ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తానంటూ తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఏపీకి చెందిన కొందరు నాయకులు హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వీళ్లందరినీ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ తనకు ఆంధ్రప్రదేశ్ నుండి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని, చాలా మంది తన పార్టీలో చేరబోతున్నారని వ్యాఖ్యానించారు.
అయితే కేసీఆర్ పార్టీ దేశంలో ఇతర రాష్ట్రాలలో విస్తరించే మాట ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించాలంటే మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పక తప్పదు. కేసీఆర్ ఆంధ్రా ద్వేషిగా అనేక సార్లు తన మాటలు, చేతల ద్వారా విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం, అన్యాయం జరిగాయి. ఇందుకు ప్రధాన కారకుల్లో కేసీఆర్ ఒకరుగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ పార్టీ ఆంధ్రాలో విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్లిష్టమైన పంచాయతీలు
ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర నష్టం జరిగింది. విభజన చట్టంలోని ఒక్క హామీ అమలుకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరించలేదు. ఇప్పుడు అదే కేసీఆర్ తన పార్టీని ఏపీలో విస్తరించాలనుకున్నప్పుడు ఆ విషయంలో ఏం సమాధానం చెప్తారన్న ప్రశ్న ఏపీలోని రాజకీయ పక్షాల నుండి ఎదురవుతుంది. ప్రస్తుతం క్రిష్ణా జలాలపై ఏపీ, తెలంగాణల మధ్య నిత్యం విభేదాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో అక్రమంగా, పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఏపీకి నష్టం చేస్తోంది. ఈ విషయంలో క్రిష్ణా ట్రిబ్యునల్ వద్ద రెండు రాష్ట్రాల అధికారుల మధ్య పంచాయతీ నడుస్తోంది. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పకుండానే ఏపీలో కేసీఆర్ తన పార్టీని విస్తరించడానికి అవకాశం ఉంటుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వాటాలు, బకాయిలు
రాష్ట్ర విభజన తరువాత ఏపీలోని డిస్కమ్ ల ద్వారా విద్యుత్ వాడుకున్న తెలంగాణ ప్రభుత్వం 6 వేల కోట్లు ఏపీకి బకాయి పడింది. ఇన్నేళ్లయినా, కేంద్రం చెల్లించాలని ఆదేశించినా కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులు ఏపీకి ఇవ్వలేదు. ఇన్ని రకాలుగా రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేసీఆర్ వాటికి ఎటువంటి పరిష్కారం చూపి ఏపీలో పార్టీని విస్తరిస్తారని ప్రశ్నిస్తున్నారు.
విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లోని ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి కార్పొరేషన్లు, ఉమ్మడి సంస్థల్లో చట్టప్రకారం ఏపీకి 52 శాతం వాటా రావాలి. కానీ రాష్టం విడిపోయి తొమ్మిదేళ్లవుతున్నా కేసీఆర్ మాత్రం ఆ ఆస్తుల పంపకాన్ని పూర్తిచేయనివ్వడంలేదు. ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ వాటాగా,. ఆంధ్రప్రజల పన్నులతో నిర్మించిన ఆస్తులలో లక్షా 42 వేల కోట్ల విలువైన ఆస్తులు, డిపాజిట్లు ఇప్పటికీ ఏపీకి దక్కనివ్వలేదు. రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ రాష్ట్రానికి లక్షా 42 వేల కోట్ల ఆస్తులు దక్కకుండా చేసి ఏపీ భవిష్యత్ పైనే దెబ్బకొట్టిన కేసీఆర్ ఇప్పుడు వాటికి ఏం సమాధానం చెబుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
చదవండి: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.. ఇదండీ చరిత్ర
ఎవరో చేరితే దానికే గొప్పలా?
విభజన సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలకు పూనుకున్నా స్పందించని కేసీఆర్ ఏపీ ప్రజలకు మేలు చేస్తానని చెప్పడాన్ని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారా...? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పకుండా, విభజన సమస్యలు పరిష్కరించకుండా, ఆంధ్రప్రదేశ్‌కి దక్కాల్సిన వాటాని ఇవ్వకుండా ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరించడం భ్రమే అవుతుందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.
హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఏపీకి చెందిన కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరినా దాని ఫలితం ఏపీ రాజకీయాల్లో ఉండే అవకాశం ఎంత మాత్రమూ లేదు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఏపీ ప్రజల కోసం ఎలా స్పందిస్తారో.. ఏపీకి చేసిన అన్యాయాన్ని ఎలా సరిచేస్తారో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment