సాక్షి, అమరావతి: వచ్చే జులై ఒకటో తేదీ నుంచి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత ఇసుక ముసుగులో టీడీపీ నాయకులు ఐదేళ్లపాటు సాగించిన దోపిడీకి తక్షణమే అడ్డుకట్ట వేస్తున్నట్లు ప్రకటించింది. పారదర్శక ఇసుక విధానం తెస్తామని రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం నిర్ణయించిన మరుసటి రోజే ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో మంగళవారం ఆయన భూగర్భ గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ‘ప్రజలపై ఎలాంటి భారం పడకుండా సర్కారు రాబడి పెంచేలా కొత్త ఇసుక విధానాన్ని రూపొందించాలి. సర్కారుకు ఆదాయం రావాలేగానీ ఇసుక మాఫియా నేతలకు కాదు. ఇందుకు అనుగుణంగా విధివిధానాలు తయారుచేసి సమర్పించండి. కొత్త పాలసీ రూపకల్పనకు ఎంత సమయం కావాలో చెప్పండి. అప్పటివరకూ ఇసుక తవ్వకాలు, రవాణా నిలిపేద్దాం. సర్కారు ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా ఇసుక తవ్వినా, రవాణా చేసినా వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడి) చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేయండి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుంది’.. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. 15 రోజుల్లో కొత్త ఇసుక విధానానికి సంబంధించి విధివిధానాలు సమర్పిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో అప్పటివరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు.
15 రోజులు ఓపిక పట్టండి : పెద్దిరెడ్డి
సచివాలయం 2వ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో గనుల శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై 15 రోజులపాటు నిషేధం విధించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం 15 రోజుల్లో నూతన మైనింగ్ పాలసీని తీసుకువస్తుందన్నారు. అప్పటివరకు ప్రజలు కొంచెం ఓపిక పట్టాలని కోరారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్, ఇసుక స్మగ్లింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆదాయంలో 20–25 శాతం భూగర్భ గనుల శాఖ ద్వారా సాధిస్తామని చెప్పారు. ‘భూగర్భ ఖనిజ శాఖలో అక్రమాలను అరికట్టి సర్కారు రాబడి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. నూతన పాలసీని రూపొందించే వరకు ఎక్కడా ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అవి జరిగితే జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే పీడీ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ పాలసీలను అధికారులు అధ్యయనం చేస్తున్నారని.. ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగకరమైన ఉత్తమ పాలసీని రూపొందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి ఐ. శ్రీనివాస శ్రీ నరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపైనా సమీక్ష
మరోవైపు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతోనూ మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. రెండు శాఖల కమిషనర్ కార్యాలయం, స్వచ్ఛ భారత్ (గ్రామీణ), పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాల వారీగా సమీక్షించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రికి ఆయా శాఖల స్వరూపం, శాఖల పరిధిలో పనుల పురోగతిని ఆయా విభాగాల అధిపతులు, అధికారులు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.
15 రోజుల్లో కొత్త ఇసుక పాలసీ
Published Wed, Jun 12 2019 3:58 AM | Last Updated on Wed, Jun 12 2019 8:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment