‘బాబు’ల కనుసన్నల్లోనే.. బాక్సైట్‌ మాఫియా | Bauxite Mining Mafia under the hands of TDP Leaders | Sakshi
Sakshi News home page

‘బాబు’ల కనుసన్నల్లోనే.. బాక్సైట్‌ మాఫియా

Published Thu, Dec 6 2018 4:34 AM | Last Updated on Thu, Dec 6 2018 5:12 AM

Bauxite Mining Mafia under the hands of TDP Leaders - Sakshi

విశాఖ జిల్లా నాతవరం మండలంలో బాక్సైట్‌ను తరలిస్తున్న ఆండ్రూ వాహనం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తూర్పు కనుమలుగా పరిగణించే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొండల్లో వందల కోట్ల టన్నులకుపైగా విలువైన బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వ రంగ సంస్థలకే తప్ప ప్రైవేట్‌ వ్యక్తులకు అనుమతులివ్వడానికి వీల్లేదు. ఖనిజంలో అల్యూమినియం 40 శాతం లోపు ఉంటే లేటరైట్‌గా, అంతకు మించి ఉంటే బాక్సైట్‌గానూ పరిగణిస్తారు. లేటరైట్‌ను సిమెంటు తయారీకి, బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి వినియోగిస్తారు. 2014కి ముందు విశాఖలో తవ్వకాలకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇవ్వలేదు. బాక్సైట్‌ తవ్వకాలకే కాదు లేటరైట్‌ తవ్వకాలకూ నాటి ప్రభుత్వాలు అంగీకరించలేదు.

2014లో టీడీపీ సర్కారు కొలువుదీరిన వెంటనే ఖనిజాసురులకు రెక్కలు వచ్చేశాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే కుమారుడు, తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చెందిన నాయకుడు, విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు, మరో మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కలసి ఓ ముఠాగా తయారై తమ బినామీలతో మైనింగ్‌ కోసం దరఖాస్తు చేయించారు. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ సుందరకోట గ్రామంలో అల్యూమినియం 40 శాతం లోపే ఉందని, అందువల్ల తమకు లేటరైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలంటూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సింగం భవానీతో  మైనింగ్‌ శాఖకు దరఖాస్తు చేయించారు. 2010లో ఆమె దరఖాస్తును తిరస్కరించిన మైనింగ్‌ శాఖ 2014లో మాత్రం సుందరకోటలో 4.97 హెక్టార్లలో 20 ఏళ్ల పాటు తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. 

మంత్రి అనుచరులకు లీజులు
ఇదే క్రమంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పిట్టాచలం గ్రామస్తుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు కిల్లో లోవరాజుకు 2015లో తొరడ గ్రామంలో 20 ఏళ్ల పాటు లేటరైట్‌ తవ్వకాలకు లీజు అనుమతులిచ్చారు. బమిడికలొద్దు గ్రామంలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో లేటరైట్‌ తవ్వకాలకు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు జర్తా లక్ష్మణరావుకు కూడా లీజు అనుమతిలిచ్చారు. 

లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలు..
విశాఖ మన్యంలోనూ కొన్నాళ్లుగా తవ్వకాలు సాగిస్తున్నారు. చింతపల్లి మండంలం రాజుపాకలు, గూడెంకొత్త వీధిలో జడుమూరు. చాపరాతి పాలెం, రంపుల వద్ద కొండలు తొలిచేస్తున్నారు. భూ కుంభకోణాల్లో ప్రధానంగా పేరు వినిపించిన ఓ మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు, అతడి సన్నిహితులు కలిసి కొన్నేళ్లుగా మన్యంలోని కొండల్లో మైనింగ్‌ చేస్తున్నారు. వీరంతా లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వకాలు చేస్తున్నారనే విషయాన్ని గనుల శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

అవి బాక్సైట్‌ నిల్వలేనన్న గనులశాఖ
విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడులో ఉన్న నిక్షేపాలు లేటరైట్‌ గనులు కావని అవి బాక్సైట్‌ నిల్వలేనని గనుల శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ లభ్యమయ్యే ఖనిజంలో 44 శాతానికి పైగా బాక్సైట్‌ ఉన్నట్టు తేల్చింది. కానీ గత నాలుగున్నరేళ్లుగా లేటరైట్‌ పేరిటే బాక్సైట్‌ తవ్వకాలు చేస్తున్నారు. ఇలా వీరందరికీ తవ్వుకునేందుకు లీజులు ఇప్పించిన సర్కారు పెద్దలు ఓ కచ్చితమైన నిబంధన విధించారు. ఎవరు ఎక్కడ ఎంత తవ్వుకున్నా చివరకు మెటీరియల్‌ మాత్రం ‘ఆండ్రు మినరల్స్‌’కే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రి లోకేష్‌ దగ్గరుండి మరీ ఈ పంచాయితీ చేసినట్టు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మైనింగ్‌ వ్యాపారవేత్త వెల్లడించారు.

ఆండ్రూ దోచిందెంత..?
మార్కెట్‌లో టన్ను లేటరైట్‌ రూ.850 దాకా ఉండగా బాక్సైట్‌ రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర పలుకుతోంది. అంటే లేటరైట్‌ కంటే బాక్సైట్‌తోనే రెట్టింపు ఆదాయం లభిస్తోందని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో మైనింగ్‌ శాఖ అనుమతించిన ప్రాంతాల్లో తవ్విన మొత్తం సుమారు 2 కోట్ల టన్నులకుపైనే ఉంటుందని అంచనా. ఆండ్రు మినరల్స్‌ గత నాలుగున్నరేళ్లలో నెలకు సగటున 4 లక్షల టన్నుల బాక్సైట్‌ను కొనుగోలు చేసి అల్యూమినియం కర్మాగారాలకు విక్రయిస్తోందని ఓ మైనింగ్‌ వ్యాపారి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. అంటే సగటున ఏడాదికి 48 లక్షలు... నాలుగున్నరేళ్లలో సుమారు 2 కోట్ల టన్నులకుపైనే క్రయవిక్రయాలు చేసిందని అంచనా.

ఈ లెక్కన రూ.3,000 కోట్లకుపైగా టర్నోవర్‌ చేసి ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇందులో సింహభాగం వాటా ముఖ్యనేత, అధికార పార్టీ ముఖ్యులకు ఉండటంతో ఈ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. ఆండ్రు మినరల్స్‌ లేటరైట్‌ పేరిట టన్నుకు రూ.200 రాయల్టీ, రూ.37 పన్ను, 5 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లిస్తూ రెట్టింపు విలువైన బాక్సైట్‌ను తరలిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా బడా‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం ఆండ్రూ రమేష్‌బాబు భరించేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అందువల్లే మన్యం సహా తూర్పు కనుమల్లో బాక్సైట్‌ నిక్షేపాలను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొంటున్నారు.

ఎవరీ ‘ఆండ్రూ’..?
తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ఆండ్రు రమేష్‌బాబు తొలుత పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో స్టోన్‌క్రషర్‌గా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తూర్పు గోదావరి జిల్లాలోని మహేశ్వరి మినరల్స్‌ సంబంధీకులతో తొలుత సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత వారితో విభేదించాడు. అనంతరం  మైనింగ్‌ రంగంలోకి దిగిన  రమేష్‌బాబు తన సోదరుడు ఆండ్రు శ్రీనివాస్‌ అలియాస్‌ బాబీతో కలిసి ఆండ్రూ మినరల్స్‌ స్థాపించి స్వల్ప కాలంలోనే మైనింగ్‌ మాఫియాగా అవతరించాడు. తూర్పు గోదావరి జిల్లా వంతాడ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని ఏలేశ్వరంలో గనులు లీజుకు తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టిన రమేష్‌బాబు 2014 తర్వాత ఈ నాలుగున్నరేళ్లలోనే తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్న బాక్సైట్‌ కొండలపై గుత్తాధిపత్యం సాధించాడు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎవరు, ఎక్కడ మైనింగ్‌ చేసినా రమేష్‌బాబుకే విక్రయించాలని మంత్రి లోకేష్‌ దగ్గరుండి పంచాయితీ చేశారు. ఆండ్రూ మినరల్స్‌కు అమ్మాలని షరతు విధించడంతోపాటు గనులశాఖ ఆంక్షలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వుకోవచ్చని అడ్డగోలుగా అనుమతులిచ్చేశారు. దీంతో ఎవరు ఎక్కడ తవ్వకాలు చేపట్టినా మెటీరియల్‌ మాత్రం ఆండ్రు మినరల్స్‌కే విక్రయిస్తూ వస్తున్నారు.

పచ్చని తూర్పు కనుమల్లో అధికారం అండతో మైనింగ్‌ మాఫియా గాండ్రిస్తోంది! టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా లేటరైట్‌ ముసుగులో ఇక్కడ సాగిస్తున్న ఖనిజ దోపిడీ, విచ్చలవిడి అమ్మకాలు చూస్తే ఇదంతా బడా‘బాబు’ల డైరెక్షన్‌లో సాధ్యమనే సంగతి బోధపడుతోంది. గిరిజనులను బినామీలుగా చేసుకుని.. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వి పోస్తూ.. గోరంత అనుమతులతో కొండలకు కొండలు కరిగించేసి కోట్లు కొల్లగొడుతున్న అధికార పార్టీ నేతలు, మంత్రుల కుమారులు ఇక్కడ తవ్విన ఖనిజాన్ని కేవలం ఒక్కడికే కట్టబెట్టాలి. ఆ ఒక్కడే అన్నీ కొనుగోలు చేసి సిమెంట్‌ ఫ్యాక్టరీలు, స్టీల్‌ ఫ్యాక్టరీలకు విక్రయించుకుని భారీగా వెనకేసుకుంటున్నాడు. ఆ ఒక్కడికే గుత్తాధిపత్యం కట్టబెట్టినందుకు పెద్ద‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఖర్చును భరించేలా ఒప్పందం కుదిరింది. ఇంతకీ ఆ ఒక్కడు ఎవరు..? అతడి గుత్తాధిపత్యం గుట్టు ఏమిటి? అనే  తెలియాలంటే  పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే.

ఆయనకే ఎందుకు అమ్ముతున్నారో తెలియదు
‘విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతి పరిధిలోని గ్రామాల్లో మైనింగ్‌ చేస్తున్న ఖనిజాన్ని లీజుదారులందరూ ఆండ్రూ మినరల్స్‌కే విక్రయిస్తున్నారనే విషయం నాకూ తెలిసింది. వాస్తవానికి లీజుల వరకే మా ప్రమేయం ఉంటుంది. మైనింగ్‌ తర్వాత మెటీరియల్‌ ఎవరికి అమ్ముకుంటారో మాకు సంబంధం లేదు. గతంలో కొన్ని ఫ్యాక్టరీలకు నేరుగా విక్రయించారు. కానీ ఇప్పుడు ఆండ్రుకే అమ్ముతున్న విషయం వాస్తవమే. అది ఎందుకో మాకు తెలియదు. మాకు ఆ అవసరం లేదు కూడా.’
– శివాజీ, మైనింగ్‌ శాఖ సహాయ సంచాలకులు(ఏడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement