Quarrying
-
డెడ్ రెంట్లతో కాలక్షేపం
సాక్షి , చీమకుర్తి (ప్రకాశం): లీజు కావాలని దరఖాస్తు చేస్తారు. తీరా లీజు పొందిన తర్వాత క్వారీయింగ్ చేయకుండా ఏళ్ల తరబడి మైనింగ్ డిపార్టుమెంట్‌కు డెడ్‌రెంట్ చెల్లించి కాలక్షేపం చేస్తుంటారు. కాలక్షేపం చేయటం వెనుక వారు అంతకుముందే మరికొన్ని లీజులు పొంది ఉంటారు. వాటిలోనే సంవత్సరాల నుంచి క్వారీయింగ్ చేస్తుండటం వలన రెండోదశలో లీజులను పొందిన భూముల్లో క్వారీయింగ్ చేసే తీరిక, ఆర్థిక వనరులు, మ్యాన్‌పవర్, మిషన్ పవర్ లేక సంవత్సరాల తరబడి కాలం వెళ్లదీస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చీమకుర్తి మండల పరిధిలోని గ్రానైట్ భూముల్లోనే కనిపిస్తుంది. లీజులను పొందిన విలువైన గ్రానైట్ భూముల్లో రాళ్లను సంవత్సరాల తరబడి వెలుపలకు తీయకుండా కేవలం డెడ్‌రెంట్ చెల్లించి ఆ భూములను కొంతమంది బడా గ్రానైట్ నేతలు తమ గుత్తాధిపత్యం కింద ఉంచుకుంటున్నారనే విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు చీమకుర్తిలోని గ్రానైట్ రంగంలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐరన్‌ఓర్, గార్నెట్, సిలికా, క్వార్టజ్, కలర్ గ్రానైట్, రోడ్మెటల్, గ్రావెల్ విభాగాల్లో కనిపిస్తుంది. మైన్స్ డిపార్టుమెంట్ కార్యాలయం నుంచి సేవకరించిన గణాంకాలు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... లీజులు పొందిన గ్రానైట్, ఇతర భూముల వివరాలు జిల్లాలోనున్న పలు ఖనిజ సంపద కలిగిన భూముల్లో 1687.6 హెక్టార్లలో 375 లీజులను ప్రభుత్వం మైనింగ్ కార్యాలయం ద్వారా జారీ చేసింది. వాటిలో ప్రభుత్వానికి చెందిన భూములు 1316.6 హెక్టార్లు ఉన్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన భూములు 366 హెక్టార్లు ఉన్నాయి. కానీ పొందిన 375 లీజుల్లో 132 లీజులు ఏళ్ల తరబడి నాన్‌వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. లీజు పొంది నాన్‌వర్కింగ్ కండిషన్లో ఉన్న భూములు దాదాపు 600 హెక్టార్లలో ఉన్నట్లు అంచనా. వర్కింగ్ కండిషన్లో ఉన్న మిగిలిన వెయ్యి హెక్టార్లలో కూడా క్వారీయింగ్ చేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా నాలుగో వంతు భూమిలో మాత్రమే క్వారీయింగ్ చేస్తున్నట్లు స్థానిక వాస్తవ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. డెడ్‌రెంట్ వసూలు చేసే విధానం ప్రభుత్వం నుంచి లీజులు పొందిన భూములకు భూమి రకం, ఖనిజం విలువను బట్టి డెడ్‌రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మైనింగ్ డిపార్టుమెంట్ అధికారులు నిర్ణయించిన ప్రకారం అత్యంత ఖరీదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు డెడ్‌రెంట్ కింద హెక్టార్‌కు ఏడాదికి రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో బ్లాక్ గెలాక్సీ భూములు ఒక్క చీమకుర్తి మండలంలోని రామతీర్థం పరిధిలో లీజులను పొందిన భూములు 474 హెక్టార్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి డెడ్‌రెంట్ ద్వారా రూ.4.74 కోట్లు కేవలం డెడ్‌రెంట్ ద్వారానే ఆదాయం వస్తుంది. ఇక తర్వాత స్థానం బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ బల్లికురవ, కనిగిరి ప్రాంతాల్లో ఉన్నాయి. వాటికి కూడా హెక్టార్‌కు రూ.1 లక్ష వంతున డెడ్‌రెంట్ చెల్లించాలి. బ్లాక్‌గ్రానైట్ భూములు 115.9 హెక్టార్లలోను, 281.8 హెక్టార్లలో జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.3.96 కోట్లు డెడ్‌రెంట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇక 212 హెక్టార్లలో ఉన్న రోడ్‌మెటల్‌కు హెక్టార్‌కు రూ.50 వేలు వంతున, 45 హెక్టార్లలో ఉన్న గ్రావెల్‌కు రూ.40 వేలు వంతున డెడ్‌రెంట్ చెల్లిస్తుంటారు. 18.9 హెక్టార్ల పరిధిలోనున్న సిలికా శాండ్‌కు, 28.8 హెక్టార్ల పరిధిలోనున్న కార్టజ్కు సమానంగా హెక్టార్‌కు రూ.15 వేలు వంతున, 505 హెక్టార్ల విస్తీర్ణంలోనున్న ఐరన్ఓర్కు రూ.4 వేలు వంతున, 4.7 హెక్టార్ల పరిధిలోనున్న గార్నెట్ భూములకు రూ.2 వేలు వంతున లీజులను పొందిన యజమానుల నుంచి ప్రభుత్వం డెడ్‌రెంట్ వసూలు చేస్తుంది. ఇలా 375 లీజుల ద్వారా 1687 హెక్టార్లపై ప్రభుత్వానికి ఏడాదికి రూ.12.35 కోట్లు ఆదాయం వస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరుసగా 2 సంవత్సరాలు పనిచేయకపోతే లీజు రద్దు మైనింగ్ చట్టాల ప్రకారం లీజుపొందిన యజమాని వరుసగా రెండు సంవత్సరాలు లీజు పొందిన భూమిలో క్వారీయింగ్ చేయకపోతే లీజు రద్దవుతుంది. కానీ మైనింగ్ చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని లీజు పొందిన కాలం 2 సంవత్సరాలు పూర్తి కాబోయే లోపే దానిని మళ్లీ లీజు కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్డదారులలో దక్కించుకోవడం వలన క్వారీయింగ్ చేయకుండానే విలువైన భూములను కొంతమంది బడా నేతల యజమానుల గుప్పెట్లో ఉండిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లకు పడగలెత్తిన గ్రానైట్ వ్యాపారవేత్తలు కావడం, పలుకుబడి కలిగి ఉండటం వలన లీజు పొందిన తర్వాత కేవలం డెడ్‌రెంట్ చెల్లించి వారి గుత్తాధిపత్యం కిందనే ఉంచుకుంటూ ఇతరులకు భూములను దక్కకుండా చేస్తున్నారనే విమర్శలు స్థానికుల్లో వెల్లువెత్తుతున్నాయి. అందు వలనే రామతీర్థం పరిధిలోని గ్రానైట్ భూములు ఒకే సంస్థ కింద వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన గ్రానైట్ భూములు పొందిన వ్యక్తులు పదుల సంఖ్యలో ఉన్నారు. సంస్థ పేరులో చిన్న పదాలను మార్పులు చేసి ఒకే కార్పొరేట్ శక్తిగా ఎదిగిన గ్రానైట్ పెద్దలు వందల కొలది ఎకరాల భూములను తమ గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం చేస్తున్నారని, గ్రానైట్ రంగంలోకి కొత్తగా రావాలనుకునే వారికి అవకాశం ఇవ్వకుండా ముందు మిగిలి భూములను దక్కించుకున్న వారే తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలున్నాయి. 2 సంవత్సరాలు పనిచేయకపోతే లీజు రద్దు చేస్తాం లీజులను పొందిన గ్రానైట్, ఇతర భూముల్లో వరుసగా 2 సంవత్సరాలు పాటు పనిచేయకపోతే వారు పొందిన లీజులను రద్దు చేసే అధికారం మైనింగ్ డిపార్టుమెంట్‌కు ఉంటుంది. కానీ లీజు కాలం 2 సంవత్సరాలు పూర్తయ్యేలోపు వారే మళ్లీ లీజు పొంది కంటిన్యూ చేసుకుంటున్నారు. క్వారీయింగ్ చేయకుండా ఖాళీగా ఉంటే ఆ భూములకు డెడ్‌రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. జీ.రామచంద్రరావు, ఏడీ, ఒంగోలు -
అసైన్డ్ భూమిలో అక్రమ క్వారీయింగ్
గుంటూరు, చేబ్రోలు(పొన్నూరు): అధికార పార్టీ నాయకులు అసైన్డ్ భూముల్లో అక్రమ క్వారీయింగ్ చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ మాఫియా అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. అవినీతి అక్రమాలను అడ్డుకోవలసిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో అక్రమ క్వారీయింగ్ చేస్తున్న వారిని గుర్తించి గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ, పోలీసు శాఖలకు సమాచారం ఇచ్చినప్పటికీ వారిపై ఎటువంటి చర్య తీసుకోకపోవటానికి అధికార పార్టీ నాయకుల అండదండలే కారణమని విమర్శలు ఉన్నాయి. మూడు పొక్లెయినర్లు, 17లారీలు, రెండు హెవీ లోడ్ లారీలను పోలీసులకు స్వాధీనం చేసినప్పటికీ వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సుద్దపల్లి గ్రామంలో సొంత స్థలాన్ని చదును చేసుకుంటున్న వారిపై రెవెన్యూ అధికారులు పొక్లెయినర్, రెండు ట్రాక్టర్లను స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేయడంతో పాటు, రెండు నెలల పాటు పోలీసు స్టేషన్లో వాహనాలు ఉంచారు. అదే రెవెన్యూ, పోలీసు శాఖలు నేడు అక్రమ క్వారీయింగ్ చేస్తున్న వారిపై నామమాత్రంగా నైనా చర్యలు తీసుకోకపోవటంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలోని అర ఎకరం స్థలంలో రైల్వే లైన్ పనులకు గ్రావెల్ అవసరాల కోసం అని అనుమతులు తీసుకొని విక్రయాలు చేస్తున్నారు. స్థలం పక్కనే ఉన్న అసైన్డ్ భూమిలో కూడా అధికార పార్టీ నాయకులు యంత్రాల సహాయంతో తవ్వి ట్రాక్టర్లు, లారీలతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. లక్షల విలువైన ప్రభుత్వ భూముల్లో క్వారీయింగ్ జరుపుతుండటంతో అవి పెద్ద పెద్ద అగాధాలను తలపిస్తున్నాయి. వేజండ్ల, వడ్లమూడి, సుద్దపల్లి, శేకూరు, చేబ్రోలు గ్రామాల్లో అక్రమ క్వారీయింగ్ జరుగుతోంది. ప్రభుత్వ భూములనే టార్గెట్ చేసుకొని అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతూ నాయకులు జేబులు నింపుకొంటున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు, జిల్లా పరిషత్ భూములు, చెరువులను టార్గెట్ చేసుకొని అక్రమార్కులు తవ్వకాలు జరుపుకొని గ్రావెల్‌ను విక్రయించుకుంటున్నారు. వీరనాయకునిపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌పై తహసీల్దారు జి.సిద్దార్థను ‘సాక్షి’ వివరణ కోరగా అర ఎకరంలో క్వారీయింగ్‌కు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. పక్కనే ఉన్న అసైన్డు భూమిలో తవ్వకాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి ప్రభుత్వ స్థలంలో క్వారీయింగ్ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.–తహసీల్దార్ జి.సిద్దార్థ -
క్వారీలో పేలుడు..మహిళ మృతి
కొడకండ్ల మండలం రామవరం గాయత్రి క్వారీలో ఆదివారం పేలుడు సంభవించింది. ఇద్దరు దంపతులు క్వారీలో రాళ్లకు డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో కుంచం సుజాత(30) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. బండరాళ్ల మధ్య ఉంచిన పాత జిలెటిన్ స్టిక్స్ పేలి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచాడు గ్రామం. కూలీ పనుల నిమిత్తం అక్కడకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంగురాళ్ల తవ్వకాల్లో వివాదం..
అనధికారికంగా రంగురాళ్లు తవ్వుతున్న రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గొలుగుండ మండలం పప్పు శెట్టిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీలో రంగురాళ్లు తవ్వుతున్న రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. అనంతరం కర్రలతో దాడులు చేసుకోవడంతో.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన తోటి కూలీలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత
ఏటీ అగ్రహారం, న్యూస్‌లైన్ అరే గోవిందు...పోయిన ఆదివారం మనం ఇక్కడికి వచ్చినపుడు గ్రావెల్ క్వారీలేదే! ఇప్పుడేంటి ఇంత పెద్ద లోయ కనిపిస్తోంది! చూడు రాము అక్రమ క్వారీయింగ్ చేసేవారికి ఒక్క రాత్రి చాలు అది ప్రభుత్వ భూమైనా, ఫారెస్ట్ భూమైనా రాత్రికి రాత్రి నాలుగైదు పొక్లెయిన్లు పెట్టి లోతుగా తవ్వేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించేయడానికి... ఇది ఈ ఇద్దరి సంభాషణే కాదు.. పేరేచర్ల, పలకలూరు, అమీనాబాద్, కొండవీడు, బోయపాలెం తదితర ప్రాంతాల్లో నిత్యం ఏదో ఓ చోట ఇలాంటి సంభాషణలే వినిపిస్తున్నాయి. జిల్లాలో మైనింగ్, ఫారెస్ట్ అధికారుల సమన్వయ లోపం గ్రావెల్ మాఫియాకు వరంగా మారింది. రాత్రికి రాత్రి ట్రాక్టర్లు, లారీలు పెట్టి ప్రభుత్వ భూమి, అటవీ భూమి అనే తేడాలేకుండా తవ్వేస్తున్నారు. చిన్న గాటుతో ప్రారంభించి నీటి ఊటలు వచ్చేవరకూ వందల అడుగుల మేర తవ్వేస్తున్నారు. రాత్రికి రాత్రే లక్షలు గడిస్తూ ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నిత్యం నిఘా కొనసాగించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవటమే ఈ పరిస్థితికి కారణం. పలకలూరు, పేరేచర్ల ప్రాంతాల్లో మైనింగ్ అధికారులకు, ఫారెస్టు అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి అనుచరులు ఆయన పేరు చెప్పి మైనింగ్ అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నడుపుతున్నారని తెలిసింది. గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకలూరు, పెద్ద పలకలూరు గ్రామాల్లో ఓ మాజీ సర్పంచ్ తనయుడు అక్రమంగా ప్రభుత్వ భూముల్లో క్వారీలు నిర్వహించి కోట్లు గడించారని, అంతేకాకుండా ప్రభుత్వ భూములను సైతం ప్లాట్లుగా విభజించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి. పేరేచర్ల ప్రాంతాల్లో కూడా అతను ప్రజా ప్రతినిధుల సాయంతో ఫారెస్టు భూముల్లో సైతం అక్రమ క్వారీ నిర్వహిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేమని అడిగిన వారికి కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ మాజీ మంత్రి పేరుతో బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులను ఎదిరించలేక అధికారులు వారిచ్చే తాయిలాలకు తలొగ్గి మిన్నకుండిపోయారు. యెడ్లపాడు మండలం బోయపాలెం, వంకాయలపాడు గ్రామాల్లో అనధికారికంగా గ్రావెల్ క్వారీలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొండవీడు కోట సరిహద్దు ప్రాంతంలో గ్రామ పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ అటవీశాఖ భూముల్లో సైతం యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి. అలాగే కొత్తపాలెం మాజీ సర్పంచ్ మరికొందరు కలిసి గ్రామంలోని కొండల్లోనే కాకుండా అమీనాబాద్ గ్రామ సరిహద్దులో అనుమతులు లేకుండానే క్వారీ కొనసాగించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అమీనాబాద్‌లో మాజీ మంత్రి పేరు చెప్పుకుని ఓ యువకుడు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని క్వారీ కొనసాగించటంతోపాటు అందుకు పంచాయతీ తీర్మానం కావాలని గ్రామ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐతే మరో వర్గానికి చెందిన గ్రామస్తులు అందుకు నిరాకరించటంతోపాటు క్వారీ కొనసాగిస్తే సహించేదిలేదని హెచ్చరించటంతో రాత్రుళ్లు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇన్ని జరుగుతున్నా అటు ఫారెస్టు అధికారులు, మైనింగ్ అధికారులు తొంగి చూడకపోవటం నెలవారీ మామూళ్లే కారణమని ఆయాప్రాంతాల వాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు దృష్టి సారించి మాఫియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మట్టిని మింగేస్తున్నారు..
సాక్షి, నరసరావుపేట: మట్టిని నమ్ముకున్న అన్నదాతలు అప్పులపాలవుతుంటూ అదే మట్టిని అమ్ముకుంటున్న అక్రమార్కులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.. అధికార పార్టీ అండదండలతో.. అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి ఇష్టానుసారంగా మట్టిని మింగేస్తున్నారు. బంజరు భూమి ఎక్కడ కనిపించినా అక్కడ వాలిపోతూ అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు పొక్లయిన్లు.. ఆరు టిప్పర్లు అన్న చందంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ మట్టి దందా కోటప్పకొండ ప్రాంతంలోని ఎర్రనేలల్లో అధికమైంది. నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ పరివాహక ప్రాంతంలో ఎర్రమట్టి భూములు అధికం. దీంతో అక్రమార్కుల కన్ను ఈ ప్రాంతంపై పడింది. రోడ్డు కాంట్రాక్ట్ పనులు, నర్సరీలు,ఇళ్లకు తోలే మట్టి అంతా ఈ ప్రాంతం నుంచే తరలిస్తుండటం గమనార్హం. ఇక్కడి నుంచి అక్రమంగా తరలించిన మట్టిని వ్యాపారులు బహిరంగ మార్కెట్లో వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు. కొందరైతే వ్యవసాయ భూములను సైతం మట్టి క్వారీలుగా మార్చి లోయలను తలపించే విధంగా గుంతలు తీస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆయా ప్రాంతాల్లోని గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి చిన్నారులు, పశువులు మృత్యువాతకు గురైన సంఘటనలూ లేకపోలేదు. సామాన్యులపైనే ప్రతాపం.. గ్రామీణ ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు రెండు, మూడు ట్రక్కుల మట్టిని మెరకకోసం తరలిస్తుంటారు. అదే పెద్ద నేరంగా భావించి అపరాధ రుసుం వసూలు చేయడం, ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసే రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమదందా సాగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మనకెందుకొచ్చిన గొడవలే అని మిన్నకుండే అధికారులు నెలవారీ మామూళ్ల తీసుకుని సంతృప్తి పడిపోతున్నారు. దీంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా యధేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. వ్యవసాయ భూముల మధ్య మట్టి క్వారీలను ఏర్పాటు చేయటంతో సమీపంలో పంటలు వేసుకునే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేకుండానే తవ్వకాలు.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, సొంత భూముల్లో సైతం మట్టి క్వారీయింగ్ జరపాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. ఫలానా భూమిలో క్వారీయింగ్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తొలుత రెవెన్యూ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మైనింగ్‌శాఖ నిబంధనల ప్రకారం ట్రక్కుకు రూ.50 చొప్పున చెల్లించి క్వారీయింగ్ నిర్వహించుకోవాలి. కొందరు వ్యాపారులు ఎకరాకు అనుమతులు పొంది దానిని అడ్డుపెట్టుకొని 10, 15 ఎకరాల వరకు క్వారీయింగ్ నిర్వహించడమే కాకుండా ఒక్కో బిల్లుపై కనీసం 50 నుంచి 100 ట్రక్కుల మట్టిని తరలిస్తున్నారు. ఇక్కడి ఎర్రమట్టిని నర్సరీలు, ఇళ్లల్లో మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగిస్తుండటంతో గిరాకీ పెరిగింది. ట్రక్కు ఎర్రమట్టి రూ.1800 పలుకుతుండగా టిప్పర్‌లారీ మట్టి రూ.3000కుపైగా అమ్మకాలు జరుపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. మట్టి క్వారీయింగ్ చేయాలంటే రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసీ పొందాలి. మైనింగ్ అధికారులకు సీనరేజ్ చెల్లించి ట్రక్కులకు ట్రిప్సీట్లు పొందాల్సి ఉంటుంది. ఒక్కో ట్రిప్ షీట్‌ను ఒక ట్రక్కు మట్టి రవాణా చేసేందుకు మాత్రమే వినియోగించాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్వారీయింగ్ జరిపే పొక్లయిన్, ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. - ఎం.శ్రీనివాసరావు, నరసరావుపేట ఆర్డీవో