మట్టిని మింగేస్తున్నారు..
Published Sun, Nov 24 2013 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
సాక్షి, నరసరావుపేట: మట్టిని నమ్ముకున్న అన్నదాతలు అప్పులపాలవుతుంటూ అదే మట్టిని అమ్ముకుంటున్న అక్రమార్కులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.. అధికార పార్టీ అండదండలతో.. అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి ఇష్టానుసారంగా మట్టిని మింగేస్తున్నారు. బంజరు భూమి ఎక్కడ కనిపించినా అక్కడ వాలిపోతూ అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు పొక్లయిన్లు.. ఆరు టిప్పర్లు అన్న చందంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ మట్టి దందా కోటప్పకొండ ప్రాంతంలోని ఎర్రనేలల్లో అధికమైంది. నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ పరివాహక ప్రాంతంలో ఎర్రమట్టి భూములు అధికం. దీంతో అక్రమార్కుల కన్ను ఈ ప్రాంతంపై పడింది.
రోడ్డు కాంట్రాక్ట్ పనులు, నర్సరీలు,ఇళ్లకు తోలే మట్టి అంతా ఈ ప్రాంతం నుంచే తరలిస్తుండటం గమనార్హం. ఇక్కడి నుంచి అక్రమంగా తరలించిన మట్టిని వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు. కొందరైతే వ్యవసాయ భూములను సైతం మట్టి క్వారీలుగా మార్చి లోయలను తలపించే విధంగా గుంతలు తీస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆయా ప్రాంతాల్లోని గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి చిన్నారులు, పశువులు మృత్యువాతకు గురైన సంఘటనలూ లేకపోలేదు.
సామాన్యులపైనే ప్రతాపం..
గ్రామీణ ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు రెండు, మూడు ట్రక్కుల మట్టిని మెరకకోసం తరలిస్తుంటారు. అదే పెద్ద నేరంగా భావించి అపరాధ రుసుం వసూలు చేయడం, ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసే రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమదందా సాగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మనకెందుకొచ్చిన గొడవలే అని మిన్నకుండే అధికారులు నెలవారీ మామూళ్ల తీసుకుని సంతృప్తి పడిపోతున్నారు. దీంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా యధేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. వ్యవసాయ భూముల మధ్య మట్టి క్వారీలను ఏర్పాటు చేయటంతో సమీపంలో పంటలు వేసుకునే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనుమతులు లేకుండానే తవ్వకాలు..
నిబంధనల ప్రకారం ప్రభుత్వ, సొంత భూముల్లో సైతం మట్టి క్వారీయింగ్ జరపాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. ఫలానా భూమిలో క్వారీయింగ్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తొలుత రెవెన్యూ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మైనింగ్‌శాఖ నిబంధనల ప్రకారం ట్రక్కుకు రూ.50 చొప్పున చెల్లించి క్వారీయింగ్ నిర్వహించుకోవాలి. కొందరు వ్యాపారులు ఎకరాకు అనుమతులు పొంది దానిని అడ్డుపెట్టుకొని 10, 15 ఎకరాల వరకు క్వారీయింగ్ నిర్వహించడమే కాకుండా ఒక్కో బిల్లుపై కనీసం 50 నుంచి 100 ట్రక్కుల మట్టిని తరలిస్తున్నారు. ఇక్కడి ఎర్రమట్టిని నర్సరీలు, ఇళ్లల్లో మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగిస్తుండటంతో గిరాకీ పెరిగింది. ట్రక్కు ఎర్రమట్టి రూ.1800 పలుకుతుండగా టిప్పర్‌లారీ మట్టి రూ.3000కుపైగా అమ్మకాలు జరుపుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
మట్టి క్వారీయింగ్ చేయాలంటే రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌వోసీ పొందాలి. మైనింగ్ అధికారులకు సీనరేజ్ చెల్లించి ట్రక్కులకు ట్రిప్‌సీట్లు పొందాల్సి ఉంటుంది. ఒక్కో ట్రిప్ షీట్‌ను ఒక ట్రక్కు మట్టి రవాణా చేసేందుకు మాత్రమే వినియోగించాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్వారీయింగ్ జరిపే పొక్లయిన్, ట్రాక్టర్‌లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.
- ఎం.శ్రీనివాసరావు, నరసరావుపేట ఆర్డీవో
Advertisement
Advertisement