way bills
-
ఇసుక దోపిడీ రూ.100 కోట్లు.. పట్టించుకోని టీఎస్ఎండీసీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నకిలీ వే బిల్లులతో రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ మార్గంలో తరలిపోతోందని వరంగల్ కమిషనరేట్ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలంగా రెండున్నరేళ్లలో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆదాయం పక్క దారి పట్టినట్లు తెలుస్తోంది. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలోనే నకిలీ వే బిల్లుల దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కొందరు ఇసుక రవాణాదారులు, టీఎస్ఎండీసీ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ములుగు నుంచి తీగలాగితే... రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34 యాక్టివ్ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక లభ్యత ఉన్నచోట స్థానికులకు భాగస్వామ్యం కల్పించి టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 6 ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి నిత్యం 300 నుంచి 600 లారీలు లోడింగ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం ములుగు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుక లారీని వరంగల్‌లో పోలీసులు తనిఖీ చేశారు. నకిలీ వేబిల్లులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా.. యజమానికి 8 లారీలు ఉన్నాయని, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో యజమాని చెప్పిన చోటుకు వెళ్లి లోడింగ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకోకుండా నేరుగా లోడింగ్ చేసుకోవడం,, డబ్బులు చెల్లించడమేంటని పోలీసులకు అనుమానం వచ్చి టాస్‌్కఫోర్స్ అధికారులకు కేసును అప్పగించారు. రూపాయి చెల్లించకుండా 30 టన్నుల ఇసుక ములుగు, ఏటూరు ప్రాంతంనుంచి వచ్చే ఇసుక లారీలపై పోలీసులు నిఘా పెట్టారు. వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగాం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి దాదాపు 40 లారీలను స్వాదీనం చేసుకున్నారు. 12 టైర్ల లారీలో 26 టన్నుల ఇసుక నింపుకుంటే రూ.10,500 చెల్లించాల్సిన కొందరు లారీ యజమానులు నకిలీ వేబిల్లులతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 26 నుంచి 30 టన్నులు తీసుకెళ్లినట్లు తేలింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి 16 లారీలు, 65 నకిలీ వే బిల్లులు, 16 టీఎస్ఎండీసీ స్టాంపులు, 1 లాప్ టాప్, 11 సెల్ఫోన్లు, రూ. 41,000ల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక కొందరు టీఎస్ఎండీసీ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి క్వారీ వద్ద టీఎస్ఎండీసీకి చెందిన సూపర్వైజర్ ఉంటారు. వీరి ప్రమేయం లేకుండా ఇసుక లారీ బయటకు వెళ్లే ప్రసక్తే ఉండదు. కొందరు అధికారులు, క్వారీ నిర్వాహకులు, లారీల యజమానులు కలిసే అక్రమ దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 3 నెలల్లో 1800 లారీల ఇసుక అక్రమ తరలింపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచే మూడు నెలల్లో 1800 లారీల ఇసుక ఎలాంటి సొమ్ము చెల్లించకుండా తరలినట్లు పోలీ సు విచారణలో తేలగా, రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 యాక్టివ్ రీచ్‌ల నుంచి రూ.100 కోట్లకు పైగా వి లువచేసే ఇసుక తరలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కదులుతున్న అక్రమాల డొంక
సాక్షి.మార్టూరు(ప్రకాశం) : మండల కేంద్రం మార్టూరులో పది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నకిలీ వేబిల్లుల వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్టూరు బైనీడి కాలనీలోని ఓ యువకుడికి చెందిన గ్రానైట్ ముడిరాయి లారీని గత గురువారం సంతమాగులూరు పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నట్లు గుర్తిం చి వాహనానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారుల విచారణలో ఆ యువకుడు పది మందికి చీకటి వ్యాపారుల వివరాలు చెప్పడంతో తీగ లాగితే మార్టూరు, బల్లికురవ మండలాల్లో డొంక కదలడం ప్రారంభించింది. అంతేగాక ఆ యువకుడు తనను పోలీసు కేసు నుంచి తప్పించకుంటే ఈ వ్యాపారంలో ము ఖ్యులైన వారి అసలు రంగు బయట పెడతానని బెదిరించడంతో కొందరు ముఖ్యులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు, ఆయన స్వగ్రామం కోనంకికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ యువకుడి సోదరి శనివారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్ వద్ద హల్చల్ చేయబోయి సర్దుకుంది. ఏలూరి తమ అనుచరుడిపై అధికార పార్టీ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తుందనే కోణంలో రగడ చేసేందుకు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పోలీసుల వలలో త్వరలో కొన్ని తిమింగలాలు పడనున్నట్లు మార్టూరులో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అక్రమార్కుల్లో బడా బాబులు?
సాక్షి, ప్రకాశం(మార్టూరు) : నకిలీ వేబిల్లులతో గ్రానైట్ రాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎనిమిది వాహనాలను విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రం మార్టూరులో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ భూషణం కథనం ప్రకారం.. మార్టూరు కేంద్రంగా నకిలీ వేబిల్లుల వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ముందస్తు సమాచారంతో ఒంగోలు, విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు 16 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి శనివారం అర్ధరాత్రి మార్టూరులో నలుమూలలా నిఘా పెట్టారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి నాలుగు గంటల వరకు అధికారుల నిర్వహించిన తనిఖీల్లో గ్రానైట్ రాయిని అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. నాగరాజుపల్లి రోడ్డు నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న 8 లారీలకు ఎలాంటి వే బిల్లులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెల్లవారే సరికి విషయం గుప్పుమనడంతో ఏడు లారీల్లోని సరుకుకు చెందిన అసలు యజమానులు తమ వద్ద సంబంధింత వే బిల్లులు ఉన్నాయంటూ పోలీసుస్టేషన్‌కు వచ్చి అధికారులతో అన్ని రకాల సంప్రదింపులు జరిపారు. ఎనిమిదో వాహనానికి ఎలాంటి బిల్లు లేనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఏడు వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అధికారుల దృష్టికి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వే బిల్లులు ఒరిజినల్ అయినప్పటికీ ఆ బిల్లులు ఆదివారం తరలిస్తున్న గ్రానైట్ వాహనాలకు సంబంధించినవి కావని అధికారులు గుర్తించారు. అంతేగాక రవాణా జరిగే సరుకుకు సంబంధించిన ఎలాంటి బిల్లులైనా సంబంధిత వాహనంలో సిబ్బందితో ఉండాల్సి ఉంది. వాహనాల తనిఖీ అనంతరం యజమానులు ఇవిగో బిల్లులు అంటూ తీసుకొచ్చి అధికారులకు చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. యజమానులు అధికారులకు చూపించిన వే బిల్లులు పాతవని తెలుస్తోంది. గతంలో ఒకసారి వాహనాలను అవే వే బిల్లులతో విడిపించుకెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు అవే బిల్లులను రెండోసారి గ్రానైట్ రాయిని తరలించేందుకు ఉపయోగిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అంటే ఒకసారి జనరేటైన బిల్లులతో యజమానులు పలుమార్లు గ్రానైట్ రాయిని రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో గ్రానైట్ రాయి యజమానులు అధికారులను రకరకాల ప్రలోభాల ద్వారా లొంగదీసుకునేందుకు పైరవీలు జరపడం విశేషం. ఎనిమిది వాహనాల్లోని ముడిరాయి విలువ 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒంగోలు మైనింగ్ శాఖ ఆర్ఐ నాగిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తే పెద్ద మనుషుల్లా చలామణి అయ్యే బడా బాబుల జాతకాలు వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. విజిలెన్స్ సీఐలు ఎం.శ్రీనివాసరావు, బి.నాయక్, ఎస్ఐలు మహ్మద్ జానీ, కోటేశ్వరరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ సుధాకర్, ఏఓ ఉమాపతి, సిబ్బంది ప్రసాద్, వెంకట్, నరసయ్య పాల్గొన్నారు. పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన మార్టూరు: పోలీసులు తమ కాలనీకి చెందిన యువకుడిని వేధించారంటూ స్థానిక సంపత్‌నగర్ వాసులు ఆదివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో స్థానిక గొట్టిపాటి హనుమంతురావు కాలనీకి చెందిన మరొక కేసుకు సంబంధించిన వారు రావడంతో పోలీసుస్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. నకిలీ వేబిల్లుల కేసులో విచారణలో భాగంగా స్థానిక సంపత్‌నగర్ కాలనీకి చెందిన కుంచాల వంశీకృష్ణను ఎస్ఐ కె.మల్లికార్జున గత శనివారం పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. విచారణలో భాగంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టడమేగాక చెవుల వద్ద కరెంట్‌షాక్ పెట్టారనేది వంశీకృష్ణ ఫిర్యాదు. జిల్లా వడ్డెర సంఘ అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు ఆధ్వర్యంలో 70 మంది మహిళలు ఇదేమని ప్రశ్నించేందుకు 7 గంటల ప్రాంతంలో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. అదే సమయానికి రేణింగివరం ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో స్టేషన్‌కు చేరుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ కేసులో నిందితుడిగా ఉంటే ప్రశ్నించాలేగానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సరికాదన్నారు. ఎస్ఐపై మంత్రి బాలినేని, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఎస్ఐ మల్లికార్జునను వివరణ కోరగా వం«శీకృష్ణ నకిలీ వేబిల్లుల వ్యాపారంలో నిందితుడని, కొన్నేళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తున్నాడని, ఓ కేసులో భాగంగా అతడిని స్టేషన్‌కు పిలిచి విచారించామేగానీ కరెంట్ పెట్టడం వంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఇదే సమయంలో ఇటీవల గొట్టిపాటి హనుమంతురావు కాలనీలో మూడేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేయాలంటూ కాలనీకి చెందిన 30 మంది స్టేషన్ వద్దకు చేరడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
నో పర్మిట్.. నో వే బిల్
ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తూ రవాణా వ్యవస్థను ఆన్లైన్ చేసినా అక్రమాలు తగ్గడం లేదు. నెల్లూరు నుంచి చిత్తూరు జిల్లా మీదుగా కర్ణాటకకు నిత్యం సిలికా, ఇసుక రవాణా అవుతోంది. ఈ వాహనాలకు మైనింగ్ నుంచి ట్రాన్సిట్ పాస్గానీ ఈ–వేబిల్లులు గానీ లేకపోవడం గమనార్హం. ఈ విషయం రెండు రోజుల క్రితం పలమనేరు స్పెషల్ బ్రాంచ్ అధికారుల దాడుల్లో తేటతెల్లమైంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పలమనేరు: సాధారణంగా సిలికాను తరలించాలంటే మైనింగ్‌శాఖ నుంచి మినరల్ ట్రాన్సిట్ పాస్ రెగ్యులేషన్స్–1976 మేరకు ట్రాన్సిట్ పాస్‌ను పొందాలి. అనంతరం సరుకు లోడింగ్ చేసేచోట ఆన్లైన్లో ఈ–వేబిల్లును పొందాలి. ఇందుకు లారీకి అమర్చిన జీపీఆర్ఎస్ను అనుసంధానం చేయాలి. వేబిల్లులోని సమయంలోపు అన్లోడింగ్ జరగాలి. ప్రస్తుతం జీఎస్టీతో కలిపి ఈ వ్యవహారం సాగుతోంది. జరుగుతున్నది ఇలా ఎలాంటి రికార్డులు లేకుండానే నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సిలికాను బెంగకూరుకు తరలిస్తున్నారు. మరికొందరు మైనింగ్ పర్మిట్‌ను పొంది సిలికాకు వేబిల్లు తీసుకుని నిర్ణీత గడువులోపు రెండు, మూడు ట్రప్పులు తోలుతున్నారు. మరి కొందరు డూప్లికేట్ వేబిల్లులను చూపెడుతున్నట్టు సమాచారం. మార్గమధ్యంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మినహా మరే శాఖ అధికారులు పట్టికున్నా వేబిల్లు ఒరిజినలా నకిలీనా అనే విషయాన్ని కనుక్కోలేకపోతున్నారు. దీనికి తోడు అధికారుల సాయం ఎలాగూ ఉంది కాబట్టి వీరి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రంగంపేట, పూతలపట్టు వద్ద డంపింగ్ పాయింట్లు చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్, పూతలపట్టు వద్ద రహస్య ప్రదేశాల్లో సిలికా డంపింగ్ పాయింట్లు ఉన్నట్టు తెలిసింది. ఇదేచోట ఇసుక కూడా డంప్ చేస్తారు. గూడూరు నుంచి సిలికాతో వచ్చిన లారీలు బెంగళూరులో దాన్ని దించేసిన తర్వాత డంపింగ్ పాయింట్‌కు వస్తాయి. అక్కడి నుంచి మళ్లీ ఇసుక లోడు చేసుకుని వెళుతున్నాయి. దీనికి వేబిల్లులో ఉండే రెండు రోజుల గడువును వాడుకుంటున్నారు. ఏది సిలికానో.. ఏది ఇసుకో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సిలికా ఇసుకతో పాటు మామూలు ఇసుక కూడా బెంగళూరుకు తరలుతోంది. అక్కడ మైనింగ్ లీజుదారులు సిలికా ఇసుకను సబ్‌లీజు, లేదా సేల్స్ ద్వారా టన్ను రూ.500 దాకా విక్రయిస్తున్నారు. 20 టన్నులకు రూ.10 వేలు అవుతోంది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి కొన్ని లోడ్లు సిలికాను, మరికొన్ని లోడ్లు ఇసుకను తరలిస్తున్నాడు. మరికొందరు కింద ఇసుక దానిపైన కాస్త సిలికా ఇసుక కనిపించేలా తార్పాల్ కప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు. బెంగళూరులో లారీ ఇసుక రూ.80 వేలకు పైమాటే బెంగళూరులో సిలికా ఇసుక టన్ను రూ.35 వేలు, ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు (12 చక్రాల లారీ) పలుకుతున్నాయి. సిలికా ఇసుకను తీసుకెళితే డీజిల్‌కు రూ.20 వేలు, లోడింగ్, అన్లోడింగ్, డ్రైవర్ బత్తాలు, చెక్ పోస్టుల మామూళ్లు పోగా రూ.5 వేలకు పైగా గిట్టుబాటు అవుతోంది. ఇదే ఖర్చులతో ఇసుకను తీసుకెళితే లోడుకు రూ.40 వేలకు పైగా మిగులుతుంది. గూడూరు నుంచి నిత్యం 200 లోడ్లు గూడూరు నుంచి బెంగళూరుకు తిరుపతి, చిత్తూరు, పలమనేరు మీదుగా రోజుకు 200 లోడ్ల ఇసుక వెళుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పలమనేరు పోలీసులు మూడు గంటల వ్యవధిలోనే 30 లారీలను పట్టుకున్నారు. దీన్ని బట్టి ఎన్ని లారీలు వెళుతున్నాయో అర్థమవుతుంది. అధికార పార్టీ నేతల అండదండలు ఈ అక్రమ రవాణాలో లారీ యజమానులు, సిలికా ఇసుక కొనుగోలుదారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్టు సమాచారం. విజిలెన్స్, పోలీసు, ఆర్టీవో, సేల్స్ ట్యాక్స్ తదితర శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు చేరుతున్నాయని తెలిసింది. దీంతో వీరి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. -
వే బిల్లులు లేకుండా ఇసుక రవాణా ?
ములుగు : అక్రమ ఇసుక రవాణా దందా అధికారుల అండఉండడంతో మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది. ఏటూరు నాగారం మండలంలోని క్వారీల నుంచి ఇసుక లారీలు వే బిల్లులు లేకుండా జిల్లా కేంద్రాలకు తరలుతున్నాయి. అధికారుల తనిఖీలు తూతూమంత్రం గా జరుగుతుండడంతో ఇష్టారాజ్యంగా అధిక లోడుతో దర్జాగా డివిజన్ సరిహద్దులు దాటుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఈ తంతు జరుగుతున్నా ఎక్కడా బయటపడకుండా ఇసుక లారీల యజమానులు, కాంట్రాక్టర్లు కొందరు అధికారుల సాయం తో తతంగాన్ని నడుపుతున్నారని గుసగుసలు విన వస్తున్నాయి. రాత్రి 9 గంటల వరకే అనుమతి ప్రస్తుతం ఏటూరు, తుపాకులగూడెంలో ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ఆయా క్వారీల నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఇసుకను బయటకు పంపించేందుకు అనుమతి ఉంది. కానీ రాత్రి 12 గంటల వరకు ములుగు మండల కేంద్రాన్ని దాటుకుంటూ లారీలు వెళుతున్నాయి. రోజువారిగా వందల లారీలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరులుతున్నాయి. ఇసుక లారీల యజమానులు చెల్లించే చలానా ప్రకారం టీఎస్ఎండీసీ అధికారులు లారీలకు వే బిల్లులు అందించాల్సి ఉంటుంది. వే బిల్లులు తీసుకున్న అనంతరం మాత్రమే లారీలు టీఎస్ఎండీసీ చెక్‌పోస్టు దాటుతుంది. కానీ వే బిల్లులు లేకుండా పోలీసులకు పట్టుబడ్డ లారీల డ్రైవర్లు మాత్రం వే బిల్లులు తమ దగ్గర లేవని చెబుతున్నారు. వే బిల్లులను మరుసటి రోజు కాంట్రాక్టర్ తీసుకొచ్చి లారీల తీసుకెళుతున్నారు. లారీ వెంబడి ఉండాల్సిన వే బిల్లులు లేపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకున్న విజిలెన్స్, మైనింగ్ అధికారులు దాడులు జరిపారు. ఈ విషయమై వ్యాపారులకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా కొన్ని లారీలు గుట్టుచప్పుడు కాకుండా పాత పద్ధతిలో వెళుతున్నాయని తెలిసింది. గతంలో ములుగు మండలం జంగాలపల్లి చెక్‌పోస్టు వద్ద ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఏకంగా చెక్‌పోస్టును ఎత్తేశారు. ఈ హెచ్చరికతో ఉన్న చెక్పోస్టులైనా సక్రమంగా పనిచేస్తాయని భావించిన అధికారులకు మళ్లీ తలనొప్పి మొదలైనట్లయింది. -
రైస్ మిల్లర్లకు వేబిల్లుల నిలిపివేత
నిర్ధేశించిన సమయంలో సీఎంఆర్ ఇవ్వాలి ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా చేయకుండా కాకమ్మ కబుర్లు చెబితే సహించేది లేదని జేసీ ఇంతియాజ్ అహ్మద్ రైస్ మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్ సరఫరా చేయడానికి సమయం కావాలని ఈ సందర్భంగా మిల్లర్లు జేసీని కోరారు. ధాన్యం బస్తాలు మిల్లుల్లో నిల్వ ఉంచితే కోతులు గందరగోళం చేస్తున్నాయని మిల్లర్లు చెప్పడంతో కుంటిసాకులు చెప్పడం మానుకుని సీఎంఆర్ సరఫరా చేయాలని జేసీ సూచించారు. సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేసేంత వరకు రైస్ మిల్లులకు వేబిల్లులు కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 10 నాటికి 90 శాతం, 15న నాటికి 100 శాతం సీఎంఆర్ సరఫరా చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లు వారికి కేటాయించిన రైస్ మిల్లుల్లో నిత్యం పర్యవేక్షిస్తూ ధాన్యం ఆడించి సీఎంఆర్ గోదాములకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీఎంఆర్ సరఫరా చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్ఓ టి.ధర్మారెడ్డి, డీఎం కొండయ్య సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. -
డెలివరీ చలానాలే వే బిల్లులు!
- ఎమ్మెస్టీ ప్రయాణికులే రవాణా సారధులు - పలాస నుంచి యథేచ్ఛగా జీడిపప్పు అక్రమ రవాణా - బిల్లులు ఉండవు.. పన్నులు చెల్లించరు - ఎగుమతులు మొత్తం ఆరుగురు బ్రోకర్ల చేతుల్లోనే - ప్రతి నెలా కోట్లలో ఎగుమతులు - ఆ మేరకు పన్ను ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం పలాస : జీడి పరిశ్రమలకు కేంద్రమైన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి జీడిపప్పు రకరకాల మార్గాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోంది. పక్కనున్న ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎటువంటి బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. గతం నుంచీ ఇది జరుగుతున్నా పలాస మార్కెట్ కమిటీ(ఏఎంసీ) అధికారులు ఇటీవల దాడి చేసి రూ.28 లక్షల విలువైన జీడిపప్పును సీజ్ చేయడంతో ఈ అక్రమ రవాణా బాగోతం మరోమారు చర్చనీయాంశమైంది. దీంతో సంబంధిత శాఖల అధికారులు దీనిపై దృష్టి సారించారు. జీడిపప్పు వ్యాపారులు పన్ను ఎగవేస్తూ, ఎటువంటి వే బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. కాశీబుగ్గలోని ట్రాన్స్‌పోర్టు కంపెనీల పేరుతో అడ్డుగోలుగా రవాణా చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల పరిధిలో 600 పైచిలుకు జీడిపప్పు పరిశ్రమలకు వాణిజ్య పన్నుల శాఖ లెసైన్సులు ఉండగా, కేవలం ఆరుగురు బ్రోకర్లే ఎగుమతుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరి చేతుల మీదుగానే ప్రతి నెలా కోట్లాది రూపాయల విలువైన రవాణా లావాదేవీలు జరుగుతున్నాయి. జీడిపప్పు కంపెనీల యజమానులు ఎటువంటి అనుమతులు లేకుండానే బ్రోకర్లకు పప్పును విక్రయిస్తుండగా, వారు తమ సొంత ట్రాన్స్‌పోర్టు సంస్థల ద్వారా విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. ఎమ్మెస్టీల ద్వారా.. మరోవైపు పలాస రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం రాకపోకలు సాగించే రైళ్ల ద్వారా కూడా జీడిపప్పు అక్రమంగా తరలిపోతోంది. దీనికి నిరుద్యోగులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. పలాస నుంచి బరంపురం తదితర పట్టణాలకు మంత్లీ సీజన్ టిక్కెట్ల(ఎమ్మెస్టీ)తో ప్రయాణికుల మాదిరిగా రైళ్లలో వెళ్లే ఈ యువకుల ద్వారా క్వింటాళ్ల కొద్దీ జీడిపప్పును రవాణా తరలిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారికి కొంత సొమ్ము ముట్టజెబుతున్నారు. జీడిపప్పు రవాణాలో భారీగా పన్ను ఎగవేత జరుగుతున్నట్లు వివిధ శాఖల అధికారులే ఆరోపిస్తున్నారు. ఇటీవల అక్రమంగా జీడి పప్పు రవాణా అవుతున్నట్టు తెలియడంతో అధికారులు నిఘా వేసి జీడి పప్పును పట్టుకుంటున్నారు. అధికారుల నుంచి వే బిల్లులు తీసుకోకుండా పలాస కాష్యూమానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇచ్చే డెలివరీ చలానానే వే బిల్లుగా చూపిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయంలో దాడుల్లో బయటపడింది. పలాస రైల్వే స్టేషన్ నుంచి కూడా అక్రమ రవాణా అవుతున్నట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా పలాస నుంచి గొప్పిలి మీదుగా ఒడిశాకు లారీలు, ఇతర వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కూడా గుర్తించారు. అక్రమ రవాణాదారులు పలాస పీసీఎంఏ ఇచ్చిన డెలివరీ చలానాలనే ఉపయోగిస్తున్నారని పలాస మార్కెట్ కమిటీ కార్యదర్శి చిన్నికృష్ణ చెప్పారు. ఆ చలానాను ఆయన చూపిస్తూ జీడిపప్పు ఎగుమతి చేసేటప్పుడు మార్కెట్ కమిటీకి కూడా ఒక శాతం పన్ను కట్టాల్సి ఉన్నా చాలామంది దాన్ని ఎగవేస్తూ దొంగదారుల్లో రవాణా చేస్తున్నారని చెప్పారు. మొత్తానికి అక్రమ రవాణా ఉదంతం మరోమారు వెలుగు చూడటంతో అధికారులు దాడులకు పథకం రూపొందించారు. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై నిఘా పెట్టారు.