call money business
-
బుసకొడుతున్న కాల్ నాగులు
కరోనా సమయం.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం.. చిరు జీతంపై ఆధారపడిన బడుగు జీవనం.. వేతనంలో కోత పడిన మధ్యతరగతి కుటుంబం.. లాక్డౌన్ వేళ పొట్టపోసుకునేందుకే కష్టపడుతున్న తరుణంలో అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. కాల్‌మనీ, ఫైనాన్స్, చిట్‌ఫండ్ కంపెనీల తాకిడికి బెంబేలెత్తుతున్నారు. కేంద్రప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సైతం లెక్క చేయకపోవడంతో బేజారవుతున్నారు. ప్రైవేటు వడ్డీవ్యాపారుల దందాకు ఆందోళన చెందుతున్నారు. కాళ్లావేళ్లా పడుతున్నా కనికరించకపోవడంతో పలువురు ఉసురుతీసుకుంటున్నారు. పలమనేరు: జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వడ్డీవ్యాపారులు, ఫైనాన్స్, చిట్‌ఫండ్ కంపెనీలు, అనధికార చీటీ నిర్వాహకులు, వెహికల్ ఫైనాన్స్ వాళ్లు దిగువ, మధ్యతరగతి ప్రజలను జలగల్లా పీడిస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులు లేక కుటుంబ పోషణకే అవస్థలు పడుతుంటే అప్పులు కట్టాల్సిందే అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాదంటే భయపెట్టి మరీ ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నారు. అవకాశముంటే ఖాళీ చెక్కులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకులు సైతం మారటోరియం అమలు చేస్తున్నా ప్రైవేట్ దందా మాత్రం యథేచ్ఛగా సాగిపోతోంది. మార్చి 24 లాక్‌డౌన్‌విధించినప్పటి నుంచి జిల్లాలో సుమారు 10మంది వరకు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రెండునెలల్లో ఎన్నో సాక్ష్యాలు ♦ శ్రీకాళహస్తికి చెందిన డోలు వాయిద్యకారుడు వెంకటరమణ అప్పులవాళ్ల వేధింపులు తాళలేక 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ పలమనేరు నియోజకవర్గంలో 3రోజుల క్రితం అప్పు కట్టలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ♦ తిరుపతిలో ప్రైవేటు ఉద్యోగి అయిన ఓ మహిళ రెండు నెలలుగా ఫైనాన్స్ చెల్లించలేదని ఆమె వాహనాన్ని లాకెళ్లారు. ఆమె తన భర్తతో కలసి సదరు ఫైనాన్స్‌కంపెనీకి వెళితే వారు అవమానించి పంపినట్లు తెలిసింది. ♦ పలమనేరు పట్టణంలోని పాతపేటలో చిన్న దుకాణం నడుపుకుంటున్న ఒక మహిళ జనవరిలో తమిళనాడు వ్యాపారుల నుంచి రూ.10వేల అప్పు తీసుకుంది. లాక్డౌన్ వరకు రోజూ ఫైనాన్స్ చెల్లించింది. ఆపై దుకాణం మూతపడడంతో కట్టలేకపోయింది, దీంతో ఆమెను బెదిరించి మరీ ప్రామిసరీ నోటు రాయించుకు వెళ్లినట్లు సమాచారం. ♦ పలమనేరు సాయినగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి రూ.లక్ష చీటీ పాడుకున్నాడు. ప్రస్తుతం నెల వాయిదా చెల్లించలేకపోవడంతో ఆయనపై దౌర్జన్యం చేసి మరీ చీటీ నిర్వాహకుడు ఇంటి స్థలం రాయించుకున్నాడు.ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నా అప్పు చేసిన పాపానికి అవమానాలు దిగమింగుకుంటున్నారేగాని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. అప్పు వసూలుకు వేధింపులు జిల్లాలో సుమారు 4వేల డైలీ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. తిరుపతి నగరంలో భారీగా తండల్ వ్యాపారాలు సాగుతుంటాయి. మదనపల్లి, పలమనేరు, శ్రీకాళహస్తి, పీలేరు,పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల్లో అధికారిక, అనధికారిక వడ్డీ వ్యాపారులు అధిక సంఖ్యలో ఉ న్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో తమిళనాడు, విజయవాడకు చెందిన డైలీ, వీక్లీ ఫైనాన్స్ వ్యాపారులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా సుమా రు రూ.20కోట్ల వరకు ఫైనాన్స్ వ్యాపా రం సాగుత్నునట్టు అంచనా. ఇక అనధికారిక చీ టీల విషయానికి వస్తే రూ.కోట్లలోనే లావాదేవీలు జరుగుతుంటాయి. అప్పులు తీసుకున్న వారిలో చాలామంది లాక్డౌన్ ఎ ఫెక్ట్ వల్ల వాయిదాలు చెల్లించని పరిస్థితి. అయి నా వడ్డీ వ్యాపారులు ఏ మాత్రం కనికరించడంలేదు. వెహికల్ ఫైనాన్స్ కష్టాలు జిల్లాలో ఎక్కువమంది మధ్యతరగతికి చెందిన వారు టూవీలర్లు, ఆటోలు, కొందరు లారీలు, బాడుగకు తిప్పేందుకు కార్ల కోసం ఫైనాన్స్ తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. దీంతో కంపెనీవాళ్లు నిర్మొహమాటంగా వాహనాలను సీజ్ చేస్తున్నారు. రెండు నెలలకు పైగా సక్రమంగా పనులు లేక ఇంటికే పరిమితమైన బడుగుజీవులను కరోనా వైరస్ కంటే ఫైనాన్స్ కంపెనీలే అధికంగా భయపెడుతున్నాయి. తమిళనాడు వ్యాపారుల దందా తమిళనాడుకు చెందిన పలువురు ఫైనాన్స్ వ్యాపారులు చిన్నపాటి దుకాణాలు, తోపుడుబండ్ల వారికి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు అప్పులిచ్చారు. లాక్‌డౌన్‌తో దుకాణాలు మూతపడడంతో ఇప్పుడు సెక్యూరిటీ పేరు చెప్పి బలవంతంగా ప్రామిసరీ నోట్లు రాయించడం, చెక్కులు తీసుకోవడం చేస్తున్నారు. పాడి ఆవులకు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు వాటిని తోలుకెళతామని బెదిరిస్తున్నట్లు సమాచారం. -
ఆ ఇద్దరే.. కాల్‌నాగులు!
విజయవాడలో కాల్‌నాగులు మళ్లీ చెలరేగిపోయారు. అందరూ సద్దుమణిగిందనుకున్న ఈ దందా నగరంలో చాపకింద నీరులా వ్యాపిస్తుందనే విషయం బుధవారం చోటుచేసుకున్న ఘటనతో రుజువైంది. ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు నగరాన్ని చెరిసగం చొప్పున పంచేసుకుని మరీ కాల్‌మనీ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. 15 శాతం నుంచి 25 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పుల వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. లేదంటే ఆస్తులు గుంజుకుంటున్నారు. బాధితులు ప్రశ్నిస్తే దాడులకు సైతం తెగబడుతున్నారు. ఆస్తులు కోల్పోయిన వారు గగ్గోలు పెడుతున్నా ఆలకించే నాథుడే కరువయ్యాడు. సాక్షి, అమరావతిబ్యూరో : కాల్‌మనీ వ్యాపారంలో విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు సూత్రధారులు... వారిద్దరి అనుచరగణం పాత్రధారులుగా ఉన్నారు. దాదాపు రూ.100 కోట్ల మేర టర్నోవర్ చేస్తున్నారు. కాల్‌మనీ దందా మళ్లీ జూలు విదిలిస్తోంది. వేధింపులతో పసుపులేటి పద్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించడంతో మరోసారి ఈ దందా ఆగడాలు బహిర్గతమయ్యాయి. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల్లో ఒకరు ఒకప్పుడు ఇంద్రకీలాద్రి మీద చిన్న షాపు నిర్వహించేవారు. సినిమా టిక్కెట్ల బ్లాక్ దందా నుంచి ఆయన చేయని పనంటూ లేదు. టీడీపీ అండతో అలా అక్రమ వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ప్రజాప్రతినిధి అయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అక్రమాల విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. అందులో ప్రధానమైనదే కాల్‌మనీ రాకెట్. ఆ ప్రజాప్రతినిధి ఏకంగా 60 మంది వరకు అనుచరులను పెట్టుకుని ఈ రాకెట్‌ను విస్తరించారు. నగరంలోని మల్లికార్జునపేట, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కాళేశ్వరమార్కెట్తోపాటు వన్‌టౌన్ అంతటా వేళ్లుకున్నారు. చిరువ్యాపారులు, గృహిణులు, మధ్యతరగతి వర్గీయుల ఆర్థిక అవసరాలను అవకాశంగా మలచుకుని అత్యధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. అనంతరం వడ్డీలు, చక్రవడ్డీలతో సహా వసూళ్ల పేరుతో వేధిస్తున్నారు. అప్పు వసూళ్ల పేరుతో దుకాణాలు, ఇళ్లు, ఇతర ఆస్తులను గుంజుకోవడం పరిపాటిగా మారింది. ఆ ప్రజాప్రతినిధి దాదాపు రూ.50 కోట్లకు పైగా కాల్‌మనీ టర్నోవర్ సాగిస్తున్నట్లు అంచనా. జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, ఇతరులకు అవసరమైతే క్షణాల్లో కోట్లు సమకూర్చిపెట్టగలరని పేరుపొందారు. మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందారు. ‘సెంట్రల్’ దందా ఈయనదే కాల్‌మనీ రాకెట్ సూత్రధారి అయిన మరో ప్రజాప్రతినిధి అంటేనే విజయవాడ హడలెత్తిపోతోంది. అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆయన 2014 నుంచి కబ్జాలు, దాడులతో నగరాన్ని హడలెత్తిస్తున్నారు. ఆయన పకడ్బంధీగా కాల్‌మనీ దందాను సాగిస్తున్నారు. బీసెంట్ రోడ్డు నుంచి అజిత్‌సింగ్‌నగర్ వరకు వాణిజ్య ప్రధాన కేంద్రాన్ని ఆయన గుప్పిట పట్టారు. ఆయన అనుచరులతో పది వరకు బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరీ కాల్‌మనీ రాకెట్ నిర్వహిస్తున్నారు. ఆయన కూడా దాదాపు రూ.50 కోట్ల మేర టర్నోవర్ సాగిస్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిమరీ కాల్‌మనీ రాకెట్ అరాచకాలు సాగిస్తున్నారు. తాము చెప్పినంత వడ్డీలు చెల్లించలేకపోయినవారిని ఆ కార్యాలయానికి పిలిపించి మరీ దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. బాధితుల షాపులు, ఆస్తులు తమ పేరిట రాయించుకున్నారు. రాజకీయ ఒత్తిడికి పోలీసులు... రాజధానిలో కాల్‌మనీ దందా ఇంత నియంతృత్వం ప్రదర్శిస్తున్నా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది. విజయవాడలో 2015లో కాల్‌మనీ రాకెట్ మొదటి సారి బయటపడినప్పుడు పోలీసు యంత్రాంగం కొంత హడావుడి చేసింది. కాల్‌మనీ కేసుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. కానీ తరువాత ఆ సెల్ క్రియాశీలంగా వ్యవహరించలేకపోయింది. మళ్లీ రెండేళ్లుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న కాల్‌మనీ దందాకు అడ్డుకట్ట వేయడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందింది. ప్రధానంగా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులే ఈ దందాకు సూత్రధారులు కావడం పోలీసులు చోద్యం చూస్తుండిపోతున్నారు. పలువురు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటిని పోలీస్స్టేషన్స్థాయిలోనే అధికార పార్టీనేతలకు అనుకూలంగా సెటిల్మెంట్లు చేసేస్తూ కప్పిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో టీడీపీ నేతల కాల్‌మనీ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఆ ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు కోట్లు కొల్లగొడుతున్నారు. -
కాల్‌మనీ వ్యాపారి రవికాంత్ అరెస్ట్
విజయవాడ : ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అధికార టీడీపీకి చెందిన కాల్‌మనీ వ్యాపారి మండవ రవికాంత్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు కృష్ణలంకలోని రవికాంత్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం బాధితులకు మద్దతుగా ధర్నా చేశారు. కాల్‌మనీ పేరుతో 10 మంది మహిళలను రూ. కోటి వరకు మోసం చేశాడని ఆయా సంఘాలు ఆరోపించాయి. రవికాంత్‌కు అండగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు వారు డిమాండ్ చేశారు. -
ఉసురు తీసిన కాల్‌మనీ
-
ఉసురు తీసిన కాల్‌మనీ
వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మహిళ మృతి తాడేపల్లిగూడెంలో వెలుగు చూసిన కాల్‌మనీ కేసు పోలీస్ స్టేషన్ ఎదుట క్యూ కడుతున్న బాధితులు ముగ్గురు మహిళలదే అక్కడ దందా తాడేపల్లిగూడెం : కాల్‌మనీ వ్యాపారం మన జిల్లాలోనూ ఓ మహిళ ఉసురు తీసింది. అప్పు తీసుకున్న పాపానికి ఒక మహిళను మరో మహిళ వేధించింది. తట్టుకోలేని బాధితురాలు మంగళవారం రాత్రి ప్రాణాలు వదిలింది. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు శివారు కేఎస్ఎన్ కాలనీలో బుధవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కేఎస్ఎన్ కాలనీలో చిన్నపాటి కిరాణా కొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరమళ్ల కనకదుర్గ (43) అదే కాలనీకి చెందిన కర్రి రాజేశ్వరి నుంచి కుటుంబ అవసరాలు, బిడ్డల వివాహాల నిమిత్తం 2013-14 సంవత్సరాల మధ్య దఫదఫాలుగా మొత్తం రూ.10 లక్షలు అప్పు తీసుకుంది. ఇందుకోసం ఉంగుటూరు మండలం బాదంపూడి, తాడేపల్లిగూడెం పట్టణం, కొండ్రుప్రోలులోని కేఎస్ఎన్ కాలనీలో తనకు గల ఇళ్ల స్థలాలు, ఇళ్లను కనకదుర్గ తనఖా పెట్టింది. నెలనెలా రూ.40 వేల చొప్పున వడ్డీ రూపంలో రూ.7 లక్షల వరకు రాజేశ్వరికి చెల్లించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కొంతకాలంగా కనకదుర్గ వడ్డీ కట్టలేని స్థితికి చేరింది. దీంతో అప్పు ఇచ్చిన రాజేశ్వరి, ఆమెకు సోదరుడి వరుసయ్యే సుబ్బిరెడ్డి (అత్తిలి మండలం మంచిలి) వేధించడం మొదలు పెట్టారని మృతురాలు కనకదుర్గ కుమారుడు సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూ.10 లక్షల రుణానికి రూ.7 లక్షలు వడ్డీగా చెల్లించినా వారు తీవ్రంగా వేధించడంతో తన తల్లి మృత్యువాత పడిందని ఆరోపించాడు. కాల్‌మనీ కేసులెన్నో.. మృతురాలు కనకదుర్గ కుమారుడు సత్యనారాయణ పోలీసులకిచ్చిన ఫిర్యాదు అనంతరం ఈ ప్రాంతంలో సాగుతున్న వడ్డీ దందాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కాల్‌మనీ వ్యాపారులు తమను వేధిస్తున్నారంటూ కేఎస్ఎన్ కాలనీకి చెందిన పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్‌మనీ బాధితులతో రూరల్ పోలీస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. ఆ ముగ్గురుదే హవా పదేళ్ల క్రితం కేఎస్ఎన్ కాలనీకి వలస వచ్చిన లక్ష్మి, రాజేశ్వరి, సుబ్బిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు కలసి వడ్డీ వ్యాపారం చేస్తూ అక్కడి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఇదే కాలనీకి చెం దిన రవికుమార్ అనే వ్యక్తి విలేకరులకు తెలిపాడు. వాళ్లు రూ.1,000 నుంచి రూ.లక్షల వరకు రుణంగా ఇస్తుంటారని చెప్పాడు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని పరిస్థితులు కల్పించి రుణగ్రస్తుల పేరిట ఉన్న ఆస్తులను ఈ ముగ్గురు కబ్జా చేస్తుంటారని కాలనీవాసులు చెబుతున్నారు. నూటికి రూ.3 వడ్డీగా ప్రారంభమయ్యే రుణాన్ని కాల క్రమేణా రూ.7, రూ.10 వరకు పెంచుకుంటూ వెళ్తారని అంటున్నారు. ఈ ముగ్గురితోపాటు పెంటపాడు, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మరి కొందరు వడ్డీ వ్యాపారం పేరిట కాలనీ వాసుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వాళ్ల వేధింపులే అమ్మ ప్రాణం తీశాయి తీసుకున్న రుణంతోపాటు వడ్డీ మొత్తాన్ని బుధవారం సాయంత్రంలోగా చెల్లించకపోతే మంచిలి నుంచి తన తమ్ముడు వచ్చి సంగతి తేలుస్తాడని రాజేశ్వరి హెచ్చరించడం వల్లే తన తల్లి కనకదుర్గ మృత్యువాత పడిందని కుమారుడు సత్యనారాయణ తెలిపాడు. ప్రైవేట్ టెలికాం కంపెనీలో పనిచేస్తున్న సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. రాజేశ్వరి హెచ్చరించి వెళ్లిన తరువాత స్నానానికని వెళ్లిన తన తల్లి కనకదుర్గ బాత్రూమ్లోనే తనువు చాలించిందని తెలిపాడు. ఆమె బాత్రూమ్లోంచి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి తాను తలుపు తట్టినా ఎలాంటి అలికిడి లేదన్నారు. దీంతో బాత్రూమ్ పైభాగంలో ఉన్న సిమెంట్ పలకలను తొలగించి చూడగా, తన తల్లి శవమై పడి ఉందన్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినప్పటికీ బంధువులు వచ్చే వరకు వేచిచూసి బుధవారం ఉదయం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం కనకదుర్గ మృతదేహానికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు పర్యవేక్షణలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
కాల్‌మనీ ఉపాధ్యాయుడికి పోలీసు అండ..?
ఆ అధికారి సొమ్ముతోనే వ్యాపారం ఒక చీటర్‌తో సంబంధాలు భయపడుతున్న బాధితులు విజయవాడ : కాల్‌మనీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుడికి ఓ పోలీస్ అధికారి అండ పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. విజయవాడలోని మురళీనగర్‌లో ఉంటూ తోట్లవలూరు మండలం భద్రిరాజుపాలెంలోని జెడ్పీ స్కూల్లో ఉపాధ్యాయుడుగా చేస్తున్నారు. గతంలో పటమటలో ఉన్న ఉపాధ్యాయుడు, ఆయన భార్య మహిళలకు మాత్రమే రుణాలు ఇస్తారని, నూటికి రూ.20 వడ్డీ వసూలు చేసేవారని తెలిసింది. ఈ ఉపాధ్యాయుడు వెనుక ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పోలీసు అధికారివ్యక్తి హస్తం ఉన్నట్లు తెలిసింది. ఆయన డబ్బునే ఇక్కడ ఉపాధ్యాయుడు కాల్‌మనీకి తిప్పుతున్నారని బాధితులు చెబుతున్నారు. గతంలో ఒక చీటర్‌తో సంబంధాలు..... తెనాలి వెళ్లే మార్గ మధ్యంలో తన కారు కాలువలో పడిపోయినట్లు నటించిన చీటర్ నార్ల వంశీతో ఈ ఉపాధ్యాయుడు, పోలీసు అధికారికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. వంశీ వద్ద పోలీసు అధికారి రూ.కోట్లు గుంజి ఉపాధ్యాయుడికి ఇచ్చారని వారి గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆ డబ్బునే కాల్‌మనీగా తిప్పుతున్నారు. కాల్‌మనీ ముఠాకు అధికార పార్టీ నాయకుల అండదండలుండటంతో తన సొమ్మును కూడా ఈ ముఠాకు ఇచ్చి వారితో చక్కటి సంబంధాలు నడుపుతూ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. సిండికేట్‌గా ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. ఇంటెలిజెన్స్ విభాగం విచారణతో సరి.. ఉపాధ్యాయుడు గురించి ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేశారే తప్ప కేసును ముందుకు తీసుకువెళ్లలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసు, న్యాయశాఖకు చెందిన ప్రముఖులతో ఉపాధ్యాయుడుకు సంబంధాలు ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. పోలీసు కమిషనర్ ఇటువంటి కేసులపై దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు. -
'స్కెచ్ వేసి లాడ్జీకి రప్పించి, నిర్బంధం'
విజయవాడ : బెజవాడలో రోజూ వారి వడ్డీ వ్యాపారుల అరాచకం మితిమీరి కిడ్నాప్ వరకూ దారి తీసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ యువకుడిని కాల్‌మనీ నిర్వాహకులు నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని రెండు రోజులుగా గవర్నర్‌పేటలోని ఓ హోటల్లో నిర్బంధించి దాడి చేస్తున్నట్లు సమాచారంతో సూర్యారావుపేట పోలీసులు అక్కడకు వెళ్లి బాధితుడికి విముక్తి కలిగించడంతో పాటు, దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం కృష్ణాజిల్లా కలిదిండికి చెందిన నరేష్ కొంతకాలం కిందట నగరానికి వచ్చి గుణదలలో స్థిరపడి కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. అతని మరదలు బిందు ద్వారా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నరేష్ రెండు నెలల క్రితం శ్రావణ్ కుమార్ వద్ద రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. పదిరోజుల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. తరువాత అప్పు ఇచ్చినవారు ఫోన్ చేసినా స్పందించటం లేదు. నరేష్‌కు మరలా డబ్బు అవసరమై బిందును రూ.10వేలు అడిగాడు. దాంతో నగదు చెల్లించకుండా నరేష్ తిరుగుతుండడంతో, అతడిని స్కెచ్ వేసి లాడ్జీకి రప్పించారు. ఈ నెల 22న గుంటూరు వస్తే డబ్బు ఇస్తామని చెప్పటంతో అక్కడికి వెళ్లాడు. అక్కడ శ్రావణ్ కుమార్, బిందు కలిసి డబ్బు ఇస్తామని చెప్పి నగరానికి తీసుకు వచ్చారు. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలంటూ రామవరప్పాడులోని ఓ హోటల్లో నిర్బంధించారు. అందుకు శ్రావణ్ కుమార్ స్నేహితులు సహకరించారు. మూడు జులపాటు గుంటూరు, విజయవాడలలోని వివిధ లాడ్జీల్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ సూర్యారావుపేట అనుపమ హోటల్లో బస చేయగా, గట్టిగా అరుపులు వినిపించడంతో ... హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసుల రాకతో మొత్తం వ్యవహారం బయటపడింది. నరేష్‌తోపాటు హోటల్లో ఉన్న ఆరుగురు కాల్ మనీ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్‌మనీ వ్యాపారుల వివరాలపై కూపీ లాగుతున్నారు.