
ఈ ప్రాంతంలోనే జేసీబీ కింద ఆపరేటర్ చేయి కనిపించింది
జయపురం ఒరిస్సా : కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి రాణిగుడ ప్రాంతంలో తెలింగిరి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో రాళ్ల క్వారీలో బండరాళ్లు విరిగిపడడంతో ఇద్దరు జేసీబీ ఆపరేటర్లు సజీవసమాధైన సంఘటనలో ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. మరో మృతదేహం జాడతెలియలేదు. 11 రోజులుగా యంత్రాంగం ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని, మరో జేసీబీని రాంచీ నుంచి వచ్చిన రక్షణ దళ ఇంజనీరింగ్ బృందం వెలికితీసింది.
తొలుత ఒక జేసీబీని వెలికి తీసిన సంగతి విదితమే. ఇంజినీరింగ్ బృందం బండరాళ్లను పేల్చుతున్న నేపథ్యంలో జేసీబీ కనిపించింది. దీని కిందన మృతదేహం చేయి కనిపించడంతో ఆపరేటర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. చేయి తప్ప మరో అవయవం కనిపించకపోవడంతో గాలింపును మరింత తీవ్రం చేసి మృతదేహాన్ని వెలికితీస్తున్నారు. అయితే రెండవ ఆపరేటర్ ఎక్కడ ఉన్నదీ ఇంతవరకు తెలియరాలేదు.
ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బండలను బ్లాస్ట్ చేయడంతో దరిదాపుల కు ఎవరినీ రానీయడం లేదు. కేవలం ఆపరేషన్ టీం, పోలీసులు, అధికారులు మాత్రమే పనుల ను పరిశీలిస్తున్నారు. జేసీబీ యంత్రం మట్టి, బండరాళ్ల కింద ఒక వ్యక్తి మృతదేహం కనుగొన్నారని అయితే ఆ మృతదేహం ఎవరిదో గుర్తించలేదని కొరాపుట్ కలెక్టర్ కె.సుదర్శన చక్రవర్తి వెల్లడించారు. మృతదేహాన్ని బయటకు తీసి న తరువాత ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు బంధువులను అనుమతిస్తామని ఆయన వెల్లడిం చారు. సంఘటన స్థలంలో అంబులెన్స్‌తో పాటు డాక్టర్ల బృందం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment