సాయి, షేక్ మస్తాన్‌వలిలపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంతోపాటు చిల్డ్రన్స్ యాక్టు సస్పెక్టెడ్ షీటు తెరిచారు. బాధితురాలి తండ్రిపై దాడికి పాల్పడినందుకు సాయి తల్లిదండ్రులు శంకర్, ఆదిలక్ష్మిలను కూడా అరెస్టు చేశారు. ఈ మేరకు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో అర్బన్ జిల్లా ఏఎస్పీ గోపినాథ్ జెట్టి వివరాలు వెల్లడించారు. బాధితురాలి కుటుంబం గుంటూరు నగరంలోని వల్లూరివారితోటలో నివాసం ఉంటోంది.
నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్‌మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన మానుకొండ శంకర్, ఆదిలక్ష్మిల కుమారుడు సాయి కొద్ది నెలలుగా విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుందామంటూ వెంటపడుతుండడంతో తీవ్ర వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో (సెప్టెంబర్ 27) సాయి.. తన స్నేహితుడు మస్తాన్‌వలిని ఇంటి ముందు కాపలా పెట్టి తాను ఇంట్లోకి చొరబడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లి చేసుకుందా రా అంటూ బలవంతంగా లాక్కొని వెళ్లేందుకు యత్నించాడు. ఇంతలో బాధితురాలి సోదరి ఇంట్లోకి వస్తుండడాన్ని గమనించి సాయి, మస్తాన్‌వలి పరారయ్యారు. మరుసటి రోజు మళ్లీ ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆ ఇద్దరు యువకులు వచ్చి విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించగా.. పెద్దగా కేకలు వేసింది. దీంతో వారు పరారయ్యారు. వారి వికృతచేష్టలను తల్లిదండ్రులకు చెప్పుకుంది.
వెంటనే బాధితురాలి తండ్రి.. సాయి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పాడు. కుమారుడ్ని వెనకేసుకొస్తూ.. మా వాడు అలాంటి పనులకు పాల్పడడంటూ దుర్భాషలాడడమేకాకుండా అతనిపై దాడికి దిగి గాయపర్చారు. తీవ్రమనస్థాపానికి గురైన బాధితురాలు ఆదివారం బాత్‌రూమ్‌లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధ తాళలేక కేకలు వేయడంతో ఆమె తల్లి తలుపు గడియ విరగ్గొట్టి వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులైన మానుకొండ సాయి, షేక్ మస్తాన్‌వలి, సాయి తండ్రి శంకర్, తల్లి ఆదిలక్ష్మిలను అరెస్టుచేశారు. నిందితుడు సాయి గతంలో ఇదే తరహాలో ముగ్గురు యువతులను మోసం చేశాడని, జులాయిగా తిరుగుతూ మహిళల వెంట పడడం అలవాటుగా చేసుకున్నాడని ఏఎస్పీ తెలిపారు. నలుగుర్ని కోర్టులో హాజరుపరుస్తున్నామని, అవసరమైతే సాయి, మస్తాన్‌వలిలను పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీలు టి.రవీంద్రబాబు, టి.వి.సుబ్బారెడ్డి, ఎన్.జోసఫ్ రాజ్‌కుమార్, ఎం.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
బాధితురాలి పరిస్థితి విషమం..
విద్యానగర్: లైంగిక దాడికి యత్నించడంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూ రు జీజీహెచ్‌లో ప్రత్యేక వైద్యబృందాల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. బాధితురాలి శరీరం 60 శాతంపైగా కాలిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. 24 గంటలు గడిస్తేకాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాధితురాలు ద్రవపదార్థాలు కూడా తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపారు.
Advertisement
Advertisement