జైపూర్: బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో, ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్, అతడి సహాయకుడు 2022లో ఫారెస్ట్ అధికారి రవి కుమార్ మీనాపై దాడి చేశారు. రాజావత్ తన మద్దతుదారులతో కలిసి డీసీఎఫ్ ఆఫీసులోకి వెళ్లి సదరు అధికారిని బెదిరింపులకు గురి చేసి... అనంతరం అధికారిపై చేయి చేసుకున్నారు. అయితే, ఓ పనికి సంబంధించి సదరు అధికారితో వాగ్వాదం తర్వాత ఆగ్రహానికి లోనైనా రజావత్.. దాడి చేశారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు అతని సహాయకుడు మహావీర్ సుమన్ కూడా ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాతో వైరల్ అయ్యాయి.
అయితే, ఈ ఘటనపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) రవికుమార్ మీనా ఫిర్యాదు మేరకు రజావత్, సుమన్‌లపై 2022 మార్చి 31న ఐపీసీ సెక్షన్లు 332, 353, 34, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నయాపురా పోలీస్ స్టేషన్ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్బంగా తాజాగా రజావత్, సుమన్‌లకు ప్రత్యేక కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. సెక్షన్ 353 (ప్రభుత్వ అధికారి తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) సహా పలు సెక్షన్ల కింద కోర్టు వారిద్దరిని దోషులుగా నిర్ధారించారు. ఇదే సమయంలో దోషులకు ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించింది.
దోషిగా తేలిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రజావత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై హైకోర్టులో అప్పీలు చేస్తాను. కోటలోని లాడ్‌పురా మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్-3 కింద అభియోగాల నుంచి విముక్తి పొందారని చెప్పుకొచ్చారు. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో రజావత్, సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment