ఉసురు తీసిన కాల్‌మనీ | man died Call Money | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన కాల్‌మనీ

Published Thu, Jan 21 2016 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

man died Call Money

 వడ్డీ వ్యాపారి వేధింపులు
 తాళలేక మహిళ మృతి
 తాడేపల్లిగూడెంలో వెలుగు చూసిన
 కాల్‌మనీ కేసు
 పోలీస్ స్టేషన్ ఎదుట
 క్యూ కడుతున్న బాధితులు
 ముగ్గురు మహిళలదే అక్కడ దందా
 
 తాడేపల్లిగూడెం : కాల్‌మనీ వ్యాపారం మన జిల్లాలోనూ ఓ మహిళ ఉసురు తీసింది. అప్పు తీసుకున్న పాపానికి ఒక మహిళను మరో మహిళ వేధించింది. తట్టుకోలేని బాధితురాలు మంగళవారం రాత్రి ప్రాణాలు వదిలింది. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు శివారు కేఎస్‌ఎన్ కాలనీలో బుధవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కేఎస్‌ఎన్ కాలనీలో చిన్నపాటి కిరాణా కొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరమళ్ల కనకదుర్గ (43) అదే కాలనీకి చెందిన కర్రి రాజేశ్వరి నుంచి కుటుంబ అవసరాలు, బిడ్డల వివాహాల నిమిత్తం 2013-14 సంవత్సరాల మధ్య దఫదఫాలుగా మొత్తం రూ.10 లక్షలు అప్పు తీసుకుంది.
 
  ఇందుకోసం ఉంగుటూరు మండలం బాదంపూడి, తాడేపల్లిగూడెం పట్టణం, కొండ్రుప్రోలులోని కేఎస్‌ఎన్ కాలనీలో తనకు గల ఇళ్ల స్థలాలు, ఇళ్లను కనకదుర్గ తనఖా పెట్టింది. నెలనెలా రూ.40 వేల చొప్పున వడ్డీ రూపంలో రూ.7 లక్షల వరకు రాజేశ్వరికి చెల్లించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కొంతకాలంగా కనకదుర్గ వడ్డీ కట్టలేని స్థితికి చేరింది. దీంతో అప్పు ఇచ్చిన రాజేశ్వరి, ఆమెకు సోదరుడి వరుసయ్యే సుబ్బిరెడ్డి (అత్తిలి మండలం మంచిలి) వేధించడం మొదలు పెట్టారని మృతురాలు కనకదుర్గ కుమారుడు సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూ.10 లక్షల రుణానికి రూ.7 లక్షలు వడ్డీగా చెల్లించినా వారు తీవ్రంగా వేధించడంతో తన తల్లి మృత్యువాత పడిందని ఆరోపించాడు.
 
 కాల్‌మనీ కేసులెన్నో..
 మృతురాలు కనకదుర్గ కుమారుడు సత్యనారాయణ పోలీసులకిచ్చిన ఫిర్యాదు అనంతరం ఈ ప్రాంతంలో సాగుతున్న వడ్డీ దందాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కాల్‌మనీ వ్యాపారులు తమను వేధిస్తున్నారంటూ కేఎస్‌ఎన్ కాలనీకి చెందిన పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్‌మనీ బాధితులతో రూరల్ పోలీస్ స్టేషన్ కిటకిటలాడుతోంది.
 
 ఆ ముగ్గురుదే హవా
 పదేళ్ల క్రితం కేఎస్‌ఎన్ కాలనీకి వలస వచ్చిన లక్ష్మి, రాజేశ్వరి, సుబ్బిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు కలసి వడ్డీ వ్యాపారం చేస్తూ అక్కడి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఇదే కాలనీకి చెం దిన రవికుమార్ అనే వ్యక్తి విలేకరులకు తెలిపాడు. వాళ్లు రూ.1,000 నుంచి రూ.లక్షల వరకు రుణంగా ఇస్తుంటారని చెప్పాడు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని పరిస్థితులు కల్పించి రుణగ్రస్తుల పేరిట ఉన్న ఆస్తులను ఈ ముగ్గురు కబ్జా చేస్తుంటారని కాలనీవాసులు చెబుతున్నారు. నూటికి రూ.3 వడ్డీగా ప్రారంభమయ్యే రుణాన్ని కాల క్రమేణా రూ.7, రూ.10 వరకు పెంచుకుంటూ వెళ్తారని అంటున్నారు. ఈ ముగ్గురితోపాటు పెంటపాడు, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మరి కొందరు వడ్డీ వ్యాపారం పేరిట కాలనీ వాసుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
 
 వాళ్ల వేధింపులే అమ్మ ప్రాణం తీశాయి
 తీసుకున్న రుణంతోపాటు వడ్డీ మొత్తాన్ని బుధవారం సాయంత్రంలోగా చెల్లించకపోతే మంచిలి నుంచి తన తమ్ముడు వచ్చి సంగతి తేలుస్తాడని రాజేశ్వరి హెచ్చరించడం వల్లే తన తల్లి కనకదుర్గ మృత్యువాత పడిందని కుమారుడు సత్యనారాయణ తెలిపాడు. ప్రైవేట్ టెలికాం కంపెనీలో పనిచేస్తున్న సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. రాజేశ్వరి హెచ్చరించి వెళ్లిన తరువాత స్నానానికని వెళ్లిన తన తల్లి కనకదుర్గ బాత్‌రూమ్‌లోనే తనువు చాలించిందని తెలిపాడు. ఆమె బాత్‌రూమ్‌లోంచి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి తాను తలుపు తట్టినా ఎలాంటి అలికిడి లేదన్నారు.

దీంతో బాత్‌రూమ్ పైభాగంలో ఉన్న సిమెంట్ పలకలను తొలగించి చూడగా, తన తల్లి శవమై పడి ఉందన్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినప్పటికీ బంధువులు వచ్చే వరకు వేచిచూసి బుధవారం ఉదయం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం కనకదుర్గ మృతదేహానికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు పర్యవేక్షణలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement