గనుల శాఖలో 477 లీజులు రద్దు | Canceling 477 leases in the mining department | Sakshi
Sakshi News home page

గనుల శాఖలో 477 లీజులు రద్దు

Published Sat, Mar 17 2018 4:03 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Canceling 477 leases in the mining department - Sakshi

శుక్రవారం గనుల శాఖ కార్యకలాపాలపై సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: గనుల శాఖ అనుమతి తీసుకుని కార్యకలాపాలు చేపట్టని లీజులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా 477 లీజులకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించడం లేదని గుర్తించి.. వాటిని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇక వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్‌ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో గనుల శాఖ అధికారులు 354 తనిఖీలు నిర్వహించి.. 79 చోట్ల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ మేరకు రాష్ట్రంలో గనుల శాఖ కార్యకలాపాలపై శుక్రవారం మంత్రి కె.తారకరామారావు సమీక్షించారు. అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలని, ఇందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించండి 
గనుల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. గనుల పర్యవేక్షణలో జియోఫెన్సింగ్, జియో ట్యాగింగ్, ఉపగ్రహ చిత్రాల వినియోగం, డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలన్నారు. త్వరలో తీసుకురానున్న మైనింగ్‌ పాలసీలో దేశంలోని అత్యుత్తమ విధానాలను అమలుచేయాలని, ఆ పాలసీని చట్టరూపంలో తీసుకువస్తామన్నారు. ఈ–వేలం విధానంలో గనుల, ఇసుక రీచ్‌ల లీజులు కేటాయించాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక రాష్ట్రంలో సున్నపురాయి గనుల లీజుపైనా  చర్చిం చారు. వాటికి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయస్థాయి వేలం నిర్వహించాలని చెప్పారు.  

రాక్‌ శాండ్‌ వినియోగం పెంచండి 
పర్యావరణ సమతుల్యత కోసం రాక్‌ శాండ్‌ (రాతి ఇసుక) వినియోగాన్ని పెంచాలని కేటీఆర్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం వివిధ శాఖల పరిధిలో చేపట్టిన నిర్మాణాల్లో దాని వినియోగం పెంచాలని, ఇందుకోసం ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. టీఎస్‌ఎండీసీ సైతం రాక్‌ శాండ్‌ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. పలు జిల్లాల్లో చేపట్టిన శాండ్‌ టాక్సీ విధానం విజయవంతమైందని, దానిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో రాష్ట్రం లోని ఎవరికైనా ఏయే ధరల్లో ఇసుక లభిస్తుందో తెలిసేలా కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ఆదాయ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,166 కోట్ల ఆదాయ లక్ష్యం పెట్టుకోగా.. మేజర్, మైనర్‌ మినరల్స్‌ ద్వారా ఫిబ్రవరి నెలాఖరు నాటికే సుమారు రూ.3,500 కోట్లు (110 శాతం) ఆదాయం వచ్చిందన్నారు. ఇసుక ఆదాయలక్ష్యం రూ.388 కోట్లుకాగా.. రూ.538 కోట్లు (139శాతం) సమకూరినట్లు తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపిందని, అందువల్లే ఆదాయం కూడా పెరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement