మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసం ఇసుక క్వారీ మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 4, 5 తేదీల్లో స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు నిరాహార దీక్షచేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుందే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు రూ.2500 నుంచి రూ.4వేల వరకు వెచ్చించి ట్రాక్టర్ ఇసుకను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇదే అదనుగా భావించి టీడీపీ నేతలు ఇసుకను బంగారంగా మార్చుకుని పేద, మధ్యతరగతి ప్రజలను సైతం దోచుకుంటున్నారన్నారు. వారికి కలెక్టర్‌తోపాటు కింది స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని విమర్శించారు.
ప్రొద్దుటూరులో ఇసుక క్వారీ చూపాలని చాలా రోజులుగా తాను జెడ్పీ సమావేశం, స్వయంగా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదన్నారు. దేవగుడి ఇసుక క్వారీకి ప్రొద్దుటూరు వాసులు వెళితే దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించే పరిస్థితి లేదన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక ద్వారా రూ.కోట్లు సంపాదిస్తుండగా మరో వైపు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మనుషులు పోట్లదుర్తి క్వారీ నుంచి ఇసుకను తరలించి లాభపడుతున్నారన్నారు. ఎవరైనా అత్యవసరానికి ఇతర చోట్ల ఇసుకను తెస్తే అధికారులు మాత్రం ఆ ట్రాక్టర్లకు రూ.2లక్షలు జరిమానా విధించి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 18న తాను తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసినా నిద్ర నటిస్తున్న కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని ఉచిత ఇసుకను ప్రజలకు భారంగా మార్చారని అన్నారు.
ఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోరు
కలెక్టర్ టీడీపీ నేతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. పాత బస్టాండ్‌ను కూల్చివేశారని చెప్పినా, మున్సిపల్ పార్కులో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి సంబంధించిన మట్టిని అమ్ముకున్నారని ఫిర్యాదు చేసినా, నిబంధనలకు విరుద్దంగా ట్యాంకును నిర్మించారని చెప్పినా, ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ల యజమానులపై దేవగుడిలో మంత్రి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పినా కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాను శాంతియుతంగా దీక్ష చేపట్టాలనని నిర్ణయించానన్నారు.
అప్పటికీ సమస్యను పరిష్కరించకపోతే బంద్‌కు పిలుపునిస్తానని, తర్వాత రాష్ట్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ నాయకులను పిలిచి ఉద్యమం చేపడుతామన్నారు. అంతకూ స్పందించని పక్షంలో తాను ఆమరణ దీక్షకు పూనుకుంటానని తెలిపారు. అప్పటికైనా అధికారులు దిగి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. స్థానిక తహసీల్దార్ సైతం తన ఆవేదనను పట్టించుకోకుండా ఊయలలో ఊగినట్లు వీల్ చైర్‌లో ఊగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మంత్రి అనుచరుల సహకారంతో తహసీల్దార్ రూ.లక్షలు దోచుకుంటున్నారని, టీడీపీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వ్యాపారం చేస్తూ టీడీపీ నేతలు రూ.కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. ఓ ఎమ్మెల్యే ఇసుకతో రూ.100 కోట్లు సంపాదించగా, మరో ఎమ్మెల్యే కోటీశ్వరుడు అయ్యారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిప్పగిరి ప్రసాద్, నారాయణరెడ్డి, సోములవారిపల్లె శేఖర్, కల్లూరు నాగేంద్రారెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment