
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు ఏమైనా పోటీ చేస్తారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఇటీవల ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి ఒకే గొడుగు కింద ఉంటూ భిన్నమైన విమర్శలు చేశారన్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ‘నీకు బలమైన అభ్యర్థి పోటీలో ఉంటాడు’ అని తనను ఉద్దేశించి అన్నారని పేర్కొన్నారు. దీనిని బట్టి వరద బలమైన అభ్యర్థి కాదని చెప్పకనే చెబుతున్నారని తెలిపారు.
లింగారెడ్డి మరో సమావేశంలో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ‘నీపై బలమైన అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల, అదృష్టం కలిసి వచ్చి నెగ్గావు’ అని అన్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వరదరాజులరెడ్డి పోటీ చేశారని తెలిపారు. వరద బలహీనమైన అభ్యర్థి అని లింగారెడ్డి చెప్పకనే చెప్పారని తెలిపారు. అలాగే 2019 ఎన్నికల్లో చురుకైన అభ్యర్థిని పోటీ చేయిస్తాం, ఆ పేరు వింటేనే నీవు షాక్‌కు గురవుతావని లింగారెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఆయన చురుకైన అభ్యర్థి కాదని తెలుస్తోందని చెప్పారు. దీన్నిబట్టి వరద, లింగారెడ్డి డల్ స్టూడెంట్స్ అని తెలుస్తోందని వ్యంగ్యంగా అన్నారు.
ఎవరితోనైనా పోటీకి సిద్ధం
టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా తాను సిద్ధంగా ఉన్నానని, వీరోచితంగా పోరాడి గెలవడంలో తనకు సంతోషం ఉంటుందని అన్నారు. తాము ధనాన్ని నమ్మిన వాళ్లం కాదని, ప్రజా సేవను నమ్ముకున్నామని చెప్పారు. చంద్రబాబు అయినా మరో బాబు అయినా ప్రజా దీవెనతో బరిలోకి దిగుతానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిప్పగిరి ప్రసాద్, బలిమిడి చిన్నరాజు, లక్ష్మీనారాయణమ్మ, జింకా విజయలక్ష్మి, ఓబుళరెడ్డి, మల్లికార్జున ప్రసాద్, అజీం, బూసం రవి పాల్గొన్నారు.