డెడ్‌ రెంట్‌లతో కాలక్షేపం | Mining Leases In Prakasam | Sakshi
Sakshi News home page

డెడ్‌ రెంట్‌లతో కాలక్షేపం

Published Thu, Jul 4 2019 8:17 AM | Last Updated on Thu, Jul 4 2019 8:21 AM

Mining Leases In Prakasam - Sakshi

రామతీర్థంలోనున్న గ్రానైట్‌ క్వారీలు

సాక్షి , చీమకుర్తి (ప్రకాశం): లీజు కావాలని దరఖాస్తు చేస్తారు. తీరా లీజు పొందిన తర్వాత క్వారీయింగ్‌ చేయకుండా ఏళ్ల తరబడి మైనింగ్‌ డిపార్టుమెంట్‌కు డెడ్‌రెంట్‌ చెల్లించి కాలక్షేపం చేస్తుంటారు. కాలక్షేపం చేయటం వెనుక వారు అంతకుముందే మరికొన్ని లీజులు పొంది ఉంటారు. వాటిలోనే సంవత్సరాల నుంచి క్వారీయింగ్‌ చేస్తుండటం వలన రెండోదశలో లీజులను పొందిన భూముల్లో క్వారీయింగ్‌ చేసే తీరిక, ఆర్థిక వనరులు, మ్యాన్‌పవర్, మిషన్‌ పవర్‌ లేక  సంవత్సరాల తరబడి కాలం వెళ్లదీస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చీమకుర్తి మండల పరిధిలోని గ్రానైట్‌ భూముల్లోనే కనిపిస్తుంది.

లీజులను పొందిన విలువైన గ్రానైట్‌ భూముల్లో రాళ్లను సంవత్సరాల తరబడి వెలుపలకు తీయకుండా కేవలం డెడ్‌రెంట్‌ చెల్లించి ఆ భూములను కొంతమంది బడా గ్రానైట్‌ నేతలు తమ గుత్తాధిపత్యం కింద ఉంచుకుంటున్నారనే విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు చీమకుర్తిలోని గ్రానైట్‌ రంగంలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐరన్‌ఓర్, గార్నెట్, సిలికా, క్వార్టజ్, కలర్‌ గ్రానైట్, రోడ్‌మెటల్, గ్రావెల్‌ విభాగాల్లో కనిపిస్తుంది.  మైన్స్‌ డిపార్టుమెంట్‌ కార్యాలయం నుంచి సేవకరించిన గణాంకాలు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...

లీజులు పొందిన గ్రానైట్, ఇతర భూముల వివరాలు 
జిల్లాలోనున్న పలు ఖనిజ సంపద కలిగిన భూముల్లో 1687.6 హెక్టార్లలో 375 లీజులను ప్రభుత్వం మైనింగ్‌ కార్యాలయం ద్వారా జారీ చేసింది. వాటిలో ప్రభుత్వానికి చెందిన భూములు 1316.6 హెక్టార్లు ఉన్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన భూములు 366 హెక్టార్లు ఉన్నాయి. కానీ పొందిన 375 లీజుల్లో 132 లీజులు ఏళ్ల తరబడి నాన్‌వర్కింగ్‌ కండిషన్‌లోనే ఉన్నాయి. లీజు పొంది నాన్‌వర్కింగ్‌ కండిషన్‌లో ఉన్న భూములు దాదాపు 600 హెక్టార్లలో ఉన్నట్లు అంచనా. వర్కింగ్‌ కండిషన్లో ఉన్న మిగిలిన వెయ్యి హెక్టార్లలో కూడా క్వారీయింగ్‌ చేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా నాలుగో వంతు భూమిలో మాత్రమే క్వారీయింగ్‌ చేస్తున్నట్లు స్థానిక వాస్తవ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

డెడ్‌రెంట్‌ వసూలు చేసే విధానం
ప్రభుత్వం నుంచి లీజులు పొందిన భూములకు భూమి రకం, ఖనిజం విలువను బట్టి డెడ్‌రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. మైనింగ్‌ డిపార్టుమెంట్‌ అధికారులు నిర్ణయించిన ప్రకారం అత్యంత ఖరీదైన బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌కు డెడ్‌రెంట్‌ కింద హెక్టార్‌కు ఏడాదికి రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో బ్లాక్‌ గెలాక్సీ భూములు ఒక్క చీమకుర్తి మండలంలోని రామతీర్థం పరిధిలో లీజులను పొందిన భూములు 474 హెక్టార్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి డెడ్‌రెంట్‌ ద్వారా రూ.4.74 కోట్లు కేవలం డెడ్‌రెంట్‌ ద్వారానే ఆదాయం వస్తుంది. ఇక తర్వాత స్థానం బ్లాక్‌ గ్రానైట్, కలర్‌ గ్రానైట్‌ బల్లికురవ, కనిగిరి ప్రాంతాల్లో ఉన్నాయి.

వాటికి కూడా హెక్టార్‌కు రూ.1 లక్ష వంతున డెడ్‌రెంట్‌ చెల్లించాలి. బ్లాక్‌గ్రానైట్‌ భూములు 115.9 హెక్టార్‌లలోను, 281.8 హెక్టార్‌లలో జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.3.96 కోట్లు డెడ్‌రెంట్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇక 212 హెక్టార్లలో ఉన్న రోడ్‌మెటల్‌కు హెక్టార్‌కు రూ.50 వేలు వంతున, 45 హెక్టార్‌లలో ఉన్న గ్రావెల్‌కు రూ.40 వేలు వంతున డెడ్‌రెంట్‌ చెల్లిస్తుంటారు.

18.9 హెక్టార్ల పరిధిలోనున్న సిలికా శాండ్‌కు, 28.8 హెక్టార్ల పరిధిలోనున్న కార్టజ్‌కు సమానంగా హెక్టార్‌కు రూ.15 వేలు వంతున, 505 హెక్టార్ల విస్తీర్ణంలోనున్న ఐరన్‌ఓర్‌కు రూ.4 వేలు వంతున, 4.7 హెక్టార్‌ల పరిధిలోనున్న గార్నెట్‌ భూములకు రూ.2 వేలు వంతున లీజులను పొందిన యజమానుల నుంచి ప్రభుత్వం డెడ్‌రెంట్‌ వసూలు చేస్తుంది. ఇలా 375 లీజుల ద్వారా 1687 హెక్టార్‌లపై ప్రభుత్వానికి ఏడాదికి రూ.12.35 కోట్లు ఆదాయం వస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

వరుసగా 2 సంవత్సరాలు పనిచేయకపోతే లీజు రద్దు
మైనింగ్‌ చట్టాల ప్రకారం లీజుపొందిన యజమాని వరుసగా రెండు సంవత్సరాలు లీజు పొందిన భూమిలో క్వారీయింగ్‌ చేయకపోతే లీజు రద్దవుతుంది. కానీ మైనింగ్‌ చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని లీజు పొందిన కాలం 2 సంవత్సరాలు పూర్తి కాబోయే లోపే దానిని మళ్లీ లీజు కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్డదారులలో దక్కించుకోవడం వలన క్వారీయింగ్‌ చేయకుండానే విలువైన భూములను కొంతమంది బడా నేతల యజమానుల గుప్పెట్లో ఉండిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లకు పడగలెత్తిన గ్రానైట్‌ వ్యాపారవేత్తలు కావడం,  పలుకుబడి కలిగి ఉండటం వలన లీజు పొందిన తర్వాత కేవలం డెడ్‌రెంట్‌ చెల్లించి వారి గుత్తాధిపత్యం కిందనే ఉంచుకుంటూ ఇతరులకు భూములను దక్కకుండా చేస్తున్నారనే విమర్శలు స్థానికుల్లో వెల్లువెత్తుతున్నాయి.

అందు వలనే రామతీర్థం పరిధిలోని గ్రానైట్‌ భూములు ఒకే సంస్థ కింద వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన గ్రానైట్‌ భూములు పొందిన వ్యక్తులు పదుల సంఖ్యలో ఉన్నారు. సంస్థ పేరులో చిన్న పదాలను మార్పులు చేసి ఒకే కార్పొరేట్‌ శక్తిగా ఎదిగిన గ్రానైట్‌ పెద్దలు వందల కొలది ఎకరాల భూములను తమ గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం చేస్తున్నారని, గ్రానైట్‌ రంగంలోకి కొత్తగా రావాలనుకునే వారికి అవకాశం ఇవ్వకుండా ముందు మిగిలి భూములను దక్కించుకున్న వారే తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలున్నాయి. 

2 సంవత్సరాలు పనిచేయకపోతే లీజు రద్దు చేస్తాం
లీజులను పొందిన గ్రానైట్, ఇతర భూముల్లో వరుసగా 2 సంవత్సరాలు పాటు పనిచేయకపోతే వారు పొందిన లీజులను రద్దు చేసే అధికారం మైనింగ్‌ డిపార్టుమెంట్‌కు ఉంటుంది. కానీ లీజు కాలం 2 సంవత్సరాలు పూర్తయ్యేలోపు వారే మళ్లీ లీజు పొంది కంటిన్యూ చేసుకుంటున్నారు. క్వారీయింగ్‌ చేయకుండా ఖాళీగా ఉంటే ఆ భూములకు డెడ్‌రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.
జీ.రామచంద్రరావు, ఏడీ, ఒంగోలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement