నిర్మాణాలకు నిరంతరాయంగా ఇసుక | Continuous sand for structures | Sakshi
Sakshi News home page

నిర్మాణాలకు నిరంతరాయంగా ఇసుక

Published Thu, Jun 13 2019 4:42 AM | Last Updated on Thu, Jun 13 2019 4:42 AM

Continuous sand for structures - Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అదే సమయంలో సామాన్య ప్రజల ఇళ్ల నిర్మాణాలు, ముఖ్యమైన ఇతర పనులకు ఇసుక కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతోపాటు సామాన్యులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వానికి రాబడి వచ్చే విధంగా కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని సర్కారు తాజాగా నిర్ణయించిన విషయం విదితమే. 15 రోజుల్లో కొత్త పాలసీ తెస్తామని, ఇది వచ్చేవరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తామని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. కొత్త పాలసీ వచ్చేవరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తే మాఫియా దీన్ని సాకుగా చూపించి, ఇసుక కొరత సృష్టించి, ధరలు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఇదే జరిగితే ఇళ్లు నిర్మించుకునే సామాన్యులతోపాటు ఇతర నిర్మాణ పను లకు ఇసుక అత్యవసరమైన వారికి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం పున:సమీక్షించుకుని, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించింది.  

కొరత రానివ్వొద్దు  
రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా కట్టుదిట్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికకు ప్రభుత్వం బుధవారమే శ్రీకారం చుట్టింది. ముఖ్యమైన నిర్మాణాలకు, సాధారణ ప్రజల ఇళ్ల నిర్మాణం, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పర్యావరణ అనుమతి ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి ప్రాధాన్యాన్ని బట్టి పనులకు, నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతించాలని గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ శ్రీనరేష్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాలకు మెమో జారీ చేశారు.  

నోడల్‌ అధికారులుగా జిల్లా కలెక్టర్లు  
కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ ఎవరికీ ఇసుక కొరత రానివ్వరాదు. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసి ధరలు పెంచేందుకు ఆస్కారం ఇవ్వరాదు. ఇందుకోసం కంటింజెంట్‌ ప్లాన్‌ అమలుకు కలెక్టర్లు నోడ ల్‌ అధికారులుగా వ్యవహరించాలని మెమోలో స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడినా, రవాణా చేసినా నిల్వ ఉంచుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని, సరఫరాలో మధ్యవర్తులు, మాఫియా పాత్ర ఉన్నట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని,  ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటి తరలిపోకుండా చూడాలని, పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతి తీసుకున్న వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తేల్చిచెప్పారు. 

ఇసుక కావాలంటే. 
ఇకపై ఇసుక అవసరమైన వారు తొలుత తహసీల్దార్లకు అర్జీ పెట్టుకోవాలి. కలెక్టర్‌ అనుమతితో ఇసుక తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇసుక దొరకదని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భూగర్భ గనుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇసుక కావాల్సిన వారు ఆ విషయాన్ని వివరిస్తూ అర్జీలు పెట్టుకుని అనుమతులు తీసుకుని ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement