quary
-
విశాఖలో మైనింగ్ మాఫియా అక్రమాలు..
సాక్షి, విశాఖపట్నం: మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్ వేశారు. మొత్తం 9 క్వారీ లీజుల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వీవీఆర్ గ్రూప్‌లో దాడులు చేశారు. ఈ దాడులలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు 8 క్వారీలకు రూ.114 కోట్లు ఫైన్‌తో పాటు నాలుగు క్వారీలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే వీవీఆర్ గ్రూప్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా 5 క్వారీల్లో తవ్వని వాటికి కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు నిర్ధారణయింది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. -
అక్రమాల నిగ్గుతేలేనా?
పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గంలో క్వారీలపై అధికారులు దాడులు చేసి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్రమాలు ఏ మేరకు నిగ్గుతేలుతాయన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. పెనుకొండ ప్రాంతం క్వారీల ఏర్పాటుకు స్వర్గధామం. ఇక్కడ అధికారులు క్వారీ యజమానులకు సాగిలపడి పోటీపడి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు. పేదవాడికి ఒక ఎకరా పట్టా ఇవ్వడానికి మనసొప్పని అధికారులు క్వారీలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల ఎకరాలను క్వారీల యజమానులకు ధారాదత్తం చేశారు. అటు రెవెన్యూ అధికారులు భూ అనుమతులిస్తే ఇటు మైనింగ్ అధికారులు పోటీపడి అనుమతులు మంజూరు చేశారు. సోమందేపల్లిలో పెద్దకొండ ప్రాంతంలో కొందరికి భూపట్టాలున్నా రెవెన్యూ అధికారులు వాటిని అప్పటికప్పుడు రద్దు చేస్తూ క్వారీలకు లీజుకు ఇవ్వడం వెనుక దాగి ఉన్న అవినీతిని సూచిస్తోంది. బాధితులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరిగిన పాపానపోలేదు. పెనుకొండ ప్రాంతం టీడీపీకి కంచుకోట కావడంతో రెండున్నర దశాబ్దాలుగా క్వారీల దందా సాగుతోంది. పరిటాల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వారి అనుచరుల కనుసన్నల్లో క్వారీలు ఏర్పాటయ్యాయి. అడిగితే బెదిరింపులు, అడ్డుకుంటే ఇబ్బందులు అన్నచందంగా క్వారీల దందా జరిగింది. నిబంధనలకు పాతర .. క్వారీల ఏర్పాటులో అధికారులు నిబంధనలకు పూర్తీగా పాతరేశారు. చెరువు, మరువ, పొలం అన్న తేడా లేకుండా అనుమతిచ్చారు. సోమందేపల్లి, పాపిరెడ్డిపల్లి చెరువుల పక్కనే క్వారీలు, ఏకంగా చెరువులో రోడ్లు, ఇలా ప్రజా జీవితాలను అతలాకుతలం చేశారు. పాపిరెడ్డిపల్లి వద్ద వేలుపుకొండలో జరుగుతున్న బ్లాస్టింగ్ దెబ్బకు విద్యార్థులు హడలిపోతున్నా పట్టించుకున్న వారు లేరు. వాటిపై విచారణ చేసినా క్వారీల నిర్వాహకులకే ప్రభుత్వం వత్తాసు పలికింది. టీడీపీ నాయకుల రాజకీయ పెత్తనం ముందు ప్రజలు, రైతులు నిస్సహాయులయ్యారు. పనీ మాదే..గనీ మాదే.. ప్రభుత్వం విడుదల చేసే రూ.కోట్ల డబ్బు మాదే అన్న చందంగా టీడీపీ నాయకులు దోపిడీ సాగించారు. రోడ్డు తొలగించాలన్న జేసీ బదిలీ.. సోమందేపల్లి చెరువులో రోడ్డు వేయడం అక్రమమని, రోడ్డు తొలగించాలని అప్పటి జాయింట్ కలెక్టర్ రమామణి ఆదేశిస్తే ఆమెను టీడీపీ నాయకులు రాజకీయ బలంతో రోజుల వ్యవధిలో జిల్లా నుంచి బదిలీ చేశారు. చెరువులో రోడ్డు వేయరాదని అడ్డుకుంటే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండని పోలీసులను ఉసిగొలిపారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు లారీలు క్వారీల నుంచి నిబంధనలను ఉల్లంఘించి కంకర, కంకరపొడితో రయ్‌మని ప్రయాణిస్తుంటే జనం చూసి ఊరుకోవాల్సిందేకాని మాటమాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధే ప్రజలకు ఇబ్బందులు పెడుతుంటే జనం ఎంతో ఆవేదన చెందారు. అక్రమాలు బయట పడుతాయా?... టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన క్వారీల్లో రూ.కోట్ల అవినీతి దాగుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం మారాక అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించడంతో క్వారీలలో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చడానికి అధికారులు సిద్ధమయ్యారు. అసలు క్వారీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు పొందారు? ఎంత మేరకు తవ్వారు? ఎంత మేర రాయల్టీ చెల్లించాలి? క్వారీలు ఎలాంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ప్రజలు పడుతున్న భాధలేమిటి? నిబంధనలు ఎలా ఉన్నాయి? జరుగుతున్న భాగోతమేమిటి అన్న విషయాలపై మైనింగ్ అధికారులు పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు దర్యాప్తులో ఎలాంటి పొరబాట్లకు తావిచ్చినా చర్యలు తప్పవన్న భావన ప్రజల్లో వినిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కియా నుంచి కొటక్ వరకు.. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు నుంచి షిమాంకో కొటక్ పరిశ్రమతో పాటు ఇతర హాట్‌మిక్సింగ్ యూనిట్లకు టీడీపీ నాయకుల క్వారీల నుంచే లక్షల టన్నుల కంకర, కంకర పొడి తరలించి వ్యాపార లావాదేవీలు సాగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు సంపాదించిన ఆదాయం ఏ మేరకు ఉంటుందో లెక్కించలేరన్న భావన అటు అధికారులు, ఇటు ప్రజల్లో నెలకొంది. దీంతో పాటు ప్రజల అవసరాలకు, భారీ ఎత్తున నిర్మించిన భవనాలకు సైతం ఈ కంకర మిషన్ల నుంచే సరఫరా కావడంతో అవినీతి అక్రమాలకు హద్దే లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇసుక క్వారీ కోసం దీక్ష
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసం ఇసుక క్వారీ మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 4, 5 తేదీల్లో స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు నిరాహార దీక్షచేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుందే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు రూ.2500 నుంచి రూ.4వేల వరకు వెచ్చించి ట్రాక్టర్ ఇసుకను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇదే అదనుగా భావించి టీడీపీ నేతలు ఇసుకను బంగారంగా మార్చుకుని పేద, మధ్యతరగతి ప్రజలను సైతం దోచుకుంటున్నారన్నారు. వారికి కలెక్టర్‌తోపాటు కింది స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రొద్దుటూరులో ఇసుక క్వారీ చూపాలని చాలా రోజులుగా తాను జెడ్పీ సమావేశం, స్వయంగా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదన్నారు. దేవగుడి ఇసుక క్వారీకి ప్రొద్దుటూరు వాసులు వెళితే దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించే పరిస్థితి లేదన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక ద్వారా రూ.కోట్లు సంపాదిస్తుండగా మరో వైపు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మనుషులు పోట్లదుర్తి క్వారీ నుంచి ఇసుకను తరలించి లాభపడుతున్నారన్నారు. ఎవరైనా అత్యవసరానికి ఇతర చోట్ల ఇసుకను తెస్తే అధికారులు మాత్రం ఆ ట్రాక్టర్లకు రూ.2లక్షలు జరిమానా విధించి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 18న తాను తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసినా నిద్ర నటిస్తున్న కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని ఉచిత ఇసుకను ప్రజలకు భారంగా మార్చారని అన్నారు. ఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోరు కలెక్టర్ టీడీపీ నేతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. పాత బస్టాండ్‌ను కూల్చివేశారని చెప్పినా, మున్సిపల్ పార్కులో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి సంబంధించిన మట్టిని అమ్ముకున్నారని ఫిర్యాదు చేసినా, నిబంధనలకు విరుద్దంగా ట్యాంకును నిర్మించారని చెప్పినా, ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ల యజమానులపై దేవగుడిలో మంత్రి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పినా కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాను శాంతియుతంగా దీక్ష చేపట్టాలనని నిర్ణయించానన్నారు. అప్పటికీ సమస్యను పరిష్కరించకపోతే బంద్‌కు పిలుపునిస్తానని, తర్వాత రాష్ట్రస్థాయిలో వైఎస్సార్సీపీ నాయకులను పిలిచి ఉద్యమం చేపడుతామన్నారు. అంతకూ స్పందించని పక్షంలో తాను ఆమరణ దీక్షకు పూనుకుంటానని తెలిపారు. అప్పటికైనా అధికారులు దిగి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. స్థానిక తహసీల్దార్ సైతం తన ఆవేదనను పట్టించుకోకుండా ఊయలలో ఊగినట్లు వీల్ చైర్లో ఊగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మంత్రి అనుచరుల సహకారంతో తహసీల్దార్ రూ.లక్షలు దోచుకుంటున్నారని, టీడీపీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వ్యాపారం చేస్తూ టీడీపీ నేతలు రూ.కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. ఓ ఎమ్మెల్యే ఇసుకతో రూ.100 కోట్లు సంపాదించగా, మరో ఎమ్మెల్యే కోటీశ్వరుడు అయ్యారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చిప్పగిరి ప్రసాద్, నారాయణరెడ్డి, సోములవారిపల్లె శేఖర్, కల్లూరు నాగేంద్రారెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
'పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణం'
సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్ క్వారీ ప్రమాదం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ అన్నారు. పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. 10 మంది మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎక్కడైనా దుర్ఘటనలు జరిగిన తర్వాతే ప్రభుత్వం హడావిడి చేస్తోందని ధ్వజమెత్తారు. లోకల్ గవర్నెన్స్ ద్వారానే ప్రభుత్వ శాఖలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనార్టీల వెనకబాటుతనానికి టీడీపీనే కారణమని మహ్మద్ ఇక్బాల్ ధ్వజమెత్తారు. మైనార్టీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందన్నారు. దేశంలో మైనారిటీ మంత్రిలేని కేబినెట్ టీడీపీ ప్రభుత్వానిదే అని నిప్పులు చెరిగారు. మైనార్టీల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘటన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని కొనియాడారు. వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు. -
మంత్రులు అధికారులు ఏం చేస్తున్నారు? : పవన్
సాక్షి, కర్నూలు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ పేలుడు ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పేలుడు ఘటనకు సంబంధించి వివరాలను పవన్ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. హత్తిబెళగల్ భారీ పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు నాయుడు సమర్థించి తప్పు చేస్తున్నారని తెలిపారు. సొంత నాయకులను కాపాడుకోవడం కోసం సీఎం ప్రజాసమస్యలను విస్మరించకూడదని సూచించారు. నిరు పేద కూలీల మరణాలు చూసైనా రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు యథేచ్ఛగా అక్రమమైనింగ్ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పని చేస్తోందా అని మండిపడ్డారు. మంత్రులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాలో దాదాపు 1600 క్వారీలకు ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇచ్చిందని పవన్ ధ్వజమెత్తారు. వాటిలో సగానికిపైగా అక్రమ క్వారీలు ఉన్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. స్థానికంగా ప్రజలు కొన్ని సమస్యలు తన దృష్టికి తెచ్చారని పవన్ తెలిపారు. వాటిపై సరైన సమయంలో స్పందాస్తానని పేర్కొన్నారు. -
బుట్టా రేణుకకు చేదు అనుభవం
సాక్షి, కర్నూలు : గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనలో ధ్వంసమైన ఇళ్ల పరిశీలనకు వచ్చిన బుట్టా రేణుకను గ్రామస్తులు అడ్డుకున్నారు. తక్షణమే క్వారీని సీజ్ చేసి తమకు ఇళ్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం క్వారీ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను స్వరాష్ట్రానికి పంపించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది జార్ఖండ్‌కు చెందిన వారు ఉన్నారు. అయితే వీరిని అంబులెన్స్‌లో తరలించడానికి కుదరదంటున్నారు అంబులెన్స్ సిబ్బంది. మృతదేహాలను హైదరాబాద్ వరకు మాత్రమే తీసుకెళ్తామంటున్నారు. మార్చురీ ఫ్రీజర్లలో ఉంచిన పది మృతదేహాల్లో కేవలం నాలుగింటిని మాత్రమే అధికారులు గుర్తించారు. మిగిలిన వారి వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. -
ముద్ద దిగకముందే మృత్యువాత
అప్పుడప్పుడే అన్నం వండుకున్నారు..తినడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన. నలుదిక్కులూ దద్దరిల్లేలా భారీ పేలుడు. క్షణాల్లోనే పరిస్థితి భీతావహంగా మారిపోయింది. వండుకున్న అన్నం తినకముందే కూలీలు మాంసపు ముద్దలుగా మారిపోయారు. పేలుడు తీవ్రతకు శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని కుక్క నోట కరుచుకుని తీసుకెళ్లడం చూపరులను కలచివేసింది. ఎక్కడి నుంచో వచ్చి దయనీయస్థితిలో మృత్యువాత పడ్డారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు(అర్బన్): ఆలూరు మండలం హత్తిబెళగల్ కంకర క్వారీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న భారీ పేలుడులో 10 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వీరంతా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు నిర్ధారించారు. క్వారీలో నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దాలు సంభవించాయి. ఈ శబ్దాలకు సమీపంలోని హత్తిబెళగల్, అగ్రహారం గ్రామాల్లోని అనేక ఇళ్లు కంపించాయి. ఆయా గ్రామాల్లోని అనేక ఇళ్లలో భోజనం చేస్తున్న వారి కంచాల్లో మిద్దెలపై నుంచి మట్టి పడింది. భారీ శబ్దాలతో పాటు మంటలు నింగికెగసడంతో రెండు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. పేలుడు సంభవించిన సమయంలో విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ప్రజలందరూ ఇళ్లను వదలిపెట్టి వీధుల్లోకి వచ్చారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటు రాత్రంతా జాగరణ చేశామని గ్రామస్తులు చెప్పారు. మూడు, నాలుగేళ్లుగా క్వారీ పేలుళ్ల వల్ల తమ ఇళ్లు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయని, వెంటనే నిలుపుదల చేయాలని తహసీల్దారు నుంచి కలెక్టర్ వరకు అనేక వినతి పత్రాలు అందించినా, ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు. హత్తిబెళగల్‌లో 50 ఇళ్లకు నష్టం హత్తిబెళగల్ గ్రామ సమీపంలోని కొండల్లో విఘ్నేశ్వర క్రషర్స్ చేస్తున్న బ్లాస్టింగ్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు శబ్దాలకు సమీపంలోని అగ్రహారం, హత్తిబెళగల్ గ్రామాల్లోని ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. హత్తిబెళగల్ గ్రామంలోని చాకలివీధిలోనే దాదాపు 30 మట్టి మిద్దెలు కంపించి మట్టి కుప్పలు కుప్పలుగా ఇళ్లలో పడిపోయింది. మరికొని ఇళ్ల గోడలు పగుళ్లు ఇచ్చాయి. దీంతో ఎప్పుడు తమ ఇళ్లు కూలిపోతాయోననే భయంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కైలాష్ నీవెక్కడ? కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): క్వారీ పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కూలీలు ఒడిశా రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్ కైలాష్ ద్వారా ఇక్కడికి వచ్చారు. నెలకు రూ.12,000 కూలితో అగ్రిమెంట్ అయి క్వారీలో పనికి చేరారు. ఈ ఘటనలో మృతి చెందిన పది మందిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కంచన్‌కుమార్ పాశ్వాన్, బూంచి కుమార్ పాశ్వాన్ మృతదేహాలను గుర్తించారు. మిగిలిన 8 మంది మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. వీరిని కాంట్రాక్టర్ కైలాష్ మాత్రమే గుర్తు పట్టేందుకు వీలుంది. తినే అన్నంలో మట్టి పడింది పగలంతా పొలాల్లో పనిచేసి వచ్చిన మేము రాత్రి భోజనం చేసే సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇంటి మిద్దెలో నుంచి మట్టి అన్నం తినే కంచంలో పడింది. ఇళ్లంతా మట్టి నిండుకుంది. ఏమి జరుగుతోందో తెలియక ఎంతో భయపడ్డాం. కరెంట్ కూడా లేకపోవడంతో భయం భయంగా రాత్రంతా గడిపాం. మా ఇంటితో పాటు కొండను ఆనుకొని ఉన్న చాకలివీధిలోని అన్ని ఇళ్లూ వణికిపోయాయి. ఇళ్లు పడిపోతాయేమోనని భయపడ్డాం. – కవిత, హత్తిబెళగల్ మృత్యువును తప్పించుకున్న ముగ్గురు కూలీలు క్వారీలో జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో 15 మంది ఒక షిఫ్టుగా హత్తిబెళగల్ కొండల్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు. పగలు షిప్టు పూర్తి చేసుకున్న జార్ఖండ్ కూలీలు ఏడుగురితో పాటు మరికొందరు ఒడిశాకు చెందిన కూలీలు బ్లాస్టింగ్ జరుగుతున్న కొండల సమీపంలోనే రేకుల షెడ్డులో వంట చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జార్ఖండ్‌కు చెందిన మరో ముగ్గురు కూలీలు సొంత పనిమీద సమీపంలోని ఆలూరుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో భారీ విస్పోటనం సంభవించడంతో జార్ఖండ్‌కు చెందిన కంచన్ కుమార్ పాశ్వాన్ (40), బూంచి కుమార్ పాశ్వాన్ (35) తదితరులు అక్కడికక్కడే మృతి చెందగా, దిలీప్ పాశ్వాన్ (35), వికాస్ పాశ్వాన్ (20) తో పాటు మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు. పనిమీద బయటకు వెళ్లిన అక్షయ్‌సింగ్ పాశ్వాన్, బారీకర్ పరశురాం, ఆకాష్ పరశురాం మాత్రం మృత్యువు నుంచి తప్పించుకున్నారు. వీరంతా జార్ఖండ్ రాష్ట్రం మీరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బానా ప్రాంతానికి చెందిన వారుగా చెబుతున్నారు. ఆ దృశ్యం..కన్నీరు తెప్పించింది! విస్ఫోటం సంభవించిన ప్రాంతంలో శనివారం ఉదయం ఒక కుక్క మృతి చెందిన ఓ కార్మికుని కాలును నోటితో కరచుకొని ఈడ్చుకెళ్తున్న దృశ్యం చూపరులకు కన్నీరు తెప్పించింది. çసంఘటన అనంతరం ప్రమాద తీవ్రతను బట్టి జరగకూడని సంఘటనలు ఎక్కడ చోటు చేసుకుంటాయో, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమోననే భావనతో పోలీసులు రాత్రికి రాత్రే మృతదేహాలను మూటగట్టి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు సంఘటన జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులెవ్వరినీ ఆ ప్రాంతానికి రాకుండా కట్టుదిట్టం చేశారు. కానీ .. మృతుల శరీర భాగాలు ఎక్కడపడితే అక్కడ పడినా ఎవరూ పట్టించుకోలేదు. అలాగే ఈ ఘోర దుర్ఘటనలో ఒక టిప్పర్, రెండు ట్రాక్టర్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు వాటి విడి భాగాలు ఉవ్వెత్తున ఎగిసి ఫర్లాంగు దూరంలో అక్కడక్కడా పడిపోయాయి. కార్మికులు వేసుకున్న షెడ్డు పూర్తిగా కాలిపోయింది. వారికి సంబంధించిన వస్తువులు, దుస్తులు, ఇతరత్రా సామాన్లన్నీ మంటల్లో కాలిపోయాయి. చాలా ఎత్తుకు మంటలు ఎగిసిపడడంతో కార్మికులు నివాసం ఉన్న షెడ్డు, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ప్రాంతం అంతా బూడిదమయమైంది. కేవలం రేకుల షెడ్డు పైకప్పు మాత్రం అక్కడక్కడా వేలాడుతూ కనిపించింది. పేలుడు పదార్థాలతో పాటు డీజిల్ డ్రమ్ములు కూడా అక్కడే ఉండడంతో అవి కూడా పేలిపోయాయి. క్వారీ సీజ్ చేయాలి ఆలూరు: హత్తిబెళగల్ గ్రామంలోని కొండపై నిర్వహిస్తున్న క్వారీని వెంటనే సీజ్ చేయాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డిమాండ్ చేశా రు. శనివారం పేలుడు ఘటన స్థలానికి చేరుకుని పేలుళ్లకు గల కారణాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ పేలుళ్లు జరిగి కార్మికులు మృతి చెందారన్నారు. గతంలో క్వారీని బంద్ చేయించాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారుల అండదండలతోనే క్వారీ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలలని డిమాండ్ చేశారు. అలాగే క్వారీ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పోస్టుమార్టం పూర్తి కర్నూలు (హాస్పిటల్)/ఆలూరు: పేలుడులో చనిపోయిన పదిమంది మృతదేహాలకు కర్నూలు పెద్దాస్పత్రి మార్చురీలో ఫొరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శంకర్‌నాయక్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రంగయ్య పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను అక్కడే ఉంచారు. వాటి తరలింపుపై అయోమయం నెలకొంది. మృతదేహాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తరలించి..అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఒడిశాకు తరలించాలని భావించినప్పటికీ, అందులో స్థానికులెవ్వరైనా ఉంటే కొత్త సమస్యలు తలెత్తుతాయన్న సందిగ్ధంలో అధికారులు తరలింపు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.అయితే.. ప్రస్తుతానికి గుర్తించిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కంచన్ కుమార్ పాశ్వాన్, బూంచి కుమార్ పాశ్వాన్ల మృతదేహాలను మాత్రమే బంధువులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన 8 మృతదేహాల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అక్రమ క్వారీలపై చర్యలు: రాష్ట్రంలోని అక్రమ క్వారీలపై సమగ్ర విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మైనింగ్ మంత్రి సుజయ కృష్ణరంగారావు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో పనిచేసే కార్మికుల వివరాలను ఆయా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.శనివారం వీరు కర్నూలు పెద్దాస్పత్రిలో కూలీల మృతదేహాలను పరిశీలించారు. అలాగే పేలుళ్లు జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ఘటనపై విచారణ కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ కె.సత్యనారాయణను నియమించారు. మంత్రుల వెంట డీజీపీ ఠాకూర్, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తదితరులు ఉన్నారు. -
క్వారీ పేలుడు.. టీడీపీ నేతపై నాన్ బెయిలబుల్ కేసు
సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్ క్వారీ యజమాని, టీడీపీ నేత శ్రీనివాస చౌదరీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 304/11 ప్రకారం యజమానిపై కేసు నమోదు చేసినట్లు కర్నూల్ పోలీసులు శనివారం తెలిపారు. కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించడంతో పదిమంది మృతి విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ స్పందించారు. మైనింగ్ బ్లాస్టింగ్ వలన పేలుడు జరగలేదని, కేవలం జిల్టన్ స్టిక్ డంపింగ్ వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామదర్శిని ప్రజలు అడ్డుకున్నప్పుడే క్వారీపై చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదని ఆయన అన్నారు. ఘటనపై విచారణ జిరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోస్ట్‌మార్టం ఘటనలో మరణించిన మృతదేహాలకు వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఘటనలో చనిపోయిన పది మందిని అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కో మృత దేహానికి ఒక్కో వీఆర్వోను నియమించి పంచనామా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
క్వారీ వద్ద పోలీసుల అత్యుత్సాహం
కర్నూలు జిల్లా: హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనాస్థలి వద్ద పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. సంఘటనాస్థలాన్ని సందర్శించడానికి వచ్చిన బీజేపీ, వామపక్షాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల తీరును తప్పుపట్టారు. టీడీపీ నాయకుడు శ్రీనివాసుల చౌదరీకి సంబంధించిన క్వారీ కాబట్టే వారిని తప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఘటనకు కారకులైన టీడీపీ నాయకులతో పాటు సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాలన్నారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ ప్రమాదాన్ని నిరసిస్తూ విజయవాడలో సీఐటీయూ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ అండతోనే యధేచ్ఛగా అక్రమంగా క్వారీలు తవ్వుకుంటున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆర్ధికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు. -
క్వారీ బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, రాష్ట్ర కార్యదర్శులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌర వెంకట్ రెడ్డిలు బాధితులను కలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆలూరు నియోజకవర్గంలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వారీ నిర్వాహకుడు టీడీపీ సానుభూతిపరుడు కావడం వల్లే అధికారులు అనుమతులిచ్చారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. మరణించిన వారికి ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. -
క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్
విజయవాడ: కర్నూలు జిల్లా క్వారీ పేలుడు ఘటనపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు స్పందించారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ కొండ క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్ జరుగుతుందని, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పెడచెవిన పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. వీటిని టీడీపీ ప్రభుత్వ హత్యలుగా భావించాలని పేర్కొన్నారు. కార్మికులకు భద్రతా చర్యలు లేవని, లేబర్ డిపార్ట్‌మెంట్‌పై కేసులు పెట్టకుండా ఉండాలన్నదే టీడీపీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వలస కూలీలకు సంబంధించి లేబర్ రూల్ ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తే కార్మిక శాఖ రిజిస్టర్లో నమోదు చేయాలి..కార్మికులు ఏ కంపెనీలో పని చేస్తారో ఆ కంపెనీ రిజిస్టర్లో కూడా నమోదు చేయాలి..కానీ అలా చేయడం లేదని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ప్రజలకు రక్షణ లేకుండా చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలపై పునరాలోచన చేయాలని సూచించారు. గ్రామదర్శిని టీడీపీ ప్రచార కార్యక్రమంలా మారిందని, అది ఒట్టి బోగస్ కార్యక్రమమని విమర్శించారు. క్వారీ ఘటనపై అన్ని రాజకీయపక్షాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. విద్యార్థులపై దాడులు, నాయకుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయ్. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. నెల్లూరు జిల్లా రాపూర్‌లో వామపక్షాలు పర్యటిస్తాయి. దళితులు, విద్యార్థులు, కార్మికుల రక్షణ కోరుతూ సెప్టెంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నా’ మని వెల్లడించారు. -
క్వారీ పేలుడు ఘటన : ఇద్దరి పరిస్థితి విషమం
కర్నూలు/ అమరావతి : ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాజేంద్ర(40) 90 శాతం కాలిన గాయాలు, రామచంద్ర(45) 50 శాతం గాయాలు, పాండు(40) 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. రాజేంద్ర, పాండుల పరిస్థితి విషమంగా ఉందని కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెబుతున్నారు. దిలీప్(22), వికాస్(19)లకు ప్రమాదమేమీ లేదని, చిన్నపాటి కాలిన గాయాలు అయ్యాయని తెలిపారు. సీఎం దిగ్ర్బాంతి అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. డీజీపీ, హోంమంత్రులను సంఘటనాస్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. గాయపడిన వారికి అత్యున్నత స్థాయి వైద్యం అందించాలని చెప్పారు.నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ యజమానులపై కఠిన చర్యలు చేపట్టాలని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. -
డీజీపీఎస్ సర్వేతో అక్రమ మైనింగ్ గుర్తింపు
పెద్దేముల్ వికారాబాద్ : డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం)తో అక్రమ మైనింగ్‌ను గుర్తించవచ్చని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మైనింగ్ కార్యాలయంలో అధికారులు, సుద్ద, క్వారీ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు పెద్దేముల్ మండలం కందనెల్లి తండా శివారులో ఉన్న క్రషర్ వద్ద హారితహారం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం డీడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డీజీపీఎస్ సర్వే ద్వారా అక్రమాలను గుర్తిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి లీజు తీసుకొని నిర్ణయించిన హద్దులు దాటితే డీజీపీఎస్ ద్వారా సులభంగా తెలుస్తోందని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో డీజీపీఎస్ ద్వారా చేపట్టిన సర్వే మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో సుద్ద, నాపరాయి, ఎర్రమట్టికి సంబంధించిన భూములు లీజు తీసుకొని.. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో కూడా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ సర్వే ద్వారా హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకుంటామని డీడీ తెలిపారు. అనంతరం లీజుదారులకు డీజీపీఎస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. సుద్ద, క్వారీకి సంబంధించి అన్ని వ్యవహారాలు ఆన్లైన్లోనే చేయాలని ఆదేశించారు. సుద్ద ఫ్యాక్టరీల పరిసరాల్లో కాలుష్యం వెదజల్లకుండా మొక్కలు నాటాలని సూచించారు. తాండూరు ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ రవి, అధికారులు సాంబశివ, రమేష్ ఉన్నారు. -
గ్రానైట్‌పై పెద్దల కన్ను
కంచిలి: మండల పరిధిలో గిరిజన గ్రామాల్లో గ్రానైట్ క్వారీయింగ్ అనుమతులివ్వొద్దంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జలంత్రకోట పంచాయతీ పరిధి నువాగడ రెవెన్యూ పరిధిలో గల క్రాంతినగర్ గ్రామానికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 47లోని 5.5 హెక్టార్ల కొండలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. దీంతో ఈ కొండలపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇదే అదునుగా తమ పలుకుబడి ఉపయోగించి కొండ చుట్టూ ఐటీడీఏ నిధులు రూ.32 లక్షలతో 1200 మీటర్ల మెటల్ రోడ్డును మంజూరు చేయించుకుని చకచకా పనులు చేపట్టేశారు. ఈ వ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రాబల్యంతో జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే బంధువుకే అనుమతి ఎమ్మెల్యే అశోక్‌కు చెందిన బంధువు ఈ కొండపై అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. దీంతో పంచాయతీ నుంచి అనుమతి పొందారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. దీంతో తహసీల్దార్ డి.రామ్మోహనరావు తన సిబ్బందితో కలసి కొండ సమీప గ్రామాలైన నువాగడ, క్రాంతినగర్, రాజాశాంతినగర్ గ్రామాలకు గురువారం వెళ్లి విచారించారు. ఆ సమయంలో ఆయా గ్రామస్తులు చేరుకుని.. ఇక్కడ కొండను క్వారీయింగ్‌కు అనుమతివ్వొద్దంటూ నిరసన తెలిపారు. ఈ కొండకు ఆనుకుని తమ గ్రామాలున్నాయని, అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్నామని, ఈ కొండలో క్వారీయింగ్ చేస్తే తమ బతుకులు నాశనమవుతాయని ప్రాథేయపడ్డారు. క్వారీయింగ్‌కు పాల్పడితే ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసనలో గిరిజనులు భీమాబిసాయి, లిమ్మో బిసాయి, గణేష్ సవర, మహేష్‌గొమాంగో, లావణ్యబుయ్య, కవిత గొమాంగో, ఇస్తాయెల్ గొమాంగో తదితరులు పాల్గొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే మనుషుల ఒత్తిళ్లతో సంబంధిత ఫైల్.. టెక్కలి ఏడీ మైన్స్‌కు.. అక్కడి నుంచి రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ అనుమతికి పంపించేశారు. బురుపడ కొండ కూడా.. మండలంలో కుంబరినౌగాం పంచాయతీ పరిధిలో బురుపడ గ్రామంలో సర్వేనంబర్ 167/1లో 3 హెక్టార్లలో ఉన్న కొండలో కూడా గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. దీనిని లీజు కోసం రాజాం ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి దరఖాస్తు చేశారు. దీనిపై గత సోమవారం స్థానిక గిరిజనులతో కలిసి మండల సీపీఐ నేతలు నిరసన తెలిపారు. దీనిపైన కూడా స్థానిక పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఎన్ఓసీ ఇచ్చేశారు. సంబంధిత ఫైల్‌ను కూడా టెక్కలి ఏడీ మైన్స్‌కు అనుమతుల కోసం పంపించారు. ఇలా మండలంలో గిరిజన గ్రామాల్లో ఉన్న రెండు క్వారీల్లో గ్రానైట్ నిక్షేపాల తరలింపు కోసం చేస్తున్న ప్రయత్నాలపై గిరిజనులు కన్నెర్ర జేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా క్వారీలు ఇక్కడ సాగించేది లేదంటూ ప్రతిఘటించటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్వారీలకు అడ్డుపడే వారిని ఏదోరకంగా భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి పోలీస్ కేసులు బనాయిస్తామని బెదిరింపులు ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక నిరసనకారుడిని బెదిరించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. నువాగడ రెవెన్యూ పరిధిలో గ్రానైట్ క్వారీయింగ్ కోసం ప్రతిపాదించిన కొండ -
తహసీల్దార్‌ను తొలగించండి
జయపురం : జయపురం తహసీల్దార్ రంజిత మల్లిక్‌ను పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి, జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్‌ల నేతృత్వంలో సోమవారం ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కలెక్టర్, సబ్ కలెక్టర్ నిరాకరించినా తహసీల్దార్ క్వారీలకు అనుమతినిచ్చి ఇద్దరి మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జుధిష్టర్ రౌళో మాట్లాడుతూ..కొరాపుట్ జిల్లా ప్రజల అమాయకత్వాన్ని అధికారులు తమ స్వలాభం కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. క్వారీ సంఘటనలో ఇద్దరు ఆపరేటర్లు మరణానికి పరోక్షంగా జయపురం తహసీల్దార్ కారకులని ఆయన ఆరోపించారు. క్వారీ లీజ్‌కు అనుమతులు ఇవ్వొద్దని కొరాపుట్ జిల్లా కలెక్టర్ జయపురం తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసినా వాటిని బేఖాతరు చేసి తహసీల్దార్ క్వారీకి అనుమతులు ఇచ్చారన్నారు. రాణిగుడ సమీపంలోని బొరిపుట్ క్వారీకి డీడీ బిల్డర్స్‌కు ఆమె అనుమతినిచ్చారని పేర్కొన్నారు. ఆ క్వారీలో బండరాళ్లు పడి ఇద్దరు జేసీబీ ఆపరేటర్లు మరణించారని గుర్తుచేశారు. వారి మృతదేహాలను వెలికితీయడానికి రూ.కోటిపైనే ఖర్చయిందని ఆయన వెల్లడించారు. ఆ ఖర్చును తహసీల్దార్ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మరణానికి పరోక్షంగా కారణమైనా తహసీల్దార్ బాధ్యులని అందుచేత రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డీడీ బిల్డర్స్‌కు ఏ నియమం ప్రకారం క్వారీ లీజుకు ఇచ్చారో తహసీల్దార్ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తహసీల్దార్ ద్వారా ప్రజలకు అందించిన బోగస్ పట్టాలపై విజిలెన్స్‌చే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరూపిస్తే శిక్షకు సిద్ధం: తహసీల్దార్ గవర్నర్‌ను ఉద్దేశించిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు అందజేశారు. వెంటనే ఆమె వినతిపత్రాన్ని చదివి జుధిష్టర్ రౌళోతో వాగ్వాదానికి దిగారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యాలని తాను చట్టపరంగానే క్వారీలకు అనుమతినిచ్చానని తెలిపారు. కలెక్టర్ గాని సబ్‌కలెక్టర్ గానీ క్వారీలకు అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించలేదని, అటువంటి లేఖలు తనకు రాలేదని, మీవద్ద ఉంటే చూపించండని ఆమె సవాల్ చేశారు. తాను తప్పు చేశానని నిరూపిస్తే తగిన శిక్షకు సిద్ధమని స్పష్టంచేశారు. వెంటనే రౌళో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడంతో ఆమె వెంటనే క్యాబిన్ లోపలికి వెళ్లిపోయింది. ఆందోళననలో పార్టీ నేతలు ఉత్తమ మల్లిక్, బలరాం నాయక్, కేశవ నాగ్, నంద హరిజన్, నిత్యానంద పాత్రో, హరి పంగి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మరో ఆపరేటర్ మృతదేహం లభ్యం
జయపురం ఒరిస్సా : కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి రాణిగుడ ప్రాంతంలో తెలింగిరి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో రాళ్ల క్వారీలో బండరాళ్లు విరిగిపడడంతో ఇద్దరు జేసీబీ ఆపరేటర్లు సజీవసమాధైన సంఘటనలో ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. మరో మృతదేహం జాడతెలియలేదు. 11 రోజులుగా యంత్రాంగం ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని, మరో జేసీబీని రాంచీ నుంచి వచ్చిన రక్షణ దళ ఇంజనీరింగ్ బృందం వెలికితీసింది. తొలుత ఒక జేసీబీని వెలికి తీసిన సంగతి విదితమే. ఇంజినీరింగ్ బృందం బండరాళ్లను పేల్చుతున్న నేపథ్యంలో జేసీబీ కనిపించింది. దీని కిందన మృతదేహం చేయి కనిపించడంతో ఆపరేటర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. చేయి తప్ప మరో అవయవం కనిపించకపోవడంతో గాలింపును మరింత తీవ్రం చేసి మృతదేహాన్ని వెలికితీస్తున్నారు. అయితే రెండవ ఆపరేటర్ ఎక్కడ ఉన్నదీ ఇంతవరకు తెలియరాలేదు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బండలను బ్లాస్ట్ చేయడంతో దరిదాపుల కు ఎవరినీ రానీయడం లేదు. కేవలం ఆపరేషన్ టీం, పోలీసులు, అధికారులు మాత్రమే పనుల ను పరిశీలిస్తున్నారు. జేసీబీ యంత్రం మట్టి, బండరాళ్ల కింద ఒక వ్యక్తి మృతదేహం కనుగొన్నారని అయితే ఆ మృతదేహం ఎవరిదో గుర్తించలేదని కొరాపుట్ కలెక్టర్ కె.సుదర్శన చక్రవర్తి వెల్లడించారు. మృతదేహాన్ని బయటకు తీసి న తరువాత ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు బంధువులను అనుమతిస్తామని ఆయన వెల్లడిం చారు. సంఘటన స్థలంలో అంబులెన్స్‌తో పాటు డాక్టర్ల బృందం ఉంది. -
క్వారీలో పడి వ్యక్తి దుర్మరణం
కొవ్వూరు : క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. దేచర్ల సమీపంలోని చంద్రారెడ్డి క్వారీలో గతంలో మధ్యప్రదేశ్‌లోని బార్గాకు చెందిన రామ్‌కుమార్(42) వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఇటీవల క్వారీని మూసివేయడంతో అతను ఇతర పనుల కు వెళ్తున్నాడు. ఈనెల 19న రాత్రి స్నేహితుడు ప్రహ్లాదతో కలిసి అతను మద్యం తాగాడు. ఆ తర్వాత వారిద్దరూ క్వారీలోకి వచ్చి భవనం వద్ద నిద్రించారు. మరుసటి రోజు ఉదయం వెళ్లిపోయారు. దీనిని క్వారీ ప్రస్తుత వాచ్‌మన్ రాయుడు గమనించినా ఇక్కడ పనిచేసినవాడే కదా అని ఊరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ప్రహ్లాద వచ్చి రామ్‌కుమార్ కనిపించడం లేదని, క్వారీ గోతిలో పడ్డాడేమోనని చెప్పాడు. దీంతో ప్రహ్లాదతోపాటు వాచ్‌మన్ లోపలికి వెళ్లిచూడగా, గోతిలో రామ్‌కుమార్ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
క్వారీలో పడి వ్యక్తి దుర్మరణం
కొవ్వూరు : క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. దేచర్ల సమీపంలోని చంద్రారెడ్డి క్వారీలో గతంలో మధ్యప్రదేశ్‌లోని బార్గాకు చెందిన రామ్‌కుమార్(42) వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఇటీవల క్వారీని మూసివేయడంతో అతను ఇతర పనుల కు వెళ్తున్నాడు. ఈనెల 19న రాత్రి స్నేహితుడు ప్రహ్లాదతో కలిసి అతను మద్యం తాగాడు. ఆ తర్వాత వారిద్దరూ క్వారీలోకి వచ్చి భవనం వద్ద నిద్రించారు. మరుసటి రోజు ఉదయం వెళ్లిపోయారు. దీనిని క్వారీ ప్రస్తుత వాచ్‌మన్ రాయుడు గమనించినా ఇక్కడ పనిచేసినవాడే కదా అని ఊరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ప్రహ్లాద వచ్చి రామ్‌కుమార్ కనిపించడం లేదని, క్వారీ గోతిలో పడ్డాడేమోనని చెప్పాడు. దీంతో ప్రహ్లాదతోపాటు వాచ్‌మన్ లోపలికి వెళ్లిచూడగా, గోతిలో రామ్‌కుమార్ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
క్వారీ గుంతలో పడి యువకుడి మృతి
రావిపాటివారిపాలెం (ప్రత్తిపాడు): ప్రమాదవశాత్తూ క్వారీలో గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన రావిపాటివారిపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని రావిపాటివారిపాలెంకు చెందిన వాసిమళ్ళ నాగేశ్వరరావు(37) సోమవారం ఉదయం పొలానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు క్వారీ గుంతలో దిగాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని బయటకు తీసి ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి జోసఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.బాలకష్ణ తెలిపారు. -
వే బిల్లులు లేకుండా ఇసుక రవాణా ?
ములుగు : అక్రమ ఇసుక రవాణా దందా అధికారుల అండఉండడంతో మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది. ఏటూరు నాగారం మండలంలోని క్వారీల నుంచి ఇసుక లారీలు వే బిల్లులు లేకుండా జిల్లా కేంద్రాలకు తరలుతున్నాయి. అధికారుల తనిఖీలు తూతూమంత్రం గా జరుగుతుండడంతో ఇష్టారాజ్యంగా అధిక లోడుతో దర్జాగా డివిజన్ సరిహద్దులు దాటుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఈ తంతు జరుగుతున్నా ఎక్కడా బయటపడకుండా ఇసుక లారీల యజమానులు, కాంట్రాక్టర్లు కొందరు అధికారుల సాయం తో తతంగాన్ని నడుపుతున్నారని గుసగుసలు విన వస్తున్నాయి. రాత్రి 9 గంటల వరకే అనుమతి ప్రస్తుతం ఏటూరు, తుపాకులగూడెంలో ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ఆయా క్వారీల నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఇసుకను బయటకు పంపించేందుకు అనుమతి ఉంది. కానీ రాత్రి 12 గంటల వరకు ములుగు మండల కేంద్రాన్ని దాటుకుంటూ లారీలు వెళుతున్నాయి. రోజువారిగా వందల లారీలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరులుతున్నాయి. ఇసుక లారీల యజమానులు చెల్లించే చలానా ప్రకారం టీఎస్ఎండీసీ అధికారులు లారీలకు వే బిల్లులు అందించాల్సి ఉంటుంది. వే బిల్లులు తీసుకున్న అనంతరం మాత్రమే లారీలు టీఎస్ఎండీసీ చెక్‌పోస్టు దాటుతుంది. కానీ వే బిల్లులు లేకుండా పోలీసులకు పట్టుబడ్డ లారీల డ్రైవర్లు మాత్రం వే బిల్లులు తమ దగ్గర లేవని చెబుతున్నారు. వే బిల్లులను మరుసటి రోజు కాంట్రాక్టర్ తీసుకొచ్చి లారీల తీసుకెళుతున్నారు. లారీ వెంబడి ఉండాల్సిన వే బిల్లులు లేపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకున్న విజిలెన్స్, మైనింగ్ అధికారులు దాడులు జరిపారు. ఈ విషయమై వ్యాపారులకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా కొన్ని లారీలు గుట్టుచప్పుడు కాకుండా పాత పద్ధతిలో వెళుతున్నాయని తెలిసింది. గతంలో ములుగు మండలం జంగాలపల్లి చెక్‌పోస్టు వద్ద ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఏకంగా చెక్‌పోస్టును ఎత్తేశారు. ఈ హెచ్చరికతో ఉన్న చెక్పోస్టులైనా సక్రమంగా పనిచేస్తాయని భావించిన అధికారులకు మళ్లీ తలనొప్పి మొదలైనట్లయింది. -
క్వారీలపై దాడి: పేలుడు పదార్థాలు స్వాధీనం
విశాఖపట్నం : విశాఖ జిల్లా రౌలుకుంట మండలంలోని నల్లరాతి క్వారీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందున ఈ దాడులు నిర్వహించారు. పాతంపేట క్వారీకి చెందిన రాజుల నాయుడును అదుపులోకి తీసుకున్నారు. మరో క్వారీకి చెందిన వ్యక్తి పరారయ్యాడు. ఈ రెండు క్వారీల నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 36 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (రౌలుకుంట)