సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం పక్కాగా తయారుచేసిన టీడీపీ
బూతులు, మార్ఫింగ్ ఫొటోలతో వేధించడంలో దిట్ట.. ఇంటి పట్టా
వచ్చిందని ఆనందం పంచుకున్న గీతాంజలిని ట్రోల్ చేసి చంపేశారు!
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బెండపూడి బాలికలను అవమానించారు
తెనాలికి చెందిన గీతాంజలి అనే గృహిణి తనకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా వచ్చిందని, తన సొంతింటి కల నెరవేరుతోందని ఆనందంగా చెప్పడాన్ని టీడీపీ సోషల్ మీడియా జీర్జించుకోలేకపోయింది. గీతాంజలిని సోషల్ మీడియాలో తీవ్రంగా వేధించింది. అత్యంత దారుణంగా బూతులు తిడుతూ పోస్టులు పెట్టింది. వాటిని భరించలేక, భయపడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి ఇద్దరు ఆడపిల్లలు తల్లిప్రేమకు దూరమయ్యారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకుని ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడుతున్న బెండపూడి బాలికలపై కూడా టీడీపీ సోషల్ మీడియా బరితెగించి ట్రోల్ చేసింది. ఈ పిల్లల ప్రతిభను ఐక్య రాజ్యసమితి గుర్తించినా ఐ–టీడీపీ మాత్రం తీవ్రంగా వేధించింది. పేద పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా పోస్టులు పెట్టింది. వారు బయటకు వచ్చి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది.
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఐ–టీడీపీ అనే అతి పెద్ద బూతుల ఫ్యాక్టరీని టీడీపీ తయారు చేసింది. ఈ ఫ్యాక్టరీ బాలికలు, మహిళలు, విద్యావంతులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు... అనే తేడా లేకుండా టీడీపీకి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రతి ఒక్కరినీ బండబూతులతో చెండాడుతుంది. మార్ఫింగ్ ఫొటోలతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.
రాజకీయాలతో సంబంధం లేకపోయినా గత ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందని చెప్పిన వారిని బజారుకీడ్చి కుంగిపోయి, కుమిలిపోయి చివరికి ప్రాణాలు తీసుకునేంత వరకు వెంటాడి వేధిస్తుంది. సోషల్ మీడియాలో విష ప్రచారం... అంటూ నీతులు చెబుతున్న కూటమి ప్రభుత్వానికి ఈ ఫేక్ ఫ్యాక్టరీ అరాచకాలు మాత్రం కనిపించడం లేదు.
కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై మాత్రమే కత్తికట్టి కేసులతో వేధిస్తోంది. ‘నిజాయతీగా అయితే టీడీపీ సోషల్ మీడియాపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత నీచాతినీచమైనదని టీడీపీ సోషల్ మీడియా విభాగం’ అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫేక్ ప్రచారం వ్యవస్థీకృతం
ఐ–టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో తరచూ అభ్యంతరకర పదాలతో ట్వీట్లు చేస్తారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కొమ్మారెడ్డి పట్టాభి, ఆనం వెంకట రమణారెడ్డి వంటి నేతలతోపాటు ఐ–టీడీపీ, సీబీఎన్ ఆర్మీ తదితర విభాగాల సభ్యులు అడ్డూ అదుపూ లేకుండా తమకు నచ్చనివారిపైనా, తటస్థులపైనా బూతులతో విరుచుకుపడుతున్నారు.
కొందరు టీడీపీ తరఫున మారుపేర్లతో సోషల్ మీడియాలో చేసే అసభ్య ప్రచారం కనీవినీ ఎరుగనిది. ఫేక్ ప్రచారం విషయంలో ఐ–టీడీపీకి పేటెంట్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బూతులతో కలలో కూడా ఊహించలేని అపవాదులు, దుర్భాషలతో ప్రత్యర్థులను వెంటాడి వేటాడటంలో టీడీపీ సోషల్ మీడియాకు ఉన్న నైపుణ్యం, సామర్థ్యం మరెవరికీ ఉండదని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, విద్యావేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ పలుమార్లు అభిప్రాయపడ్డారు.
గత ఎన్నికలకు ముందు టీడీపీ సోషల్ మీడియా తనపై బూతులతో విరుచుకుపడటాన్ని తప్పుపడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో తన తల్లిని టీడీపీ సోషల్ మీడియా దూషించిందని చెప్పారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోగా టీడీపీ సోషల్ మీడియాను మరింత ప్రోత్సహించారు.
అందువల్లే వైఎస్ జగన్ దంపతులతోపాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, కడప ఎంపీ అవినాష్ వంటి అనేక మంది వైఎస్సార్‌సీపీ నేతలను నిత్యం అవమానించేలా, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు.
సోషల్ మీడియాలో టీడీపీ అరాచకదాడి సంగతేంటి?
సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు నీచాతినీచంగా పోస్టులు పెట్టడం లేదా? నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను.. వైఎస్సార్‌సీపీ వాళ్లమీద పోస్టులు పెట్టడం కాదు... మా లాంటి వాళ్లను కూడా బూతులు తిడుతున్నారు. మొన్న రాత్రి 10.32 గంటలకు ఒక టీడీపీ అభిమాని ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడు.
టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వికృతమైన, అరాచకమైన దాడి సంగతి ఏంటీ? దానికి ఆన్సర్ ఉండాలి కదా? నా అనుభవంలో అయితే నన్ను ఏ ఇతర రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఇంత బూతులు తిట్టలేదు. చంద్రబాబుపేటీఎం, నువ్వు కమ్యూనిస్టువు, కాంగ్రెసోనివి, నువ్వు బీఆర్‌ఎస్ వాడివి ఇట్లా రకరకాలుగా అన్నారు.
కానీ ఇలా బూతులు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు తిటినట్లు ఎవరూ తిట్టలేదు. నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. అత్యధికంగా తిట్టేది టీడీపీ వాళ్లే. తన వాళ్లను చంద్రబాబు కంట్రోల్ చేయడా?.– ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజకీయ పరిశీలకుడు, విశ్లేషకుడు, విద్యావేత్త, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment