
గురజాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి
విజయవాడ: నాలుగేళ్లుగా గురజాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని గురజాల వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో కాసు మహేశ్ విలేకరులతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ ద్వారా రూ.270 కోట్ల దోపిడీ జరిగిందని విమర్శించారు. ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా యరపతినేని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో యరపతినేని కీలక సూత్రధారి అని లోకాయుక్త నిర్ధారించిందని వెల్లడించారు.
ఇప్పుడు కూడా యరపతినేని ఆధ్వర్యంలో అక్రమమైనింగ్ జరుగుతుందన్నారు. హైకోర్టు ప్రభుత్వానికి తీవ్రమైన అక్షింతలు వేసినా వీరికి బుద్ధిరాలేదని మండిపడ్డారు. మీకు దగ్గర్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం అండదండలతోనే ఇదంతా జరుగుతుందని వ్యాఖ్యానించారు. వడవల్లి వెంకటేశ్వర్లు, ఘట్టమనేని నాగేశ్వరరావు, నెలూరి శ్రీనివాస రావు అనే ఈ ముగ్గురూ యరపతినేని బినామీలు అని ఆరోపణ చేశారు.