వే బిల్లులు లేకుండా ఇసుక రవాణా ?
Published Mon, Aug 29 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
ములుగు : అక్రమ ఇసుక రవాణా దందా అధికారుల అండఉండడంతో మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది. ఏటూరు నాగారం మండలంలోని క్వారీల నుంచి ఇసుక లారీలు వే బిల్లులు లేకుండా జిల్లా కేంద్రాలకు తరలుతున్నాయి. అధికారుల తనిఖీలు తూతూమంత్రం గా జరుగుతుండడంతో ఇష్టారాజ్యంగా అధిక లోడుతో దర్జాగా డివిజన్ సరిహద్దులు దాటుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఈ తంతు జరుగుతున్నా ఎక్కడా బయటపడకుండా ఇసుక లారీల యజమానులు, కాంట్రాక్టర్లు కొందరు అధికారుల సాయం తో తతంగాన్ని నడుపుతున్నారని గుసగుసలు విన వస్తున్నాయి.
రాత్రి 9 గంటల వరకే అనుమతి
ప్రస్తుతం ఏటూరు, తుపాకులగూడెంలో ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ఆయా క్వారీల నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఇసుకను బయటకు పంపించేందుకు అనుమతి ఉంది. కానీ రాత్రి 12 గంటల వరకు ములుగు మండల కేంద్రాన్ని దాటుకుంటూ లారీలు వెళుతున్నాయి. రోజువారిగా వందల లారీలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరులుతున్నాయి. ఇసుక లారీల యజమానులు చెల్లించే చలానా ప్రకారం టీఎస్‌ఎండీసీ అధికారులు లారీలకు వే బిల్లులు అందించాల్సి ఉంటుంది. వే బిల్లులు తీసుకున్న అనంతరం మాత్రమే లారీలు టీఎస్‌ఎండీసీ చెక్‌పోస్టు దాటుతుంది. కానీ వే బిల్లులు లేకుండా పోలీసులకు పట్టుబడ్డ లారీల డ్రైవర్లు మాత్రం వే బిల్లులు తమ దగ్గర లేవని చెబుతున్నారు. వే బిల్లులను మరుసటి రోజు కాంట్రాక్టర్ తీసుకొచ్చి లారీల తీసుకెళుతున్నారు. లారీ వెంబడి ఉండాల్సిన వే బిల్లులు లేపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకున్న విజిలెన్స్, మైనింగ్ అధికారులు దాడులు జరిపారు. ఈ విషయమై వ్యాపారులకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా కొన్ని లారీలు గుట్టుచప్పుడు కాకుండా పాత పద్ధతిలో వెళుతున్నాయని తెలిసింది. గతంలో ములుగు మండలం జంగాలపల్లి చెక్‌పోస్టు వద్ద ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఏకంగా చెక్‌పోస్టును ఎత్తేశారు. ఈ హెచ్చరికతో ఉన్న చెక్‌పోస్టులైనా సక్రమంగా పనిచేస్తాయని భావించిన అధికారులకు మళ్లీ తలనొప్పి మొదలైనట్లయింది.
Advertisement
Advertisement