
మీడియాతో మాట్లాడుతున్న కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, గుంటూరు: గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్ అక్రమాలు బయటపెట్టే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని గురజాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులను అడ్డం పెట్టుకుని వాయిదా వేయగలిగారనీ, కానీ టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని తెలిపారు. మైనింగ్ అక్రమాలు వెల్లడైతే ప్రభుత్వం ఇరుకునపడుతుందని యరపతినేని వణికిపోతున్నారని అన్నారు.
అందినకాడికి దోచుకున్న యరపతినేని మైనింగ్ కేసులో తన దగ్గర పనిచేసే డ్రైవర్, వాచ్‌మెన్, గుమాస్తాలను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియా నుంచి వసూలు చేసిన రెండువేల కోట్ల పెనాల్టీని పల్నాడు అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన 6 నెలల్లో అక్రమ మైనింగ్ జరిగిన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ప్రజా తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో యరపతినేనికి త్వరలో చూపిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో ఆయనకు దారుణమైన ఓటమి తప్పదని మహేష్‌రెడ్డి హెచ్చరించారు.