డెలివరీ చలానాలే వే బిల్లులు! | delivary challans are the way bills | Sakshi
Sakshi News home page

డెలివరీ చలానాలే వే బిల్లులు!

Published Wed, Feb 11 2015 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

delivary challans are the way bills

- ఎమ్మెస్టీ ప్రయాణికులే రవాణా సారధులు
- పలాస నుంచి యథేచ్ఛగా జీడిపప్పు అక్రమ రవాణా
- బిల్లులు ఉండవు.. పన్నులు చెల్లించరు
- ఎగుమతులు మొత్తం ఆరుగురు బ్రోకర్ల చేతుల్లోనే
- ప్రతి నెలా కోట్లలో ఎగుమతులు
- ఆ మేరకు పన్ను ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం

 
పలాస : జీడి పరిశ్రమలకు కేంద్రమైన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి జీడిపప్పు రకరకాల మార్గాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోంది. పక్కనున్న ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎటువంటి బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. గతం నుంచీ ఇది జరుగుతున్నా పలాస మార్కెట్ కమిటీ(ఏఎంసీ) అధికారులు ఇటీవల దాడి చేసి రూ.28 లక్షల విలువైన జీడిపప్పును సీజ్ చేయడంతో ఈ అక్రమ రవాణా బాగోతం మరోమారు చర్చనీయాంశమైంది. దీంతో సంబంధిత శాఖల అధికారులు దీనిపై దృష్టి సారించారు. జీడిపప్పు వ్యాపారులు పన్ను ఎగవేస్తూ, ఎటువంటి వే బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది.
 
కాశీబుగ్గలోని ట్రాన్స్‌పోర్టు కంపెనీల పేరుతో అడ్డుగోలుగా రవాణా చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల  పరిధిలో 600 పైచిలుకు జీడిపప్పు పరిశ్రమలకు వాణిజ్య పన్నుల శాఖ లెసైన్సులు ఉండగా, కేవలం ఆరుగురు బ్రోకర్లే ఎగుమతుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరి చేతుల మీదుగానే ప్రతి నెలా కోట్లాది రూపాయల విలువైన రవాణా లావాదేవీలు జరుగుతున్నాయి. జీడిపప్పు కంపెనీల యజమానులు ఎటువంటి అనుమతులు లేకుండానే బ్రోకర్లకు పప్పును విక్రయిస్తుండగా, వారు తమ సొంత ట్రాన్స్‌పోర్టు సంస్థల ద్వారా విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు.
 
ఎమ్మెస్టీల ద్వారా..
మరోవైపు పలాస రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం రాకపోకలు సాగించే రైళ్ల ద్వారా కూడా జీడిపప్పు అక్రమంగా తరలిపోతోంది.  దీనికి నిరుద్యోగులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. పలాస నుంచి బరంపురం తదితర పట్టణాలకు మంత్లీ సీజన్ టిక్కెట్ల(ఎమ్మెస్టీ)తో ప్రయాణికుల మాదిరిగా రైళ్లలో వెళ్లే ఈ యువకుల ద్వారా క్వింటాళ్ల కొద్దీ జీడిపప్పును రవాణా తరలిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారికి కొంత సొమ్ము ముట్టజెబుతున్నారు. జీడిపప్పు రవాణాలో భారీగా పన్ను ఎగవేత జరుగుతున్నట్లు వివిధ  శాఖల అధికారులే ఆరోపిస్తున్నారు. ఇటీవల అక్రమంగా జీడి పప్పు రవాణా అవుతున్నట్టు తెలియడంతో అధికారులు నిఘా వేసి జీడి పప్పును పట్టుకుంటున్నారు. అధికారుల నుంచి వే బిల్లులు తీసుకోకుండా పలాస కాష్యూమానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇచ్చే డెలివరీ చలానానే వే బిల్లుగా చూపిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయంలో దాడుల్లో బయటపడింది.
 
పలాస రైల్వే స్టేషన్ నుంచి కూడా అక్రమ రవాణా అవుతున్నట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా పలాస నుంచి గొప్పిలి మీదుగా ఒడిశాకు లారీలు, ఇతర వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కూడా గుర్తించారు.  అక్రమ రవాణాదారులు పలాస పీసీఎంఏ ఇచ్చిన డెలివరీ చలానాలనే ఉపయోగిస్తున్నారని పలాస మార్కెట్ కమిటీ కార్యదర్శి చిన్నికృష్ణ చెప్పారు. ఆ చలానాను ఆయన చూపిస్తూ జీడిపప్పు ఎగుమతి చేసేటప్పుడు మార్కెట్ కమిటీకి కూడా ఒక శాతం పన్ను కట్టాల్సి ఉన్నా చాలామంది దాన్ని ఎగవేస్తూ దొంగదారుల్లో రవాణా చేస్తున్నారని చెప్పారు. మొత్తానికి అక్రమ రవాణా ఉదంతం మరోమారు వెలుగు చూడటంతో అధికారులు దాడులకు పథకం రూపొందించారు. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై నిఘా పెట్టారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement