గతంలో పలమనేరు పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలు
ప్రభుత్వం జీఎస్‌టీని అమలు చేస్తూ రవాణా వ్యవస్థను ఆన్‌లైన్ చేసినా అక్రమాలు తగ్గడం లేదు. నెల్లూరు నుంచి చిత్తూరు జిల్లా మీదుగా కర్ణాటకకు నిత్యం సిలికా, ఇసుక రవాణా అవుతోంది. ఈ వాహనాలకు మైనింగ్ నుంచి ట్రాన్సిట్ పాస్‌గానీ ఈ–వేబిల్లులు గానీ లేకపోవడం గమనార్హం. ఈ విషయం రెండు రోజుల క్రితం పలమనేరు స్పెషల్ బ్రాంచ్ అధికారుల దాడుల్లో తేటతెల్లమైంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పలమనేరు: సాధారణంగా సిలికాను తరలించాలంటే మైనింగ్‌శాఖ నుంచి మినరల్ ట్రాన్సిట్ పాస్ రెగ్యులేషన్స్–1976 మేరకు ట్రాన్సిట్ పాస్‌ను పొందాలి. అనంతరం సరుకు లోడింగ్ చేసేచోట ఆన్‌లైన్‌లో ఈ–వేబిల్లును పొందాలి. ఇందుకు లారీకి అమర్చిన జీపీఆర్‌ఎస్‌ను అనుసంధానం చేయాలి. వేబిల్లులోని సమయంలోపు అన్‌లోడింగ్ జరగాలి. ప్రస్తుతం జీఎస్టీతో కలిపి ఈ వ్యవహారం సాగుతోంది.
జరుగుతున్నది ఇలా
ఎలాంటి రికార్డులు లేకుండానే నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సిలికాను బెంగకూరుకు తరలిస్తున్నారు. మరికొందరు మైనింగ్ పర్మిట్‌ను పొంది సిలికాకు వేబిల్లు తీసుకుని నిర్ణీత గడువులోపు రెండు, మూడు ట్రప్పులు తోలుతున్నారు. మరి కొందరు డూప్లికేట్ వేబిల్లులను చూపెడుతున్నట్టు సమాచారం. మార్గమధ్యంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మినహా మరే శాఖ అధికారులు పట్టికున్నా వేబిల్లు ఒరిజినలా నకిలీనా అనే విషయాన్ని కనుక్కోలేకపోతున్నారు. దీనికి తోడు అధికారుల సాయం ఎలాగూ ఉంది కాబట్టి వీరి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.
రంగంపేట, పూతలపట్టు వద్ద డంపింగ్ పాయింట్‌లు
చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్, పూతలపట్టు వద్ద రహస్య ప్రదేశాల్లో సిలికా డంపింగ్ పాయింట్లు ఉన్నట్టు తెలిసింది. ఇదేచోట ఇసుక కూడా డంప్ చేస్తారు. గూడూరు నుంచి సిలికాతో వచ్చిన లారీలు బెంగళూరులో దాన్ని దించేసిన తర్వాత డంపింగ్ పాయింట్‌కు వస్తాయి. అక్కడి నుంచి మళ్లీ ఇసుక లోడు చేసుకుని వెళుతున్నాయి. దీనికి వేబిల్లులో ఉండే రెండు రోజుల గడువును వాడుకుంటున్నారు.
ఏది సిలికానో.. ఏది ఇసుకో
నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సిలికా ఇసుకతో పాటు మామూలు ఇసుక కూడా బెంగళూరుకు తరలుతోంది. అక్కడ మైనింగ్ లీజుదారులు సిలికా ఇసుకను సబ్‌లీజు, లేదా సేల్స్ ద్వారా టన్ను రూ.500 దాకా విక్రయిస్తున్నారు. 20 టన్నులకు రూ.10 వేలు అవుతోంది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి కొన్ని లోడ్లు సిలికాను, మరికొన్ని లోడ్లు ఇసుకను తరలిస్తున్నాడు. మరికొందరు కింద ఇసుక దానిపైన కాస్త సిలికా ఇసుక కనిపించేలా తార్‌పాల్ కప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు.
బెంగళూరులో లారీ ఇసుక రూ.80 వేలకు పైమాటే
బెంగళూరులో సిలికా ఇసుక టన్ను రూ.35 వేలు, ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు (12 చక్రాల లారీ) పలుకుతున్నాయి. సిలికా ఇసుకను తీసుకెళితే డీజిల్‌కు రూ.20 వేలు, లోడింగ్, అన్‌లోడింగ్, డ్రైవర్ బత్తాలు, చెక్ పోస్టుల మామూళ్లు పోగా రూ.5 వేలకు పైగా గిట్టుబాటు అవుతోంది. ఇదే ఖర్చులతో ఇసుకను తీసుకెళితే లోడుకు రూ.40 వేలకు పైగా మిగులుతుంది.
గూడూరు నుంచి నిత్యం 200 లోడ్లు
గూడూరు నుంచి బెంగళూరుకు తిరుపతి, చిత్తూరు, పలమనేరు మీదుగా రోజుకు 200 లోడ్ల ఇసుక వెళుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పలమనేరు పోలీసులు మూడు గంటల వ్యవధిలోనే 30 లారీలను పట్టుకున్నారు. దీన్ని బట్టి ఎన్ని లారీలు వెళుతున్నాయో అర్థమవుతుంది.
అధికార పార్టీ నేతల అండదండలు
ఈ అక్రమ రవాణాలో లారీ యజమానులు, సిలికా ఇసుక కొనుగోలుదారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్టు సమాచారం. విజిలెన్స్, పోలీసు, ఆర్‌టీవో, సేల్స్ ట్యాక్స్ తదితర శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు చేరుతున్నాయని తెలిసింది. దీంతో వీరి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment