ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్‌ ఏం చేయబోతున్నారు? | Warangal Politics Which Has Become Interesting | Sakshi
Sakshi News home page

ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్‌ ఏం చేయబోతున్నారు?

Published Mon, Dec 12 2022 4:39 PM | Last Updated on Mon, Dec 12 2022 4:46 PM

Warangal Politics Which Has Become Interesting - Sakshi

ఓరుగల్లు గులాబీ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఉమ్మడి జిల్లాలో కాక రేపింది. సిట్టింగ్‌లకే సీట్లని చెప్పడంతో ఆశావహుల్లో గుబులు రేగింది. మరి టిక్కెట్లు ఆశించినవారు ఎదురుతిరిగితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గులాబీ కోట బీటలు వారుతుందా? ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?

రాబోయే కాలానికి కాబోయే లీడర్‌
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్ నేనేనంటూ తిరిగిన నాయకులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు గులాబీ దళపతి సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే సీట్లని ప్రకటించడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలకు కాస్త ఊరటనిచ్చినా, టిక్కెట్లు ఆశిస్తున్నవారిని మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ఇద్దరు కలిసిన టిక్కెట్లపైనే చర్చించుకుంటున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పలు మార్లు పొటీకి దూరమైన నేతలను ఆలోచనలో పడేసి ఆందోళనకు గురిచేస్తోందట. అలా టిక్కెట్ రాదని ఖరారు చేసుకున్న నేతలు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే పనిలో నిమగ్నమవుతున్నారట. 

ఆ ఏడింట్లో సెగలే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ములుగు మినహా.. మిగిలిన 11 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీటిలో ఏడు చోట్ల గులాబీ గూటిలోనే పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట, నర్సంపేటలో మాత్రమే సిట్టింగ్‌లకు పోటీ లేదు. మిగతా అన్ని చోట్లా సిట్టింగ్‌లకు పోటీగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉద్యమ కాలం నాటి నాయకులు మేమున్నానంటూ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. పలు చోట్ల కొంతకాలం నుంచి రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు అనేకసార్లు బయట కూడా పడ్డాయి. ఎత్తుకు పై ఎత్తులతో టిక్కెట్ సాధించుకునే పనిలో గులాబీ నేతలు ఉండగా సిట్టింగ్‌లకే మళ్ళీ అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం ఆశావహులకు మింగుడు పడటం లేదు.

ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ
స్టేషన్ ఘనపూర్‌లో తాటికొండ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లేదా ఆయన కూతురు కావ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. రాజయ్య, కడియం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. సీఎం నిర్ణయం మళ్లీ ఇద్దరి మద్య అగ్గికి ఆజ్యం పోసినట్లయిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు పోటీగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టికెట్ ఆశిస్తున్నారు.

భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన గండ్ర వెంకట రమణారెడ్డికి పోటీగా.. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి టికెట్ రేసులో ఉన్నారు. డోర్నకల్ లో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ స్థానంలో మంత్రి సత్యవతి రాథోడ్ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ ఉండగా అక్కడ ఎంపి కవిత టిక్కెట్ కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మద్య విబేధాలు బజారుకెక్కాయి. ఇక పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పోటీగా.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు విమోచన కమిటీ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు టిక్కెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పోటీగా.. ఎమ్మెల్సీ పోచంపల్లితో పాటు మరో నాయకుడు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
చదవండి: బీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు

తెరపైకి ఆపరేషన్‌ ఆకర్ష్‌
గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే సీట్లని ప్రకటించిన గులాబీ దళపతి.. కొండ సురేఖకు హ్యాండిచ్చారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి సైతం రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదే నిజమైతే సిట్టింగ్‌లకు  సైతం ప్రమాదం పొంచి ఉంది. గత అనుభవం దృష్ట్యా ఆశావహుల్లో ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మరోవైపు.. కేసీఆర్ ప్రకటన తర్వాత అసంతృప్త నేతల కోసం కాంగ్రెస్, బీజేపీలు కాచుకుని కూర్చున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టి టిక్కెట్ రాదని నిర్ధారించుకున్న వారిని తమ వైపు తిప్పుకునే విధంగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నాటికి గులాబీ గూటిలో ఉండేదెవరో పోయేదెవరో అంటూ.. కేడర్ చర్చించుకుంటోంది.  
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement