కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్: నగరంలో స్కై వేల నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మోకాలడ్డుతోందని మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విరుచుకుపడ్డారు. శనివారం మాదాపూర్ మైండ్ స్పేస్ అండర్ పాస్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. జూబ్లీ బస్ స్టేషన్, ప్యాట్నీ సెంటర్‌ల వద్ద చేపట్టబోయే రెండు స్కై వేల పట్ల రక్షణ శాఖ మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. రెండు స్కై వేలకు అనుమతిస్తే రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల స్థలం పోతోందని, అంతే విలువైన స్థలం కోరితే శామీర్‌పేట్ లో 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థలంతో పాటు ఏటా రూ.30 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని రక్షణ శాఖ లేఖ రాసి కొర్రీ పెట్టిందన్నారు. జీవిత కాలం ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు.
కంటోన్మెంట్‌లో ఇష్టం వచ్చినట్లు రోడ్డు మూసివేస్తే సమీప కాలనీల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించకపోయినా కనీసం రోడ్లు మూసేయవద్దన్నారు. మే 5న రక్షణ శాఖ ఎస్టేట్ అధికారులు, ఎంపీలతో సమావేశం ఉందని తెలిపారు. సామరస్య ధోరణితో పరిష్కారానికి రక్షణ శాఖ ముందుకు రావాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.
క్యాలెండర్‌తో పని చేస్తున్నాం
అభివృద్ధి పనులను క్యాలెండర్ ప్రకారం పూర్తి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎస్‌ఆర్‌డీపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3,000 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ జనవరిలో అందుబాటులోకి రాగా మైండ్ స్పేస్ అండర్ పాస్ రెండో ఫలమని అన్నారు. ‘జూలైలో మైండ్ స్పేస్ ఫ్లయ్‌ఓవర్, డిసెంబర్‌లో రాజీవ్ గాంధీ స్టాట్యూ ఫ్లయ్‌ఓవర్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎల్బీనగర్ కారిడార్‌లో రూ.448 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. మే 1వ తేదీన చింతల్‌కుంట అండర్ పాస్, జూన్‌లో కామినేని లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, సెప్టెంబర్‌లో ఎల్బీ నగర్ లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, డిసెంబర్‌లో ఎల్బీ నగర్ లెప్ట్ హ్యాండ్ సైడ్ అండర్ పాస్, 2019 మార్చిలో బయోడైవర్సిటీ ఫ్లయ్‌ఓవర్, కామినేని రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, బైరామల్‌గూడ లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, జూన్‌లో ఎల్బీనగర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్ అందుబాటులోకి రానున్నాయి’అని కేటీఆర్ చెప్పారు.
2019కి అందుబాటులోకి..
రూ.184 కోట్లతో చేపడుతున్న కేబుల్ బ్రిడ్జి 2019 మార్చికి, రూ.150 కోట్లతో రోడ్డు నంబర్ 45 నుంచి నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ 2019 సెప్టెంబర్‌కి, రూ.263.09 కోట్లతో చేపట్టనున్న కొత్తగూడ గ్రేడర్ సపరేటర్, రూ.387 కోట్లతో చేపట్టనున్న బాలానగర్ గ్రేడ్ సపరేటర్, రూ.132 కోట్లతో ఒవైసీ హాస్పిటల్ వద్ద బహదూర్‌పుర రోడ్డు, రూ.333.55 కోట్లతో చేపట్టనున్న షేక్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ 2019 డిసెంబర్‌కు, రూ.270 కోట్లతో నిర్మిస్తున్న అంబర్‌పేట్ 6 నంబర్ ఫ్లయ్‌ఓవర్ 2019 డిసెంబర్‌కు అందుబాటులోకి రానున్నాయని కేటీఆర్ తెలిపారు. పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత రూ.436 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లయ్‌ఓవర్ నిర్మిస్తామని వివరించారు.
నగరంలో వేగంగా
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతోనే నగరంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ అండర్ పాస్‌ను ఆయన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలసి ప్రారంభించారు. నిర్ణీత సమయానికి ముందే పనులు పూర్తి చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment