సాక్షి, ప్రకాశం(మార్టూరు) : నకిలీ వేబిల్లులతో గ్రానైట్ రాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎనిమిది వాహనాలను విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రం మార్టూరులో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ భూషణం కథనం ప్రకారం.. మార్టూరు కేంద్రంగా నకిలీ వేబిల్లుల వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ముందస్తు సమాచారంతో ఒంగోలు, విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు 16 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి శనివారం అర్ధరాత్రి మార్టూరులో నలుమూలలా నిఘా పెట్టారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి నాలుగు గంటల వరకు అధికారుల నిర్వహించిన తనిఖీల్లో గ్రానైట్ రాయిని అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. నాగరాజుపల్లి రోడ్డు నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న 8 లారీలకు ఎలాంటి వే బిల్లులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు.
తెల్లవారే సరికి విషయం గుప్పుమనడంతో ఏడు లారీల్లోని సరుకుకు చెందిన అసలు యజమానులు తమ వద్ద సంబంధింత వే బిల్లులు ఉన్నాయంటూ పోలీసుస్టేషన్‌కు వచ్చి అధికారులతో అన్ని రకాల సంప్రదింపులు జరిపారు. ఎనిమిదో వాహనానికి ఎలాంటి బిల్లు లేనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఏడు వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అధికారుల దృష్టికి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వే బిల్లులు ఒరిజినల్ అయినప్పటికీ ఆ బిల్లులు ఆదివారం తరలిస్తున్న గ్రానైట్ వాహనాలకు సంబంధించినవి కావని అధికారులు గుర్తించారు. అంతేగాక రవాణా జరిగే సరుకుకు సంబంధించిన ఎలాంటి బిల్లులైనా సంబంధిత వాహనంలో సిబ్బందితో ఉండాల్సి ఉంది. వాహనాల తనిఖీ అనంతరం యజమానులు ఇవిగో బిల్లులు అంటూ తీసుకొచ్చి అధికారులకు చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. యజమానులు అధికారులకు చూపించిన వే బిల్లులు పాతవని తెలుస్తోంది. గతంలో ఒకసారి వాహనాలను అవే వే బిల్లులతో విడిపించుకెళ్లినట్లు సమాచారం.
ఇప్పుడు అవే బిల్లులను రెండోసారి గ్రానైట్ రాయిని తరలించేందుకు ఉపయోగిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అంటే ఒకసారి జనరేటైన బిల్లులతో యజమానులు పలుమార్లు గ్రానైట్ రాయిని రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో గ్రానైట్ రాయి యజమానులు అధికారులను రకరకాల ప్రలోభాల ద్వారా లొంగదీసుకునేందుకు పైరవీలు జరపడం విశేషం. ఎనిమిది వాహనాల్లోని ముడిరాయి విలువ 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒంగోలు మైనింగ్ శాఖ ఆర్‌ఐ నాగిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తే పెద్ద మనుషుల్లా చలామణి అయ్యే బడా బాబుల జాతకాలు వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. విజిలెన్స్ సీఐలు ఎం.శ్రీనివాసరావు, బి.నాయక్, ఎస్‌ఐలు మహ్మద్ జానీ, కోటేశ్వరరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ సుధాకర్, ఏఓ ఉమాపతి, సిబ్బంది ప్రసాద్, వెంకట్, నరసయ్య పాల్గొన్నారు.
పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన
మార్టూరు: పోలీసులు తమ కాలనీకి చెందిన యువకుడిని వేధించారంటూ స్థానిక సంపత్‌నగర్ వాసులు ఆదివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో స్థానిక గొట్టిపాటి హనుమంతురావు కాలనీకి చెందిన మరొక కేసుకు సంబంధించిన వారు రావడంతో పోలీసుస్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. నకిలీ వేబిల్లుల కేసులో విచారణలో భాగంగా స్థానిక సంపత్‌నగర్ కాలనీకి చెందిన కుంచాల వంశీకృష్ణను ఎస్‌ఐ కె.మల్లికార్జున గత శనివారం పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. విచారణలో భాగంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టడమేగాక చెవుల వద్ద కరెంట్‌షాక్ పెట్టారనేది వంశీకృష్ణ ఫిర్యాదు. జిల్లా వడ్డెర సంఘ అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు ఆధ్వర్యంలో 70 మంది మహిళలు ఇదేమని ప్రశ్నించేందుకు 7 గంటల ప్రాంతంలో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. అదే సమయానికి రేణింగివరం ఎస్‌ఐ మహేష్ తన సిబ్బందితో స్టేషన్‌కు చేరుకున్నారు.
విలేకరులతో మాట్లాడుతూ కేసులో నిందితుడిగా ఉంటే ప్రశ్నించాలేగానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సరికాదన్నారు. ఎస్‌ఐపై మంత్రి బాలినేని, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఎస్‌ఐ మల్లికార్జునను వివరణ కోరగా వం«శీకృష్ణ నకిలీ వేబిల్లుల వ్యాపారంలో నిందితుడని, కొన్నేళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తున్నాడని, ఓ కేసులో భాగంగా అతడిని స్టేషన్‌కు పిలిచి విచారించామేగానీ కరెంట్ పెట్టడం వంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఇదే సమయంలో ఇటీవల గొట్టిపాటి హనుమంతురావు కాలనీలో మూడేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేయాలంటూ కాలనీకి చెందిన 30 మంది స్టేషన్ వద్దకు చేరడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment