సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్.. సంస్థాగత లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. కేటీఆర్‌తో పాటు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇటీవలి కాలంలో జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, కేడర్‌తో సమన్వయం ఎంత మేర ఉంది వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు. ఆయా అంశాలపై కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్లు సమాచారం. కాగా కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం.. పార్టీలో బహుళ నాయకత్వమున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు కీలక నేతల్లో అసంతృప్తి ఉంది. దీంతో ఈ అసంతృప్తి మరింత ముదరక ముందే సయోధ్య కుదర్చాలని నిర్ణయించి ఆ మేరకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పొంగులేటి ఇంట్లో భోజనం
► ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతుండటంతో నేతల నడుమ విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు తమ సొంత రాజకీయ అస్తిత్వం కోల్పోకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి ఖమ్మం పర్యటన సందర్భంగా పొంగులేటి నివాసంలో భోజనం చేసిన కేటీఆర్, పార్టీ జిల్లా కార్యాలయంలో కీలక నేతలందరితోనూ భేటీ అయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలని, సమర్ధత ఆధారంగానే టికెట్ కేటాయింపులు ఉంటాయని ప్రకటించడంతో సిట్టింగులు, మాజీల్లో కొత్త ఆశలు చిగురించాయి.
జూపల్లి ఇంటికెళ్లి మంతనాలు
► నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి నడుమ తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొల్లాపూర్ పర్యటనకు ముందే ప్రగతిభవన్‌లో కేటీఆర్ ఆ నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే కొల్లాపూర్‌లో జరిగిన సభకు జూపల్లి దూరంగా ఉండటంతో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. ఈ భేటీ తర్వాత జూపల్లి వర్గంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
పార్టీని వీడకుండా జాగ్రత్తలు
► ఇటీవలి కాలంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ విప్ నల్లాలు ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరోవైపు దివంగత మాజీ మంత్రి పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరుతున్నారు. 2018 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బహుళ నాయకత్వమున్న నియోజకవర్గాల్లో మరికొందరు నేతలు కూడా టీఆర్‌ఎస్‌ను వీడి ఎన్నికల నాటికి ఇతర పార్టీల్లో చేరతారనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందనే భరోసా ఇచ్చేందుకే కేసీఆర్ ఆదేశాలకు మేరకు కేటీఆర్ దిద్దుబాటుకు దిగినట్లు సమాచారం.
అలకల కారుకు.. కేటీఆర్ రిపేరు
Published Tue, Jun 21 2022 1:47 AM | Last Updated on Tue, Jun 21 2022 9:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment