
యరపతినేనికి చెక్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న సున్నపురాయి అక్రమ దందాపై ప్రభుత్వశాఖల ముట్టడి ప్రారంభమైంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ దందాపై ప్రత్యేక నివేదికను రూపొందించనున్నాయి. లోకాయుక్త నియమించనున్న కమిటీ దీనిపై పూర్తి వివరాలు సేకరించనుంది. ఒకేసారి యరపతినేని చుట్టూ ముడి బిగిస్తుండటంతో ఇప్పటివరకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పక్కకు తప్పుకొన్నాయి. దీంతో 20 రోజుల నుంచి అక్రమ మైనింగ్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్, మైనింగ్ విభాగాలకు చెందిన అధికారులు గత శుక్రవారం పిడుగురాళ్ల, దాచేపల్లిలోని క్వారీలను పరిశీలించి వివరాలు సేకరించారు.
యరపతినేని అక్రమ సున్నపురాయి తవ్వకం, తరలింపుపై వైఎస్సార్ సీపీ బీసీసెల్ నేత గురువాచారి హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతకుముందే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, యరపతినేని అక్రమ మైనింగ్‌పై ఆందోళన నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు సాక్ష్యాధారాలతో వినతిపత్రాలు అందచేశారు. స్పందించకపోవడంతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతోపాటు అక్రమ మైనింగ్, సున్నపురాయి కంపెనీల విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లుల కాపీలను ఇచ్చారు.
ఆ ప్రాంతంలో అధికారిక మైనింగ్ లేకపోయినా క్వారీల్లో 30 నుంచి 40 అడుగుల లోతులో సున్నపురాయి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటో, వీడియో క్లిప్పింగ్‌లను లోకాయుక్తకు అం దచేశారు. ఫిర్యాదుకు లోకాయుక్త స్పందించి ఒక కమిటీని ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలోని సభ్యులు త్వరలో ఇక్కడి అక్రమ క్వారీయింగ్‌ను పరిశీలించి లోకాయుక్తకు నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త అక్టోబరు 5 వ తేదీలోపు అక్రమ క్వారీయింగ్‌పై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ సంచాలకులను ఆదేశించింది.
రహస్య నివేదిక .. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివిధ ప్రభుత్వశాఖలతోపాటు టీడీపీలోని కొందరు ముఖ్యులు ఇచ్చిన రహస్య నివేదికలో రెండు ప్రధాన సూచనలు చేసినట్టు తెలుస్తోంది. గురజాల నియోజకవర్గంలో సున్నపురాయి తీయడానికి అవకాశం ఉన్న భూములను గుర్తించి, వాటిని పారదర్శకంగా లీజుకు ఇవ్వాలని సూచించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్దసంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉందని, వారంతా యరపతినేని దందాను నిలువరించే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఇందుకు ఉదాహరణగా మద్యం వ్యాపారుల్లో కొంతమంది యరపతినేనికి వాటాలు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేశారని, అదేవిధంగా లీజుకు ముందుకు వచ్చే వ్యాపారులు కూడా యరపతినేని ప్రతిపాదనలు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. కుదరని పక్షంలో గురజాల నియోజకవర్గంలో మిగిలిన సున్నపురాయి క్వారీలను రాష్ర్ట ఖనిజాభివృద్ధి సంస్థకు స్వాధీనం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇలా యరపతినేని ఆగడాలను నిలువరించే అవకాశం ఉంటుందని, లేకుంటే ఇక్కడ విధులు నిర్వహించడం కష్టంగా ఉందని పలు ప్రభుత్వశాఖలు నివేదికలిచ్చినట్టు తెలుస్తోంది.
చర్యలకు డిమాండ్..
అక్రమ మైనింగ్ దందాకు పాల్పడిన ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.