నాతవరం మండలంలో విజయ్ తన అనుచరులతో కలిసి అక్రమంగా లేటరైట్ ఖనిజం తవ్విన భూములు
దొంగే.. ‘దొంగ.. దొంగ’ అని అరిచినట్లుంది. గత ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానుసారం తవ్వకాలు సాగించి, వారికీ వాటాలు పంచి.. అమాయక గిరిజనం నోట్లో మట్టి కొట్టారు. ఇప్పుడా బాగోతం బట్టబయలు కావడంతో గురివింద గింజను తలపిస్తూ సరికొత్త డ్రామాకు తెరలేపారు.
సాక్షి, అమరావతి: బాక్సైట్ తవ్వకాలు అక్రమంగా జరిగిపోతున్నాయని ఆందోళన చేస్తున్న టీడీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే అసలైన మైనింగ్ డాన్ అని తేటతెల్లమైంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన కొడుకు చింతకాయల విజయ్.. విశాఖ మన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని అడ్డూ అదుపు లేకుండా ఖనిజ వనరుల్ని కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. అప్పటి అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని లేటరైట్ తవ్వకాలను యథేచ్చగా జరిపించారు. అయ్యన్న ముఠా మన్యంలో జరిపిన అక్రమ తవ్వకాల విలువ వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అయ్యన్న కుమారుడి అక్రమాల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు కూడా వాటాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
భూగర్భ గనుల శాఖ నిర్వహించిన విచారణలో ఈ అక్రమాలన్నీ బహిర్గతమయ్యాయి. వాటిని కప్పి పుచ్చేందుకు, అక్రమ ఆదాయానికి గండి పడిందనే అక్కసుతో ఎదురుదాడి మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. విచారణలో వాళ్ల అక్రమాలన్నీ బయట పడడంతోపాటు మైనింగ్ దోపిడీపై అయ్యన్న గ్యాంగ్‌పై కోట్ల రూపాయల జరిమానా పడింది. ఆ లీజులు రద్దయ్యాయి. అందుకే తమకు అంటిన బురదను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటించాలనే దుర్బుద్ధితో తాజాగా లేని బాక్సైట్‌ను తవ్వేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో ఉన్న ఏడు లేటరైట్ లీజులు చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. అందులో మూడు చింతకాయల విజయ్‌వే.
అమాయక గిరిజనులకు లేటరైట్ లీజులు
వాళ్లు అమాయక గిరిజనులు. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేనివాళ్లు. అలాంటి ముగ్గురికి వేల కోట్ల రూపాయల విలువైన లేటరైట్ లీజులు వచ్చాయి. కాయకష్టంతో కడుపు నింపుకునే వాళ్లకు అంత విలువైన లీజులు ఎలా వచ్చాయి? చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన మాయ అది. ఇప్పుడు నీతులు చెబుతున్న చింతకాయల అయ్యన్న పాత్రుడి ముఠా లీల అది. ఆ మూడు లీజులు చింతకాయల విజయ్‌వే. ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ లీజులు గిరిజనులకే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అమాయక గిరిజనుల పేరుతో మూడు లేటరైట్ లీజులు తీసుకుని మన్యాన్ని కబళించేశారు విజయ్ అతని అనుయాయులు.
సర్వే చేయని కొండను సైతం..
విశాఖ జిల్లా నాతవరం మండలం సుందరకోట గ్రామంలో 4.97 హెక్టార్లలో లేటరైట్ తవ్వకానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే సింగం భవానీ పేరుతో మైనింగ్ లీజును తీసుకున్నారు. ఇది సర్వే చేయని కొండ ప్రాంతం. అక్కడ డీజీపీఎస్ సర్వే జరగలేదు. నిబంధనల ప్రకారం ఈ భూమికి మైనింగ్ లీజు ఇవ్వకూడదు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేసింది. మైనింగ్ ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమంగా లేటరైట్‌ను తవ్వారు. లీజు భూమిలో తవ్విన లేటరైట్‌ను బయట ప్రాంతాలకు రవాణా చేసేందుకు రిజర్వు ఫారెస్టులో అడ్డగోలుగా రెండు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు వేశారు. ఇందుకోసం గ్రావెల్, లేటరైట్, ఎర్రరాయిని తవ్వి వాడేశారు. అంతేకాకుండా లీజు పరిధిలోకి రాని భూముల్లో కూడా ఇష్టానుసారం మైనింగ్ చేసి 18,942 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను అమ్మేసుకున్నారు. మరోవైపు ఈ లీజు కింద ఇచ్చిన పర్మిట్లను తూర్పుగోదావరి జిల్లా వంతాడ మైనింగ్ లీజుకు చూపించి వినియోగించుకున్నారు. ఇక్కడ 4,09,542 మెట్రిక్ టన్నులకు పర్మిట్లు తీసుకున్నారు. కానీ తవ్వింది మాత్రం 2,81,488 మెట్రిక్ టన్నులే. మిగిలిన 1,28,054 మెట్రిక్ టన్నుల పర్మిట్లను వంతాడ మైనింగ్ లీజుకు చూపించి భారీగా డబ్బు దండుకున్నారు. వీటిపై ఆరోపణలు రావడంతో విచారణకు వెళుతున్న మైనింగ్ అధికారుల్ని అడ్డుకునేందుకు విజయ్ మనుషులు రోడ్డు తవ్వేశారు. అయినా అధికారులు విచారణ చేశారు. అవకతవకలు తేలడంతో రూ.9.34 కోట్ల జరిమానా విధించారు.
కొండను తవ్వి నాలుగు కిలోమీటర్లు రోడ్డు
నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని తోరాడ గ్రామంలో సర్వే నంబరు 532లో 68 ఎకరాలను గిరిజనుడైన కిలె లోవరాజుకు లేటరైట్ తవ్వకానికి తెలుగుదేశం హయాంలో 2017లో అనుమతి ఇచ్చారు. లోవరాజును మభ్యపెట్టి అతని పేరుతో విజయ్ ఈ లీజును తీసుకున్నట్లు విచారణలో తేలింది. అడ్డగోలుగా తవ్వడమే కాక.. తవ్వే ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా, సీనరేజి కట్టకుండా ఏకంగా రిజర్వు ఫారెస్టులో కొండను తవ్వి నాలుగు కిలోమీటర్ల రోడ్డును వేశారు. ఈ గనిలో 3,26,187 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను తవ్వారు. దాన్ని రవాణా చేయడం కోసం తీసుకున్న పర్మిట్లను తూర్పుగోదావరి జిల్లా వంతాడ మైనింగ్‌లో వినియోగించారు. తోరాడ లీజులో తవ్విన ఖనిజానికి సంబంధించిన పర్మిట్లను వంతాడలో వాడి, అక్కడా లేటరైట్‌ను తవ్వి అమ్మేసుకున్నారు. 50,169 మెట్రిక్ టన్నుల బిల్లుల్ని ఇలా వంతాడకు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక జరిపిన విచారణలో ఈ ఉల్లంఘనలు స్పష్టమవడంతో మైనింగ్ శాఖ రూ.8 కోట్ల జరిమానా విధించింది. ప్రస్తుతం తవ్వకాలు నిలిచిపోయాయి.
అల్లూరి గుహలు కనుమరుగయ్యేలా తవ్వకాలు
నాతవరం మండలం అసనగిరి గ్రామంలో సింగం భవానీ పేరు మీద 89 ఎకరాలకు మరో లేటరైట్ లీజు తీసుకున్నారు. ఈ లీజు ప్రాంతంలోనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తలదాచుకున్న ఎర్రమట్టి గుహలున్నాయి. స్థానిక గిరిజన దేవత గంగాలమ్మను పూజించే ప్రాంతం ఇది. గిరిజనులు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం ఈ లీజు ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ అనుయాయులు రంగంలోకి దిగి ఎర్రమట్టి గుహల వద్దకు వెళ్లేందుకు అడవిని నాశనం చేసి ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఇందుకోసం ఎర్రమట్టి, గ్రావెల్‌ను ఇష్టానుసారం వాడుకున్నారు. తవ్వకాలు జరుగుతున్న తీరు చూసి ఇది పూర్తయితే చారిత్రక ప్రదేశంగా ఉన్న సీతారామరాజు ఉన్న గుహలు కనుమరుగవుతాయని స్థానికులు ఆందోళన చెందారు. తమ దేవతను పూజించే ప్రాంతం ఉండదని తవ్వకాల్ని అడ్డుకున్నారు. ఈ లీజులోనూ అయ్యన్న కుమారుడి అక్రమాలు బయటపడడంతో దీని రద్దుకు మైనింగ్ అధికారులు సిఫారసు చేశారు. ప్రస్తుతం తవ్వకాలు నిలిచిపోయాయి. ఈ గనుల్లో తవ్విన లేటరైట్‌ను దొంగతనంగా ఒరిస్సాలోని వేదాంత కంపెనీకి అమ్ముకుని వందల కోట్లు గడించారు.
లోకేశ్‌కు వాటా!
ఈ అక్రమాల్లో చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్‌కు వాటా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్, చింతకాయల విజయ్ అత్యంత సన్నిహితులు. లోకేశ్ అండతోనే మన్యంలో విజయ్ చెలరేగిపోయారు. లోకేశ్ ప్రోద్బలంతోనే విజయ్.. విశాఖ మన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని కబళించారు. ఐదేళ్లపాటు లేటరైటే కాదు.. మన్యంలో కనిపించిన ప్రతి ఖనిజాన్ని అయ్యన్న ముఠా తవ్వేసి అమ్ముకుంది. ఎర్రరాయి, గ్రావెల్‌ను పెద్దఎత్తున తవ్వి సొమ్ము చేసుకుంది. వీళ్లు తవ్వి అమ్ముకున్న ఖనిజం విలువ వేల కోట్లకుపైనే ఉంటుందని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అయ్యన్న గ్యాంగ్ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడింది. మైనింగ్ విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. తవ్వకాలు నిలిచి పోవడంతో ఈ ముఠా ఆదాయానికి గండి పడింది. మరోవైపు కోట్ల రూపాయల జరిమానాలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అక్కసుతోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అయ్యన్న ముఠా ఎదురు దాడికి దిగింది. ప్రభుత్వంపై బురదజల్లడం మొదలు పెట్టింది. తాము చేసిన అక్రమాలు ఇప్పుడు జరుగుతున్నట్లు చిత్రీకరించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత విలువైన ఖనిజ వనరుల్ని మింగేసి ఇప్పుడు వాటి కోసం ఆందోళనల పేరుతో హడావుడి చేస్తుండడం చూసి గిరిపుత్రులు నవ్వుకుంటున్నారు. లేటరైట్‌ను దోచేసిన అయ్యన్నపాత్రుడు నిజ నిర్ధారణ పేరుతో మన్యంలోకి వెళ్లేందుకు హడావుడి చేయడం చూసి ఇంతకన్నా దారుణం ఏముంటుందని గిరిజనులు వాపోతున్నారు. తమను మోసం చేసిన వాళ్లే ఇప్పుడు తమను రక్షించడానికి వస్తున్నట్లు డ్రామాలాడడం మన్యంలో చర్చనీయాంశమైంది. నిజానికి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక లేటరైట్ లీజు కూడా మంజూరు చేయలేదు. ఉన్న ఏడు లీజులు చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. లేని బాక్సైట్‌ను తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నిజానికి ఆ లీజును ఇచ్చేందుకు అయ్యన్న మంత్రిగా ఉన్నప్పుడే అంగీకరించారు. ఇప్పుడు అదే తప్పు అని రోడ్డెక్కడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment