ఏపీలో ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌ | Sand booking from home itself with Sand new policy | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌

Published Mon, Jun 24 2019 3:52 AM | Last Updated on Mon, Jun 24 2019 8:39 AM

Sand booking from home itself with Sand new policy - Sakshi

ఇసుక కావాల్సిన వారు బుకింగ్‌ కోసం ఏపీఎండీసీ శాండ్‌ పోర్టల్‌ను క్లిక్‌ చేస్తే చాలు సమగ్ర వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ఏయే స్టాక్‌ యార్డుల్లో ఎంతెంత ఇసుక నిల్వ ఉందో కూడా అందులో కనిపిస్తుంది. సమీప ప్రాంతంలోని స్టాక్‌ యార్డు నుంచి ఇసుక సరఫరా కోసం బుక్‌ చేసుకోవచ్చు. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక కోసం ఇక మాఫియా గ్యాంగులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంత ధర ఉంది? ఇక్కడ ఎంత రేటు ఉంది? అని వాకబు చేయాల్సిన అవసరమూ లేదు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఇకపై ఇసుకను సరసమైన ధరలకు అందించనుంది. రాష్ట్రంలో ఎక్కడకు ఇసుక కావాలన్నా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు నేరుగా కోరిన ప్రాంతానికే సరఫరా చేసే ఏర్పాట్లను ఈ సంస్థ చేస్తుంది. ఏపీఎండీసీ శాండ్‌ పోర్టల్‌లోకి వెళ్లి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఇసుకను బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఇసుక సరఫరాకు కొత్త విధాన ముసాయిదా (పాలసీ) రూపొందించింది. గత అయిదేళ్లుగా టీడీపీ నాయకులు సాగిస్తున్న ఇసుక మాఫియాకు చెక్‌ పెట్టడం, ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రభుత్వ రాబడి పెంచడం లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు పాత పాలసీని రద్దుచేసి కొత్త పాలసీ రూపొందించింది. ప్రజలకు పారదర్శక సుపరిపాలనే అజెండాగా పెట్టుకున్న కొత్త ప్రభుత్వం ఇసుక రేవులను ప్రయివేటు వ్యక్తుల కబంధ హస్తాల నుంచి తప్పించి ప్రభుత్వ అధీనంలో ఉంచాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్‌ ఇసుక విధానం (ముసాయిదా)– 2019ను రూపొందించింది. దీనిని ముఖ్యమంత్రి పరిశీలనకు పంపించి ఆమోదం పొందనున్నారు. అనంతరం కేబినెట్‌ ఆమోదంతో జీఓ జారీ చేయడం ద్వారా కొత్త విధానం అమల్లోకి వస్తుంది.  

చిన్న చిన్న నదుల్లో ఉచితమే
చిన్న చిన్న నదులు, వాగుల్లో ఇసుకను ప్రజలు సొంత అవసరాల కోసం ఉచితంగా తీసుకెళ్లవచ్చు. చిన్న చిన్న నదులు (వన్‌ టు థర్డ్‌ ఆర్డర్‌ రివర్‌ స్ట్రీమ్స్‌) జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణలోనే ఉంటాయి. వీటి నుంచి స్థానిక ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పనులకు కూడా వీటి నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు. పేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. చిన్న తరహా ప్రభుత్వ పనులకు సీనరేజి ఫీజు చెల్లించి వీటి నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చు. వీటిలో ఇసుక తవ్వకం, లోడింగ్‌కు యంత్రాలను వినియోగించరాదు. మండల పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు మాత్రమే వీటి నుంచి ఇసుకను తీసుకెళ్లవచ్చు. మండలం దాటి ఇసుకను ఈ చిన్న నదుల నుంచి తీసుకెళ్లకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది.

పెద్ద నదులన్నీ ఏపీఎండీసీకే
కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, వంశధార లాంటి పెద్ద నదుల్లో (4, 5, అంతకంటే ఎక్కువ స్థాయి రివర్‌ స్ట్రీమ్స్‌లో) ఇసుక తవ్వకాలు జరిపి ప్రజలకు సరసమైన ధరకు విక్రయించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఎండీసీకి అప్పగిస్తుంది. ఇసుక తవ్వకాలు జరపడానికి చట్టబద్ధమైన, పర్యావరణ, ఇతర అనుమతులన్నీ జిల్లా కలెక్టర్లే తీసుకుంటారు. ఏపీఎండీసీ నోడల్‌ ఏజెన్సీగా ఉంటూ ప్రజలకు అవసరమైన ఇసుకను అందించే ఏర్పాట్లు చేస్తుంది. రేవుల నుంచి ఇసుకను తవ్వి ప్రజలకు (వినియోగదారులకు) అందించడానికి వీలుగా ఏపీఎండీసీతో ఆయా జిల్లా కలెక్టర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నదుల్లో తవ్విన ఇసుకను  సమీపంలో స్టాక్‌ యార్డుల్లో ఏపీఎండీసీ నిల్వ చేస్తుంది.

రాష్ట్రంలో 395పైగా పెద్ద పెద్ద ఇసుక రేవులు ఉన్నాయి. అయితే వీటిలో ప్రస్తుతానికి వందలోపు రీచ్‌లకు మాత్రమే పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి కూడా ఆయా జిల్లా కలెక్టర్లు పర్యావరణ, మైనింగ్‌ ప్లాన్, రీచ్‌ ఏర్పాటు, నిర్వహణ తదితర అనుమతులు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులు ఉన్న క్వారీల సమీపంలో ఏపీఎండీసీ ఇసుక స్టాక్‌ యార్డులు (నిల్వ కేంద్రాలు) ఏర్పాటు చేస్తుంది. క్వారీల్లో ఇసుక తవ్వకాలు సాగించి స్టాక్‌ యార్డులకు వాహనాల్లో తరలించేందుకు కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ఏపీఎండీసీ టెండర్లు పిలుస్తుంది. ఎలాంటి అక్రమాలకు, ఆశ్రిత పక్షపాతానికి వీలు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా రివర్స్‌ టెండరింగ్‌ విధానం అవలంబిస్తుంది. స్టాక్‌ యార్డుల నుంచి ప్రజలకు ఇసుకను అందించనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇలాంటి విధానమే అమల్లో ఉంది. అక్కడ ప్రస్తుతం టన్ను ఇసుక రూ.400 చొప్పున అమ్ముతున్నారు. ఇసుక తవ్వకం, లోడింగ్‌ తదితరాలకు అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కూడా ఇదే ధరను పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. (ప్రభుత్వ తుది నిర్ణయం ప్రకారం ధర మారవచ్చు.)

వెబ్‌సైట్‌ క్లిక్‌ చేస్తే...
ఇసుక కావాల్సిన వారు బుకింగ్‌ కోసం ఏపీఎండీసీ శాండ్‌ పోర్టల్‌ను క్లిక్‌ చేస్తే చాలు సమగ్ర వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ఏయే స్టాక్‌ యార్డుల్లో ఎంతెంత ఇసుక నిల్వ ఉందో కూడా అందులో కనిపిస్తుంది. సమీప ప్రాంతంలోని స్టాక్‌ యార్డు నుంచి ఇసుక సరఫరా కోసం బుక్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా నందిగామ వాసులు ఇసుక కావాలంటే నందిగామ స్టాక్‌ యార్డు నుంచి బుక్‌ చేసుకోవచ్చు. దీనివల్ల రవాణా వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. డీజిల్‌ ధర, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కిలోమీటరుకు ఇంతని ఏపీఎండీసీ అధికారులే ఇసుక రవాణాకు రేటు నిర్ణయిస్తారు. ఈ ధరతో ఇసుక రవాణా చేసే వాహనాల వారందరికీ ఏపీఎండీసీ ఇసుక సరఫరా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.

ఏ రీచ్‌ నుంచి ఇసుక కావాలో క్లిక్‌ చేయగానే ధర వస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌ కార్డు, ఇతర విధానాల ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు చెల్లించగానే వారికి ఇసుక బుకింగ్‌ అయినట్లు రిసీప్ట్‌ వస్తుంది. ఏపీఎండీసీలో శాండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అని క్లిక్‌ చేస్తే ఎక్కడెక్కడ వాహనాలు ఉన్నాయో (యాప్‌ ద్వారా ఓలా కార్లు /ఆటోలు బుక్‌ చేసుకుంటే కనిపించినట్లుగా) కనిపిస్తాయి. సమీపంలోని వాహనాన్ని బుక్‌ చేసుకుంటే చాలు కోరిన ప్రాంతానికి ఇసుకను తీసుకొస్తుంది. ఇసుక కోసం ఆన్‌లైన్‌లో చెల్లించిన మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. క్వారీ నుంచి ఇసుకను స్టాక్‌ యార్డుకు చేర్చడం లాంటి పనులకు అయిన మొత్తంతోపాటు కొంత సొమ్మును నిర్వహణ ఖర్చుల కింద యూజర్‌ ఏజెన్సీ అయిన ఏపీఎండీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తుంది.  

సాగునీటి ప్రాజెక్టుల పనులకు డీసిల్టేషన్‌ ఇసుక
నీటి పారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీల్లో వరద నీటితోపాటు ఇసుక వచ్చి పేరుకుంటుంది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. అందువల్ల వీటిలో డీసిల్టేషన్‌ ద్వారా ఇసుక వెలికి తీయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచాల్సి ఉంటుంది. జల వనరుల శాఖ ఇలా వెలికి తీసిన ఇసుకను సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగించుకోవాలి. జల వనరుల శాఖ డీసిల్టేషన్‌ ద్వారా ఇసుకను తవ్వడానికి అవసరమైన అనుమతులతో పాటు ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇసుక తోడినందుకు సీనరేజి చార్జీలతోపాటు ఇతరత్రా పన్నులను గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక తరలింపునకు కూడా ట్రాన్సిట్‌ పాసులను భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకుల నుంచి పొందాలి. ఒకవేళ రిజర్వాయర్లలో పేరుకున్న ఇసుకను తోడే బాధ్యతను జల వనరుల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తే వారు తవ్వించిన ఇసుకను ఏపీఎండీసీకి అప్పగించాలి. డీసిల్టేషన్‌కు అయిన మొత్తాన్ని ఏపీఎండీసీ చెల్లిస్తుంది. ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. 

పట్టా భూముల్లో ఇలా..
నదీ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన పట్టా భూముల్లో ఒక్కోసారి ఇసుక మేటలు వేస్తుంది. వరదల సమయంలో ఇలా పట్టా భూములు ఇసుక రేవుల్లా మారతాయి. ఇలాంటి భూముల్లో ఇసుకను తవ్వి విక్రయించడానికి రైతులతో ఏపీఎండీసీ ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇలా తవ్విన ఇసుక అమ్మగా వచ్చిన మొత్తంలో 10 శాతాన్ని భూ యజమానులైన రైతులకు ఇస్తారు. ఒకవేళ రైతులే నేరుగా తమ భూముల్లో ఇసుక తవ్వుకుంటామని కోరితే అనుమతిస్తారు. ఏపీఎండీసీ నిర్ణయించిన కనీస ధరతోపాటు వారు విక్రయించే అదనపు ధరలో 5 శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 

గిరిజన ప్రాంతాల్లో సొసైటీలకే అధికారం
గిరిజన ప్రాంతాల్లోని ఇసుక తరలింపు కోసం పంచాయతీ రాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ (పీసా) చట్టం కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇసుకపై గిరిజనులకే హక్కు ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇసుక తరలింపు బాధ్యతను గిరిజన సొసైటీలకే అప్పగిస్తారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని సొసైటీలకు ఇసుక తవ్వకాలు, తరలింపునకు అవసరమైన సాంకేతిక సçహకారాన్ని మాత్రం ఏపీఎండీసీ అందిస్తుంది. ఇందుకు సంబంధించి సమయానుకూలంగా నియమ నిబంధనలను జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారు. 

కృత్రిమ ఇసుక తయారీకి ప్రోత్సాహం
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నదుల ఇసుక ఉత్పత్తి పెరగడం లేదు. అందువల్ల భవిష్యత్తులో సహజ సిద్ధమైన ఇసుక కొరత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. అందువల్ల నదీ ఇసుకకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ (రోబో) శాండ్‌ తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృత్రిమ ఇసుకను మాన్యుప్యాక్చర్డ్‌ (ఎం) శాండ్‌ అంటారు. ఎం.శాండ్‌ను తయారు చేసే సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ సంస్థలు కనీసం 50 శాతం కృత్రిమ ఇసుకను కచ్చితంగా వినియోగించాలనే నిబంధన కూడా పెట్టనున్నారు. కృత్రిమ ఇసుక తయారీకి ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహకాలను ఇంకా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.  

సర్కారు ఆదాయం పెంపే లక్ష్యం
గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పేరుతో రవాణా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు శాండ్‌ మాఫియాకు తెరలేపారు. ముడుపులివ్వందే ఎవరినీ ఇసుక రేవుల్లోకి రానీయలేదు. వారు చెప్పిన మొత్తం ఇస్తేనే ఇసుక సరఫరా చేస్తూ వచ్చారు. ఇలా వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఇసుకను సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ రాబడిని పెంచడం లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ సర్కారు కొత్త విధాన ముసాయిదా రూపొందించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement