ప్రొద్దుటూరు: మాట మీద నిలబడని ఆదినారాయణరెడ్డి సవాల్ విసరడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మట్లాడారు. ఆది మాట మీద నిలబడే మనిషి కాదని అన్నారు. అధికార అంచుల మీద నిలబడ్డ ఆయన ఏనాటికైనా జారిపోక తప్పదని పేర్కొన్నారు.
నాటి సవాళ్లు ఏమయ్యాయి..
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది మాట మీద నిలబడే వ్యక్తి కాదని చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నప్పటికీ రెండు మాత్రం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. 2005 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 3 కౌన్సిల్ సీట్లు వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆది సవాల్ విసిరారన్నారు. అయితే టీడీపీ 3 కౌన్సిలర్ స్థానాలు గెలిచిన తర్వాత రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి వెళ్లేటప్పుడు కూడా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని అన్నారు. ఇంత వరకూ పార్టీకి, పదవికి రాజీనామా చేయలేదని తెలిపారు. డబ్బుతో రాజ్యసభ పదవిని కొన్న రమేష్‌నాయుడు రాజకీయ నాయకుడే కాదన్నారు. ఆయన ఏనాడూ ప్రజా విశ్వాసం పొందలేదని, రూ. 10కి కొని రూ.15కు విక్రయించే వ్యాపరస్తుడని ఎమ్మెల్యే తెలిపారు.
వక్రీకరణలు వద్దు..
తాను మాట్లాడిన మాటలను టీడీపీ నాయక త్రయం వక్రీకరిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ‘మీరు గెలిస్తే ఊడిగం చేస్తాననే’ మాట చెప్పలేదన్నారు. 60 ఓట్లు మా వద్ద ఎక్కువగా ఉన్నాయి..మరో 40 ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాం.. వెరసి 100 ఓట్లతో గెలవబోతున్నాం అని టీడీపీ నాయకులు అన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దానికి సమాధానంగానే 60 ఓట్ల సంఖ్యాబలం చూపిస్తే ఊడిగం చేస్తానని చెప్పానన్నారు. ఆ సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. తాను జమ్మలమడుగులో చేయడం వల్లనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 6 వేల ఓట్లతో బయట పడగలిగారని ఆది చెప్పడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్ బొమ్మతో గెలిచిన వ్యక్తి ఇలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. వైఎస్‌ను విపరీతంగా అభిమానించే ప్రజాప్రతినిధులారా ఆయన పట్ల మరోసారి ప్రేమను వ్యక్త పరచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పార్టీ పట్టణాధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్, గజ్జల కళావతి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జింకా విజయలక్ష్మి, దేవిప్రసాదరెడ్డి పాల్గొన్నారు.