మరో ఏడేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తాం
- బాలానగర్ ఫ్లైఓవర్ భూమిపూజలో మంత్రి కేటీఆర్
- నగర డ్రైనేజీ వ్యవస్థ మార్చేందుకు రూ.11 వేల కోట్లు అవసరం
- అభివృద్ధి, సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
- 2019లో అధికారం టీఆర్‌ఎస్‌దేనని తెలిసే కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఏడెనిమిదేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, బాలానగర్ ఫ్లైఓవర్ పనులే ఇందుకు ఆరంభమని పుర పాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో చిందరవందర గా మారిన నగరాన్ని పూర్తిస్థాయిలో మార్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రూ.369.53 కోట్లతో బాలానగర్‌లోని శోభన థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు నిర్మించనున్న 6 లేన్ల ఫ్లైఓవర్ (1.09 కి.మీ. పొడవు) పనులకు సోమవారం కేటీఆర్ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, నీటి సమస్యలొస్తాయి, శాంతిభద్రతలు అదుపులో ఉండవంటూ గత పాలకులు ఎన్నో అపోహలు సృష్టించారు.వారి అపోహలకు చెక్ పెడుతూ శాంతిభద్రతల అదుపులో దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలిచింది’ అన్నా రు. రాష్ట్రంలో, నగరంలో మండువేసవిలోనూ కరెంట్ కోతలు లేకుండా చేశామని, చిన్నతరహా పరిశ్రమలకు ఆసరాగా నిలిచామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధిపై విమర్శలు చేస్తోందని విమర్శించారు. 2019లో కేసీఆర్‌కే ప్రజలు ప ట్టం కడతారని కాంగ్రెస్ నేతలకు తెలిసే తప్పు డు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘నీటి’ పనులకు అడ్డుపడుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తుంటే.. కాంగ్రెస్ వాళ్లు కేసులేస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నగరానికి శాశ్వతంగా తాగునీటి తిప్పలు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి, ప్రాణహిత నదుల నుంచి డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్‌ను కట్టాలనుకుంటున్నామని, దీనివల్ల మూడేళ్లు కరవొచ్చినా నగరవాసులకు తాగునీటి గోస ఉండబోదని చెప్పారు. కానీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చనిపోయినవారి వేలిముద్రలతో దొంగ కేసులేస్తున్నారని, అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత జీవన్‌రెడ్డి ఈ విషయాన్ని ఒప్పకున్నారని గుర్తు చేశారు. కేసులు పెట్టింది అవాస్తవమైతే శాసనసభ సాక్షిగా చెప్పిన మాట తప్పని కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు.
టీఎస్ ఐపాస్‌తో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మండంగా ముందకెళుతోందని కేటీఆర్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌తో పాటు వచ్చే ఏడాది నుంచి ‘మన పంట–మన పెట్టుబడి’తో ఎకరాకు 4,000 ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతారన్న అపోహల ను పటాపంచలు చేస్తూ ‘ఈజ్ ఆఫ్ డూయిం గ్ బిజినెస్’లో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 70 వేల కోట్ల పెట్టబడులు తీసుకొచ్చామని, ఈ కంపెనీలతో 2,30,000 మందికి ఉపాధి లభించిందన్నారు. దేశంలో నాణ్యతతో కూడి న జీవన ప్రమాణాలున్న నగరంగా హైదరా బాద్ నంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు.
కోదండరామిరెడ్డి.. దొంగ రామిరెడ్డి: నాయిని
టీజేఏసీ చైర్మన్ కోదండరామిరెడ్డి దొంగ రామిరెడ్డి అని హోంమంత్రి నాయిని విమర్శించా రు. ఉద్యమ సమయంలో కేసీఆర్ మద్దతుతో నే టీజేఏసీ చైర్మన్ అయ్యారని, దాన్ని మరిచి సొంతంగా చైర్మన్ అయినట్టు విర్రవీగుతున్నారని, కాంగ్రెస్ తొత్తుగా మారి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను ప్రజలు పెద్ద కొడుకుగా భావిస్తుంటే.. వారు మాత్రం అభివృద్ధికి అడ్డుపడుతూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్లతో రోడ్లు, ఫ్లైఓవర్, జంక్షన్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని, మరో రూ.పది వేల కోట్ల ప్రతిపాదనలున్నాయని కేటీఆర్ చెప్పారు. మురుగు నీటి వ్యవస్థ సరిగా లేక 2 సెం.మీ. వర్షమొస్తే నగర రోడ్లపైనే నీరు నిలుస్తోందని, డ్రైనేజీ వ్యవస్థ మార్చాలంటే రూ.11 వేల కోట్లు కావాలన్నారు. శివారు మున్సిపాలిటీల్లో రూ. 2 వేల కోట్లతో భగీరథ పనులు చేస్తున్నామని, తాగునీటికి 56 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నాగోల్–మియాపూ ర్ మెట్రో మార్గాన్ని నవంబర్ నెలాఖర్లో ప్రా రంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ప్యారడైజ్–కొంపల్లి, జూబ్లీ బస్టాండ్– తూముకుంట వరకు 2 స్కైవేలు నిర్మించనున్నామన్నారు. అంబర్‌పేట 6 నంబర్–రామంతాపూర్, ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ల పనులను త్వరలోనే చేపడతామన్నారు. కా ర్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెంబర్ ఎస్టేట్ రాజేశం, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ పాల్గొన్నారు.