విజయవాడలో కాల్‌నాగులు మళ్లీ చెలరేగిపోయారు. అందరూ సద్దుమణిగిందనుకున్న ఈ దందా నగరంలో చాపకింద నీరులా వ్యాపిస్తుందనే విషయం బుధవారం చోటుచేసుకున్న ఘటనతో రుజువైంది. ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు నగరాన్ని చెరిసగం చొప్పున పంచేసుకుని మరీ కాల్‌మనీ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. 15 శాతం నుంచి 25 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పుల వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. లేదంటే ఆస్తులు గుంజుకుంటున్నారు. బాధితులు ప్రశ్నిస్తే దాడులకు సైతం తెగబడుతున్నారు. ఆస్తులు కోల్పోయిన వారు గగ్గోలు పెడుతున్నా ఆలకించే నాథుడే కరువయ్యాడు.
సాక్షి, అమరావతిబ్యూరో : కాల్‌మనీ వ్యాపారంలో విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు సూత్రధారులు... వారిద్దరి అనుచరగణం పాత్రధారులుగా ఉన్నారు. దాదాపు రూ.100 కోట్ల మేర టర్నోవర్ చేస్తున్నారు. కాల్‌మనీ దందా మళ్లీ జూలు విదిలిస్తోంది. వేధింపులతో పసుపులేటి పద్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించడంతో మరోసారి ఈ దందా ఆగడాలు బహిర్గతమయ్యాయి. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల్లో ఒకరు ఒకప్పుడు ఇంద్రకీలాద్రి మీద చిన్న షాపు నిర్వహించేవారు. సినిమా టిక్కెట్ల బ్లాక్ దందా నుంచి ఆయన చేయని పనంటూ లేదు. టీడీపీ అండతో అలా అక్రమ వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ప్రజాప్రతినిధి అయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అక్రమాల విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. అందులో ప్రధానమైనదే కాల్‌మనీ రాకెట్.
ఆ ప్రజాప్రతినిధి ఏకంగా 60 మంది వరకు అనుచరులను పెట్టుకుని ఈ రాకెట్‌ను విస్తరించారు. నగరంలోని మల్లికార్జునపేట, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కాళేశ్వరమార్కెట్‌తోపాటు వన్‌టౌన్ అంతటా వేళ్లుకున్నారు. చిరువ్యాపారులు, గృహిణులు, మధ్యతరగతి వర్గీయుల ఆర్థిక అవసరాలను అవకాశంగా మలచుకుని అత్యధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. అనంతరం వడ్డీలు, చక్రవడ్డీలతో సహా వసూళ్ల పేరుతో వేధిస్తున్నారు. అప్పు వసూళ్ల పేరుతో దుకాణాలు, ఇళ్లు, ఇతర ఆస్తులను గుంజుకోవడం పరిపాటిగా మారింది. ఆ ప్రజాప్రతినిధి దాదాపు రూ.50 కోట్లకు పైగా కాల్‌మనీ టర్నోవర్ సాగిస్తున్నట్లు అంచనా. జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, ఇతరులకు అవసరమైతే క్షణాల్లో కోట్లు సమకూర్చిపెట్టగలరని పేరుపొందారు. మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందారు.
‘సెంట్రల్’ దందా ఈయనదే
కాల్‌మనీ రాకెట్ సూత్రధారి అయిన మరో ప్రజాప్రతినిధి అంటేనే విజయవాడ హడలెత్తిపోతోంది. అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆయన 2014 నుంచి కబ్జాలు, దాడులతో నగరాన్ని హడలెత్తిస్తున్నారు. ఆయన పకడ్బంధీగా కాల్‌మనీ దందాను సాగిస్తున్నారు. బీసెంట్ రోడ్డు నుంచి అజిత్‌సింగ్‌నగర్ వరకు వాణిజ్య ప్రధాన కేంద్రాన్ని ఆయన గుప్పిట పట్టారు. ఆయన అనుచరులతో పది వరకు బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరీ కాల్‌మనీ రాకెట్ నిర్వహిస్తున్నారు. ఆయన కూడా దాదాపు రూ.50 కోట్ల మేర టర్నోవర్ సాగిస్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిమరీ కాల్‌మనీ రాకెట్ అరాచకాలు సాగిస్తున్నారు. తాము చెప్పినంత వడ్డీలు చెల్లించలేకపోయినవారిని ఆ కార్యాలయానికి పిలిపించి మరీ దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. బాధితుల షాపులు, ఆస్తులు తమ పేరిట రాయించుకున్నారు.
రాజకీయ ఒత్తిడికి పోలీసులు...
రాజధానిలో కాల్‌మనీ దందా ఇంత నియంతృత్వం ప్రదర్శిస్తున్నా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది. విజయవాడలో 2015లో కాల్‌మనీ రాకెట్ మొదటి సారి బయటపడినప్పుడు పోలీసు యంత్రాంగం కొంత హడావుడి చేసింది. కాల్‌మనీ కేసుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. కానీ తరువాత ఆ సెల్ క్రియాశీలంగా వ్యవహరించలేకపోయింది. మళ్లీ రెండేళ్లుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న కాల్‌మనీ దందాకు అడ్డుకట్ట వేయడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందింది. ప్రధానంగా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులే ఈ దందాకు సూత్రధారులు కావడం పోలీసులు చోద్యం చూస్తుండిపోతున్నారు. పలువురు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటిని పోలీస్‌స్టేషన్‌స్థాయిలోనే అధికార పార్టీనేతలకు అనుకూలంగా సెటిల్‌మెంట్లు చేసేస్తూ కప్పిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో టీడీపీ నేతల కాల్‌మనీ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఆ ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు కోట్లు కొల్లగొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment